Reverse psychology : అవునంటే కాదని..! కాదంటే అవునని..!! రివర్స్ సైకాలజీ చేసే అద్భుతాలేంటో తెలుసా?
Reverse psychology : అవునంటే కాదని..! కాదంటే అవునని..!! రివర్స్ సైకాలజీ చేసే అద్భుతాలేంటో తెలుసా?
దిశ, ఫీచర్స్ : ఒకరి మనసును, మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం, సానుకూల ఆలోచనలతో, అవగాహనతో విజయం వైపు పరుగెత్తించడం వంటి అంశాల గురించి మనకు తెలిసిందే. జీవితంలోని అనేక సందర్భాల్లో ఆయా వ్యక్తులను ప్రోత్సహించడంలో, అనుకున్నవి సాధించేలా ముందుకు నడిపించడంలో అవి సహాయపడుతుంటాయని చెప్తారు. అయితే ఎల్లప్పుడూ సానుకూల దృక్పథమే పనిచేయకపోవచ్చు అంటున్నారు నిపుణులు. ‘అవునంటే కాదనిలే.. కాదంటే అవునని లే’ అన్నట్లు కొందరు వ్యక్తుల మనస్తత్వం భిన్నంగా ఉంటుంది. వీరు వద్దన్నది చేస్తారు. చేయమన్నది అస్సలు చేయరు. ముఖ్యంగా టీనేజర్స్‌లో ఈ ప్రవర్తన కనిపిస్తుంది. అలాంటప్పుడు వారిని మంచి మార్గంలో నడిపించాలంటే రివర్స్ సైకాలజీ మెరుగ్గా పనిచేస్తుందని మానసిక నిపుణులు చెప్తున్నారు. అలాంటి కొన్ని సందర్భాల గురించి చర్చిద్దాం.
‘ప్రతికూల వైఖరి’తో వ్యవహరించడం
‘మంచిగా చెబుదాం.. మంచిగా మాట్లాడుదాం.. మంచి మాటలతో ఎదుటి వ్యక్తిని దారిలోకి తెద్దాం. వాస్తవాలను అర్థం చేసుకునేలా చేద్దాం’ అనుకునే వారు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా పేరెంట్స్ తమ పిల్లలను, ఉపాధ్యాయులు విద్యార్థులను, మానసిక నిపుణులు బాధితులను ఇలా దారికి తెచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ కొందరి విషయంలో ఇది పనిచేయకపోవచ్చు. అలాంటప్పుడు అవతలి వ్యక్తిపట్ల వ్యతిరేక వైఖరి, ప్రతికూల దృక్పథం, హెచ్చరిక సంకేతాలు వంటివి ఉపయోగించాల్సి ఉంటుందని మానసిక నిపుణులు చెప్తున్నారు. అంటే ఇక్కడ రివర్స్ సైకాలజీ ప్రయోగించడంవల్ల మంచి మార్పు సాధ్యం అవుతుంది.
ఉదాహరణకు ఒక టీనేజర్స్ .. క్లాస్ ఎగ్గొట్టి సినిమాకు వెళ్లొద్దంటే తప్పక వెళ్లేందుకు ట్రై చేస్తాడు. బైక్ నడప వద్దంటే.. నడిపేందుకే మొగ్గు చూపుతాడు. మంచి మాటలతో, ప్రేమతో చెప్తే ఇక్కడ వినే పరిస్థితి ఉండదు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు రివర్స్ సైకాలజీ యూజ్ చేయవచ్చు. అతన్ని హెచ్చరించడానికి బదులు ‘నీకు ఇష్టమొచ్చిన మూవీస్ చూడాలని, అవసరం అయితే సెలవు పెట్టి వెళ్లాలని చెప్తూ తల్లిదండ్రులే సలహా ఇస్తే.. అప్పుడు ఆ టీనేజర్ ఉత్సాహ పడవచ్చు. ఆనంద పడవచ్చు. కానీ తర్వాత ఇంకెప్పుడూ క్లాస్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లొద్దనే ఆలోచనలో మాత్రం తప్పక పడతాడు అంటున్నారు మానసిక నిపుణులు.
