ఒకే కాలుతో సైకిల్ నడుపుతూ దేశాన్ని చుట్టొస్తా: గీత
మహిళల ప్రత్యేక సోలో కేటగిరీ సైక్లింగ్ రేసులో శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు సాగే ఐకానిక్ సైకిల్ రైడ్‌ని పూర్తిచేస్తానని, ఒకే కాలు
దిశ, తెలంగాణ బ్యూరో: మహిళల ప్రత్యేక సోలో కేటగిరీ సైక్లింగ్ రేసులో శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు సాగే ఐకానిక్ సైకిల్ రైడ్‌ని పూర్తిచేస్తానని, ఒకే కాలుతో సైకిల్ నడిపి దేశాన్ని చుట్టొస్తానని ఒలింపిక్ ట్రై అథ్లెట్, పారా సైక్లింగ్ చాంపియన్ గీత ఎస్. రావు తెలిపారు. ఎడమ కాలికి పోలియో ఉండటంతో ఆమె ఒక కాలితోనే పుష్ చేస్తూ సైకిల్ నడుపుతూ ఇప్పటికే డీఎస్‌ఆర్, ఒలింపిక్ ట్రై అథ్లెట్, పారా సైక్లింగ్ 2022 చాంపియన్‌గా నిలిచారు. కాగా సుషేనా హెల్త్ ఫౌండేషన్ టీం సభ్యులను కలిసేందుకు శనివారం ఆమె నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె నిలోఫర్, ఈఎస్‌ఐ నిర్వహిస్తున్న ‘ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్’ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్ట్ ని సందర్శించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. త్వరలో భారతదేశపు ఐకానిక్ సైకిల్ రేస్ జుమ్ము కశ్మీర్ శ్రీనగర్ నుంచి ప్రారంభమై తమిళనాడులోని కన్యాకుమారిలో ముగుస్తుందని తెలిపారు. 3,651కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుందన్నారు. ఈ రేస్ దేశంలోని అందమైన ప్రదేశాల గుండా సాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా సాగే జాతీయ స్థాయి అల్ట్రా సైక్లింగ్ రేస్ అని తెలుపుతూ ఇందులో దేశంతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సోలో, రిలే టీంలు పాల్గొంటాయని తెలిపారు. 12 రోజుల్లో 12 రాష్ట్రాలను దాటుతూ 3,651 కిలోమీటర్లను పూర్తిచేస్తానని ఈ సందర్భంగా ఆమె ధీమా వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ రేస్ కు సుషేనా హెల్త్ ఫౌండేషన్ అధికారిక భాగస్వామిగా ఉంది.
కాగా ఈ స్లైకింగ్ రేసులో గీతా ఎస్ రావుకు ఫౌండేషన్ మద్దునిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తన రేస్ లో భాగంగా తల్లిపాలే ఉత్తమ ఆహారం అనే నినాదంతో దేశంలో తల్లిపాలపై అవగాహన కల్పించడంపై ప్రచారం చేస్తానని గీతా ఎస్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి, ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్ క్రాలేటి, నియోనాటాలజీ హెచ్‌ఓడీ అలిమేలు మాదిరెడ్డి, సుషేనా హెల్త్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కలవలపల్లి దుర్గాభవాని, అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ ముర్కి, తదితరులు పాల్గొన్నారు.