Childhood Memory.. శిల్కల పేర్.!

ఒకప్పుడు పల్లెల్లో ‘పచ్చీస్ల పేర్’మధురానుభూతి.

Update: 2025-03-22 15:28 GMT
  • whatsapp icon

‘నోరు తీపి చేసుడు’...

అనాదిగా వస్తున్న అచారం.

మంచి జరిగితే..

పదిమందితో పంచుకుంటాం

సంతోషమూ.. సంబరమే.

ఆ సంబరం తాలూకు ప్రతీకే తీపి.

ఇప్పడంటే ‘ముక్క.. సుక్క’నడుస్తోందిగానీ..

ఒకప్పుడు పల్లెల్లో ‘పచ్చీస్ల పేర్’మధురానుభూతి.

దిశ, ఫీచర్స్: 

90s కిడ్స్‌కు నోరూరించే మంచి సోపతైన ఐటమ్ ఈ ‘పచ్చీస్ల పేర్’. కొన్ని ఏరియాల్లో దీనిని ‘మిఠాయి పేర్’అనీ.. ఇంకొన్ని ఏరియాల్లో ‘శిల్కల పేర్’లని అంటారు. బాల్యంతో బంధాన్ని ఏర్పరచుకుంది ఇది. హోలీ పండగకు అక్కడక్కడ కనిపించి అప్పటి స్వీట్ మెమొరీస్ ని గుర్తుచేశాయి. ఇంటికి అమ్మమ్మనో.. తాతనో.. లేదా మేన మామనో వస్తే కచ్చితంగా మిఠాయి పేర్ తీసుకొస్తారని ఎదురుచూసేవాళ్లు.

హోలీ స్పెషల్

చిన్న పిల్లల మీది నుంచి నజర్ పోవడానికి ‘శిల్కల పేర్ ’ను అమ్మమ్మలు.. నాయినమ్మలు పెట్టేవారు. రాఖీల పున్నానికి పీటెలేసి ఎట్లయితే కుంకుమ బొట్టుపెట్టి కూర్చోబెడతరో సేమ్ అట్లనే హోలీ పండుగకు ‘శిల్కల పేర్ ’ను మెడలో వేసేవారు. స్థోమత ఉంటే కొత్త బట్టలు కూడా పెడుతుండె. బావ మరదళ్లు.. వదిన మరిది వరసయ్యేవాళ్లు హోలీ పండక్కి రంగులు చల్లుకుంటే ఆనవాయితీ ప్రకారం రంగు పూసినవాళ్లు మిఠాయి పేర్ తీసుకొచ్చి మెడలో వేసేవాళ్లు. ఒకవేళ అలా చేయకపోతే డిమాండ్ చేసి మరీ తెప్పించుకునేవాళ్లు. అందుకే ఇది హెలీ పండుగ స్పెషల్ స్వీట్ అయ్యింది.

వన భోజనాల్లో..

హోలీ.. ఉగాది పండగల మధ్యలో తెలంగాణలోని పల్లెల్లో వనభోజనాలకు వెళ్లేవాళ్లు. "చెట్లకిందికి పోవుడు" అని కూడా అంటారు. ఇప్పుడంటే కార్తీకమాస వనభోజనాలని వెళ్తున్నారుగానీ.. అప్పట్లో ఉగాది సందర్భంగానే ఈ వనభోజనాలు ఉండేవి. పెద్దొళ్లేమో కల్లు.. నాటు కోడి.. జొన్న రొట్టెలు.. బగార బువ్వ తినేవాళ్లు. చెట్లకు ఉయ్యాల కట్టి చిన్న పిల్లలను వాటిలో ఊపేవాళ్లు. అలా ఉయ్యాలలో ఊగుతున్నప్పుడు వారి మెడలో ఈ "మిఠాయి పేర్" ఉండేది.

తీరొక్క రంగుల్లో..

స్వీటును శుభ సూచకంగా భావిస్తారు. పండుగలప్పుడు.. పబ్బాలప్పుడు పిల్లల మెడలో ఈ పచ్చీస్ల పేర్ వేస్తే ఎలాంటి దుష్టశక్తి వాళ్లను చేరకుండా గ్రామ దేవతలు కాపాడతారని నమ్మకం. వాళ్లమీద చెడు నజర్ ఉన్నా తొలగిపోతుందనే నమ్మకం. కొన్నిచోట్ల కొత్తగా పెళ్లయిన వధూ వరుల మెడలో కూడా ఈ దండలేస్తుంటారు. అన్న పెండ్లో.. తమ్ముడి పెండ్లో అయినప్పుడు ఆడబిడ్డ కట్నంగా ఏమేమిస్తారని జరిగే తంతులో ఆడబిడ్డ మెడ నిండా ఈ మిఠాయి పేర్ వేస్తారు. చెక్కర పాకంతో వీటిని తయారుచేసి తీరొక్క రంగులు అద్దుతారు. పచ్చీస్ల పేర్ వేయడమనేది ఒక గౌరవ సూచకం. పుట్టింటి చీరకు.. సారెకు ఎంత ప్రయారిటీ ఉంటుందో దీనికీ అంతే ప్రయారిటీ. ఈ తంతులన్నింటి ఉద్దేశం అందరూ సల్లంగా ఉండాలని.

Tags:    

Similar News