రక్తం చిందిస్తున్న జలపాతం.. కారణం ఏంటో తెలుసా

ప్రపంచంలోని ఎన్నో అంతుచిక్కని వింతలు, విశేషాలు కనిపిస్తూ ఉంటాయి.

Update: 2024-02-07 13:16 GMT

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని ఎన్నో అంతుచిక్కని వింతలు, విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. వీటి గురించి అధ్యయనం చేయాలంటే చాలా కష్టం. ముఖ్యంగా ప్రకృతిలో నెలకొని ఉండే కొన్ని వింతలను విశేషాల గురించి ఎంత తెలుసుకుందాం అనుకున్నా వీడని మిస్టరీగానే ఉండిపోతాయి. అలాంటి మిస్టరీనే ‘బ్లడ్ ఫాల్’. పేరు వింటేనే కొత్తగా ఉంది కదా. వాస్తవానికి జలపాతం అనగానే అందరికీ కొండల పై జలజల సందడులు చేస్తూ పాల నురగ లాంటి నీళ్లు జాలువారుతూ కనిపిస్తూ ఉంటాయి.

కాని ఇప్పుడు మనం చెప్పుకునే జలపాతంలోనీ నీరు ఎర్రగా రక్తం రంగులో పారుతూ ఉంటాయి. పూర్తిగా మంచుతో కప్పి ఉండే అంటార్కిటికాలోని విక్టోరియా ల్యాండ్‌లోని మెక్‌ముర్డో డ్రై వ్యాలీస్‌లో ఉన్న ఉప్పునీటి జలపాతమే రక్త జలపాతం (బ్లడ్ ఫాల్స్). అందులో ఉండే నీరు ఎరుపు రంగులో ఉండడంతో ఈ జలపాతానికి ఆ పేరు వచ్చింది. ఈ జలపాతం టేలర్ గ్లేసియర్ పాదాల వద్ద నుండి బోనీ సరస్సులోకి ప్రవహిస్తుంది. ఈ జలపాతాన్ని 1911లో ఆస్ట్రేలియన్ జియాలజిస్ట్ థామస్ గ్రిఫిత్ టేలర్ కనుగొన్నాడు. దీన్ని థామస్ గ్రిఫిత్ టేలర్ కనుగొన్నందుకు అతని పేరును పెట్టారు. మొదట ఈ జలపాతంతో పారే నీరు ఎర్రగా ఉండేందుకు ఎర్ర ఆల్గే కారణం అని అంటార్కిటికా సైంటిస్ట్ లు అనుకున్నారు. ఆ తర్వాత నీటిలో అధిక ఐరన్ ఆక్సైడ్‌ ఉండడం వలన నీరు ఎర్ర రంగులోకి మారుతుందని కనుగొన్నారు. రసాయనాలు, సూక్ష్మజీవులతో సహా నీటి నమూనాలను పరిశీలించారు.

బ్లడ్ ఫాల్స్ ఇనుముతో కూడిన ఎర్ర రంగులో ఉండే హిమానీనదం. ఈ ఎర్రరంగు ప్రవాహం మంచు కింద నుండి దాదాపు 400 మీ (1,300 అడుగులు) లోతు నుండి ప్రవహిస్తుంది. ఈ బోనీ సరస్సు వయస్సు సుమారు 1.5 మిలియన్ సంవత్సరాలు ఉంటుంది. 1 మిలియన్ సంవత్సరాల క్రితం వాతావరణం మారడంతో సముద్రం వెనక్కి వెళ్లడంతో, ఉప్పునీరు లోయను ఆక్రమించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సరస్సు అడుగున నిక్షిప్తమైన సముద్రపు నీరులో ఉండే ఉప్పు ఇనుమును కలిగి ఉంటుందని తెలిపారు. సరస్సులోని నీటి ఉష్ణోగ్రత -5 డిగ్రీల సెల్సియస్, నీరు చాలా ఉప్పగా ఉంటుంది. సరస్సులోని నీటి లవణీయత సముద్రంలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ, కాబట్టి నీరు -10 ° C వద్ద కూడా గడ్డకట్టదు. లోయలో ఐరన్‌ కంటెంట్‌తో కూడిన ఉప్పునీరు అధికంగా ఉండడం దీనికి కారణమని పరిశోధకులు తెలిపారు.

ఈ సరస్సులో కాంతి, ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుందని, ఐరన్ కంటెంట్ ఉన్న ద్రవం గాలిలో ఉన్న ఆక్సిజన్‌తో తాకినప్పుడు అది తుప్పు పట్టి, నీరు రక్తం రంగులో ఎర్రగా మారుతుందని వెల్లడించారు. ఈ బ్లడ్ ఫాల్స్ ఎత్తు ఐదంతస్తుల భవనంతో సమానం. టెన్నెస్సీ విశ్వవిద్యాలయంలోని జియో మైక్రోబయాలజిస్ట్ జిల్ మికుకీ ప్రకారం, బ్లడ్ ఫాల్స్ నీటిలో ఆక్సిజన్ లేదని పరిశోధకుల బృందం పరిశోధన తర్వాత కనుగొంది. అయితే ఇందులో 17 రకాల సూక్ష్మజీవులు ఉన్నాయట.

Tags:    

Similar News