వైద్య వృత్తి పవిత్రం... వైద్యులు ప్రాణదాతలు (జాతీయ వైద్యుల దినోత్సవం)
వైద్యో నారాయణో హరి అంటారు. ప్రాణం పోసే వాడు దేవుడైతే, ప్రాణాలను నిలబెట్టే వారు వైద్యులు. వైద్యులను దేవుళ్లతో సమానంగా పూజిస్తారు. అందుకే వైద్యో నారాయణో హరి అనే సామెత చిరస్థాయిగా నిలిచింది.
దిశ, వెబ్‌డెస్క్: వైద్యో నారాయణో హరి అంటారు. ప్రాణం పోసే వాడు దేవుడైతే, ప్రాణాలను నిలబెట్టే వారు వైద్యులు. వైద్యులను దేవుళ్లతో సమానంగా పూజిస్తారు. అందుకే వైద్యో నారాయణో హరి అనే సామెత చిరస్థాయిగా నిలిచింది.అన్ని వృత్తుల కెల్లా వైద్య వృత్తి పవిత్రమైనది. మానవీయ సేవ యొక్క కృషిని గుర్తించుట లక్ష్యంగా ప్రతి సంవత్సరం జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్నాం. భారతదేశంలో మొదటిసారిగా 1991 నుండి జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుతున్నారు. దేశం కోసం, రోగుల కోసం 81 సంవత్సరాలుగా గొప్ప సేవలందించి వైద్య రంగానికి విశేష కృషి చేసిన డాక్టర్ బి.సి.రాయ్ జయంతిని జాతీయ వైద్యుల దినోత్సవం గా జరుపుకుంటున్నాము.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన డాక్టర్ బి దాన్ చంద్ర రాయ్ (బి.సి రాయ్) గొప్ప వైద్యులు. ప్రఖ్యాత విద్యావేత్త, స్వాతంత్ర సమరయోధులు. డాక్టర్ బి.సి.రాయ్ బెంగాల్ ప్రెసిడెన్సీ లోని బీహార్ రాష్ట్ర పాట్నా జిల్లా లోని బ్యాంకి పూర్‌లో (ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, కలకత్తా) 1882 జులై 1వ తేదీన జన్మించారు. తండ్రి ప్రకాష్ చంద్ర రాయ్, తల్లి అఘోర్ కామినీ దేవి. పాట్నాలో ప్రాథమిక విద్య, ఉన్నత విద్య పూర్తయిన అనంతరం 1909 లో ఇంగ్లాండ్‌కు వెళ్లి లండన్‌లో సెయింట్ సెయింట్ బార్త్ మెవ్ కాలేజీలో ఎం ఆర్ సి పి మరియు ఎఫ్ ఆర్ సి ఎస్ అదే మెడికల్ డిగ్రీలను ఏకకాలంలో పూర్తిచేసి 1911 లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కోల్ కత్తా లోని మెడికల్ కాలేజీలో అధ్యాపకుడిగా పని చేశారు. 1911 లో కలకత్తాలో వైద్యవృత్తిని ప్రారంభించాడు. 1922-28 మధ్యకాలంలో కలకత్తా మెడికల్ జర్నల్‌కు సంపాదకత్వం బాధ్యతలు నిర్వహించాడు.
భగ్న ప్రేమికుడు.. వైద్యమే జీవితంగా మల్చుకుని
వైద్య వృత్తిని నమ్ముకుని పేద ప్రజలకు సేవ చేస్తునే జాదవ్ పూర్ టీబి ఆస్పత్రి, కమల నెహ్రూ ఆసుపత్రి, విక్టోరియా ఇన్స్టిట్యూట్, చిత్తరంజన్ దాస్ క్యాన్సర్ హాస్పిటల్, ఆర్ జి బార్ మెడికల్ కాలేజీని స్థాపించిన గొప్ప వ్యక్తి. అలాగే మహిళల కోసం, పిల్లల కోసం ప్రత్యేకంగా 1926లో చిత్తరంజన్ సేవాదళ్ అనే వైద్యశాలను ఏర్పాటు చేశారు. మహిళల కోసం నర్సింగ్ శిక్షణ కళాశాలలో కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించారు. డాక్టర్ బి.సి.రాయ్ 1925 లో రాజకీయ రంగ ప్రవేశం చేసి పశ్చిమ బెంగాల్లోని బరాక్ పూర్ నియోజకవర్గం నుంచి శాసన సభ్యునిగా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. తర్వాత 1928 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ లో సభ్యుడయ్యాడు. బీసీ రాయ్ గాంధీ నాయకత్వంలో భారత స్వాతంత్ర్య ఉద్యమం జరుగుతున్న రోజుల్లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నాడు. గాంధీ పిలుపు మేరకు పశ్చిమ బెంగాల్ లో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు.