పరోక్షంగా ఒప్పించడం
కొందరు వ్యాయామం చేయడానికి ఎల్లప్పుడూ ఒకసాకు చెప్తుంటారు. అలాంటి వారిని మంచి మాటలతో ఒప్పంచలేం అనుకున్నప్పుడు రివర్స్ సైకాలజీ పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజూ వ్యాయామం చేయాలని సలహా ఇచ్చే బదులు ఇతరుల ముందు లేదా కుటుంబ సభ్యుల ముందు అతన్ని పరోక్షంగా మాట్లాడటం ద్వారా మార్చవచ్చు ఉదాహరణకు ‘అతను చాలా బిజీ.. అయినా వ్యాయామానికి దూరంగా ఉండటం అతని స్వభావం కావచ్చు. ఎందుకు బలవంతం చేయడం’ అని సదరు వ్యక్తి వినేలా మాట్లాడి చూడండి. ఆ తర్వాత తప్పక ఆలోచనలో పడతారు.
క్రియేటివిటీని వెలికి తీయడం
ఆటంకాలను, ఇబ్బందులను అధిగమించడానికి, సృజనాత్మకతను బయటకు తీయడానికి అవతలి వ్యక్తులను మార్చడానికి కూడా రివర్స్ సైకాలజీని ఉపయోగించిన వారు చరిత్రలో చాలా మంది కనిపిస్తారని నిపుణులు అంటుంటారు. ఉదాహరణకు ‘ఎర్నెస్ట్ హెమింగ్ వే’ అనే ప్రసిద్ధ రచయిత అందుకు చక్కటి ఉదాహరణ. అతను రైటర్‌గా మారడానికి కారణం రివర్స్ సైకాలజీనే అంటారు. యువకుడిగా ఉన్నప్పుడు చిన్న చిన్న కవితలు రాస్తుంటే అందరూ పొగిడేవారట. ఏమైందో కానీ తర్వాత రాయడమే మానేశాడు. దీంతో ఒక ఉపాధ్యాయుడు ఎర్నెస్ట్‌ను నచ్చజెప్పి ప్రోత్సహించే ప్రయత్నం చేసినా మార్పు రాలేదు. దీంతో సదరు ఉపాధ్యాయుడు అతనిపట్ల మరో వైఖరి తీసుకోవడం ప్రారంభించాడట. ‘నువ్వు ఇక నుంచి కవితలు రాయడం మానుకో.. నీకు అంతగా రాకపోవచ్చు. అయినా రాయగలవో లేవో ఎందుకు కష్టపడటం’’ అంటూ కలిసినప్పుడల్లా చెప్పడం మొదలు పెట్టాడట. కానీ ఎర్నెస్ట్ దీనిని సవాలుగా తీసుకున్నాడు. ఇంకేముంది రెచ్చిపోయి రాయడం స్టార్ట్ చేశాడు. తర్వాత గొప్ప రచయితగా మారాడు. దటీజ్ రివర్స్ సైకాలజీ.
పిల్లల్లో మార్పు కోసం
మీరు చిన్న పిల్లలను ఎప్పుడైనా గమనించారా? వారు కొన్ని పనులు సొంతంగా చేసుకోవచ్చు. కానీ చేసుకోరు. బ్రష్ చేసుకోవాలని చెప్తే అస్సలు చేయరు. బ్రష్ తీసుకెళ్లి, దానిపై పేస్ట్ పెట్టి ఇస్తేనో, లేకుంటే పేరెంట్స్ చేయిస్తేనో చేసుకుంటారు. ఇలాంటప్పుడు రివర్స్ సైకాలజీ పనిచేసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ‘‘నీకు బ్రష్ చేయడం ఇష్టం లేకపోతే.. చేయాల్సిన అవసరం లేదు.. మహా అయితే నోటిలో కావిటీస్ పేరుకుపోవచ్చు. దుర్వాసన రావచ్చు. దీంతో అందరూ నీ గురించి ఏమనుకుంటారో మరి.. ఇక నీ ఇష్టం’’ అన్నారనుకోండి. ఇది విన్న పిల్లల వైఖరిలో ఆలోచన మొదలవుతుంది. బ్రష్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అంటే కొట్టకుండా, తిట్టకుండా ఇక్కడ రివర్స్ సైకాలజీని అద్భుతంగా పనిచేసిందన్నమాట.
