పిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ హాబిట్స్ నేర్పించండి.. సగం కష్టాలు గట్టెక్కినట్టే!

‘‘ఆ విషయాలు పిల్లలకెందుకు చెప్పడం, ఇప్పుడే వారికెందుకు నేర్పించడం అనుకుంటాం కానీ.. ఒక్కసారి చెప్పి చూడండి ఊహించని అనుభవాన్ని ఎదుర్కొంటారు.

Update: 2024-06-14 07:52 GMT

దిశ, ఫీచర్స్ : ‘‘ఆ విషయాలు పిల్లలకెందుకు చెప్పడం, ఇప్పుడే వారికెందుకు నేర్పించడం అనుకుంటాం కానీ.. ఒక్కసారి చెప్పి చూడండి ఊహించని అనుభవాన్ని ఎదుర్కొంటారు. ఏదో ఒకరోజు సగం కష్టాల నుంచి గట్టెక్కామన్న ఫీలింగ్ కలుగుతుంది’’ అంటున్నారు ఫైనాన్షియల్ నిపుణులు. ఇంతకీ ఏ విషయం అనుకుంటున్నారా?.. మనీ సేవింగ్. చిన్నప్పటి నుంచే డబ్బు ఆదా చేయడం పిల్లలు నేర్చుకోగలిగితే పేరెంట్స్‌కు చాలా హెల్ప్ అవుతుంది. చిన్న మొత్తాల పొదుపు పెద్ద కష్టాల నుంచి బయటపడేస్తుంది. పిల్లల్లో ఆర్థిక క్రమశిక్షణ కూడా పెరుగుతుంది.

ఏ వయస్సు నుంచి ప్రారంభించాలి?

చిన్న పిల్లలు చాలా విషయాల్లో పేరెంట్స్‌ను, ఇతర పిల్లలను అనుసరిస్తుంటారు. ఇతరులు చాక్లెట్లు, ఆట వస్తువులు కొంటే తమకూ కావాలని మారాం చేస్తుంటారు. పేరెంట్స్ విచ్చల విడిగా ఖర్చు చేస్తుంటే పిల్లలూ అదే నేర్చుకుంటారు. కాబట్టి పిల్లల ముందు ఎలా వ్యవహరించాలో తెలిసుండాలి. అవసరం అయితే నిపుణులు, పెద్దల సలహాలు తీసుకోవాలి. డబ్బు పొదుపు చేస్తే ఎలాంటి మేలు జరుగుతుందో పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. నాలుగేండ్ల వయస్సు నుంచే పిల్లలకు డబ్బు విలువు, పొదుపు గురించి చెప్పడం, నేర్పించడం చేస్తుంటే కనీసం ఏడెనిమిదేండ్ల వయస్సులో వారు అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రతిదీ కొనివ్వాలని పేరెంట్స్‌తో మారాం చేయడం, బలవంతం చేయడం తగ్గించుకుంటారు.

డబ్బు అవసరాల గురించి వివరించండి

పిల్లలకు డబ్బు, కష్టం వంటి విషయాల్లో అవగాహన ఉండదు. కాబట్టి తమకు నచ్చింది కొనియ్యాలని అడుగుతుంటారు. ఇక్కడే తల్లిదండ్రులు వారిని మోటివేట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అడిగిన ప్రతిదీ అవసరం లేకపోయినా కొనివ్వడం అలవాటు చేయకూడదు. కచ్చితమైన వాటినే కొనిస్తూ అవసరం లేనివి కొంటే ఏం జరుగుతుందో, ఎలాంటి నష్టం జరుగుతుందో వివరించాలి. కొన్నింటిని అసలు కొనుగోలు చేయకపోవడంవల్ల పోగుబడే డబ్బుతో తర్వాత ఎన్ని డ్రెస్సులు వస్తాయో, షూలు, బ్యాగులు, సైకిల్, ఆట వస్తువులు, ఇంకా ఇతర ఏవైనా వస్తువులు ఎలా కొనుగోలు చేయవచ్చో చెప్పడంవల్ల పిల్లల్లో ఆసక్తి కలుగుతుంది. ఈ క్రమంలో డబ్బు విలువ అర్థం చేసుకుంటారు.

పిగ్గీ లేదా కిడ్డీ బ్యాంకులు కొనివ్వండి

పిల్లలకు అవసరంలేని వస్తువులు, ఆరోగ్యానికి మేలు చేయని తినుబండారాలు కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడల్లా వాటికి అయ్యే డబ్బులను భద్ర పర్చడం నేర్పాలి. అందుకోసం వారికి పిగ్గీ లేదా కిడ్డీ బ్యాంకులు కొనివ్వాలి. ప్రస్తుతం మార్కెట్లో రంగు రంగుల బొమమ్మలతో ఆకట్టుకునే పిగ్గీ బ్యాంకులు ఉన్నాయి. పిల్లలు వాటి ఆకారాన్ని చూసి కూడా అందులో డబ్బు వేయాలని ఉత్సాహ పడుతుంటారు. అనవసరంగా చాక్లెట్ కొనేబదులు కిడ్డీ బ్యాంకులో చిల్లర వేయడానికి ఇష్టపడుతుంటారు. ఇలా చేస్తూ ఉంటే కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత డబ్బు పోగుబడుతుంది. పదేళ్లలోపు పిల్లలు ఈ అలవాటువల్ల ఏడాదికి కనీసం 20 నుంచి 40 వేలవరకు డబ్బు ఆదా చేస్తున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. స్కూల్స్ ఓపెనింగ్స్ వేళ పిగ్గీ బ్యాంకుల నుంచి తీసిన డబ్బులు పిల్లల ఫస్ట్ టెర్మ్ ఫీజులకు లేదా బుక్స్‌కు ఉపయోగడే అవకాశం ఉంటుంది. దీంతో తల్లిదండ్రుల ఖర్చు కూడా తగ్గి ఆపద సమయంలో సగం కష్టాలు గట్టెక్కిన భావన కలుగుతుంది. కాబట్టి పిల్లలకు మనీ సేవింగ్ హాబిట్స్ తప్పక నేర్పించాలంటున్నారు నిపుణులు. 


Similar News