కలకత్తా లోని కార్పొరేషన్‌కు 1931 నుండి 1933 వరకు ఆరవ మేయర్‌గా ఉన్నాడు. కలకత్తా నగరం పారిశుధ్యం లోపించి అనేక సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో తీర్చిదిద్దాడు. కలకత్తా లోని పురాతన వైద్యుడు నీల్రాతన్ సర్కారు కూతురు కళ్యానీ ని ఇష్టపడ్డాడు. కానీ వారి కుటుంబం తిరస్కరించడం వల్ల వివాహం చేసుకోలేదు. కానీ కళ్యాణి జ్ఞాపకార్థం పశ్చిమబెంగాల్లోని ఒక పట్టణానికి కళ్యాణి అనే నామకరణం చేశాడు. 1942 నుంచి 44 వరకు కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ఎన్నికైనాడు. 19 43 లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌కు అధ్యక్షుడైనాడు.
వైద్యుడు, మేయర్, ఎమ్ఎల్ఎ, ముఖ్యమంత్రి బీసీ రాయ్
మహాత్మా గాంధీ సూచన మేరకు బెంగాల్‌లో ఉన్న పరిస్థితులను బట్టి 1948 నుండి 1962 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ప్రజల మన్ననలను పొందాడు. దేశ చరిత్రలో ఒక సాధారణ వైద్యుడు మేయర్‌గా, శాసనసభ్యునిగా, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి బీసీ రాయ్అని చెప్పవచ్చు. వైద్య వృత్తికే కాకుండా ప్రజా సేవకు అంకితమైన తన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం తన జయంతిని జాతీయ వైద్యుల దినోత్సవం గా ప్రకటించింది. తన జ్ఞాపక శక్తిని శాశ్వతం చేయడానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1962లో నేషనల్ అవార్డు ఫండ్‌ను స్థాపించింది. మెడికల్ రంగంలో వివిధ శాఖలలో ప్రత్యేక అభివృద్ధి ప్రోత్సహించడంలో ప్రతిభను గుర్తించుటకు డాక్టర్ బి.సి.రాయ్ పేరుమీద 1976లో నేషనల్ అవార్డును స్థాపించారు.
భారత ప్రభుత్వం 1961 ఫిబ్రవరి 4న భారత అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న బిరుదుతో సత్కరించింది. జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని వైద్యులు అందించే విలువైన సంరక్షణ గురించి తెలుసుకోవడానికి ఈ వేడుకలు దోహదపడతాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాలు, వర్క్ షాపులు, రోగులకు పండ్లు ,మందుల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. వైద్య సేవలకు గుర్తుగా రోగులు కూడా వైద్యులకు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, గ్రీటింగ్ కార్డులు, బహుమతులు ఇచ్చి సత్కరిస్తారు.
వైద్యులకు సమాజం సహకరించాలి
డాక్టర్ బి.సి.రాయ్ మరణించేంత వరకు ప్రజాసేవలో ఉంటూ 1962 జూలై 1 న పరమపదించారు. తన పుట్టినరోజు, వర్ధంతిని ఒకే రోజున జరుపుకోవడం యాదృచ్చికం. కోవిద్ 19, కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మన కంటికి కనిపించని వైరస్‌తో పోరాటం చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వైద్యులు సేవలు గొప్పవి. ప్రాచీనకాలం నకు ఇప్పటికే పోల్చినట్లయితే వైద్యరంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రక రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అయినా కూడా మార్పులు కనుగుణంగా వైద్యులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రోగులకు సేవలందిస్తున్నారు.
కరోనా వైరస్‌తో జరుగుతున్న పోరాటంలో వైద్యులు తమ ఇంటికి కుటుంబాల కంటే ఆసుపత్రులకే ప్రాధాన్యమిచ్చారు. కొన్నిచోట్ల వైద్యులు, వైద్య సిబ్బంది కూడా వైరస్ బారిన పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా వారు నిరంతరం రోగులకు సేవలు చేస్తున్న సందర్భంలో కూడా అక్కడ అక్కడక్కడ రోగులకు సంబంధించిన బంధువులు హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారు. అందుకే ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. వైద్యులు చేసే సేవలు అనన్యమైనవి, అమోఘమైనవి. వారికి ఈ సందర్భంగా సమాజమంతా సహకరిస్తూ వారిని అభినందించాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు, వైద్య సిబ్బందికి డాక్టర్స్ డే సందర్భంగా వందనాలు.
కామిడి సతీశ్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
98484 45134
Read More: 60 ఏళ్లుగా నిద్రపోని వియత్నాం వృద్ధుడు.. ఫుల్లుగా మందేసినా సరే..