భయాన్ని అధిగించేందుకు..
భయం.. చాలా మంది ఏదో చేయాలనుకుంటారు. కానీ భయం వారిని సక్సెస్ వైపు నడవకుండా చేస్తుంది. కొందరికి నీటిని చూస్తే భయం, మరి కొందరికి జర్నీ అంటే భయం, ఇంకొందరికి ఆటలంటే భయం. ఇలా రకరకాల భయాలు పలువురిని వెంటాడుతుంటాయి. వీటిని కలిగి ఉన్న వ్యక్తులకు సానుకూల ఆలోచనలతో, మంచి మాటలతో మార్చలేనప్పుడు రివర్స్ సైకాలజీ పనిచేసే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎత్తైన ప్రదేశానికి రావడానికో, తలపైకి ఎత్తి చూడటానికి భయపడుతున్నాడనుకుందాం. ఆ భయాన్ని పోగొట్టాలంటే.. ‘నువ్వు జస్ట్ మా వెంట రావాలి. అక్కడ కింద నిల్చుంటే మేము ఆ కొండపై ఉన్న అందమైన ప్రదేశాన్ని చూసి వస్తాం. అవసరం అయితే నువ్వు కింది నుంచి కనిపించే భాగాన్ని చూడవచ్చు. మా వెంట వచ్చే ప్రయత్నం మాత్రం చేయకు అసలే భయస్తుడివి తలపైకి ఎత్తి చూడకు. మీ మంచికోసం చెప్తున్నాం’’ అన్నారనుకోండి. అతనిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.
వాయిదా మనస్తత్వాన్ని మార్చడం
కొందరు ఆ క్షణం చేసే అవకాశం ఉన్న పనిని కూడా మరుసటి రోజుకు వాయిదా వేస్తుంటారు. వ్యక్తిగత జీవితంలో, వృత్తి జీవితంలో ఇది నష్టం చేస్తుంది. అలా చేయవద్దని చెప్తే వీరిలో మార్పు రాకపోతే రివర్స్ సైకాలజీ యూజ్ చేయవచ్చు. ఉదాహరణకు ఒక ఉద్యోగి వద్దకు వెళ్లి ఆ ప్రాజెక్ట్ వర్క్ రేపటిలోగా పూర్తి చేయాలని టీమ్ లీడర్‌గా ఉన్న మీరు చెప్తే అతనిలో మార్పు రాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ రివర్స్ సైకాలజీ అస్త్రాన్ని యూజ్ చేయాలి. ’ఫలానా ప్రాజెక్ట్ వర్క్ రేపటి వరకు చేయాల్సి ఉంది. కానీ నువ్వు ఇబ్బంది పడుతూ చేయడం దేనికి. కాకపోతే అది రేపే పూర్తి కావాల్సింది. అయినా పర్లేదు. టేక్ యువర్ ఓన్ టైమ్ వారం రోజులైనా సరే. మొత్తానికి కంప్లీజ్ చేస్తే చాలు’ అని వదిలేసేయండి. రివర్స్ సైకాలజీకి పొంగిపోయే మనస్తత్వం కలిగిన వ్యక్తి అయితే ఆ పనిని అదే రోజు పూర్తి చేసేస్తారు. ఆ తర్వాత నుంచి ఇతరు అంశాల్లోనూ వాయిదా వేసే ధోరణి నుంచి బయటపడతాడు. దటీజ్ రివర్స్ సైకాలజీ!