Biodiversity : కొలంబియాలో కొత్త స్పైడర్ జాతులను కనుగొన్న సైంటిస్టులు
భూమిపై జీవ వైవిధ్యం గురించి అనేక విషయాలు తెలిసినప్పటికీ, ఇంకా తెలియనివి కూడా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు.
దిశ, ఫీచర్స్: భూమిపై జీవ వైవిధ్యం గురించి అనేక విషయాలు తెలిసినప్పటికీ, ఇంకా తెలియనివి కూడా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. తాజాగా కొలంబియన్ పసిఫిక్ ప్రాంతంలోని బయోడైవర్సిటీ హాట్‌స్పాట్‌లో ఇంతకు ముందెన్నడూ చూడని 4 కొత్త కీటక జాతులను (tarantula species)వారు గుర్తించారు. వాస్తవానికి ఇక్కడి కొద్దిదూరంలోని ఉష్ణమండల వర్షారణ్యాలు, మడ అడవులతో సమృద్ధిగా ఉన్న ఈ చోకో బయోజియోగ్రాఫిక్ ప్రాంతం చూడముచ్చటగా ఉంటుంది. టూరిస్టులను అమితంగా ఆకర్షించడమే కాకుండా, దీని ప్రత్యేక పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే మైగాలోమోర్ఫే అని పిలువబడే సాలెపురుగుల సమూహాన్ని స్టడీ చేయడానికి బయలు దేరిన రీసెర్చర్స్ తమ అన్వేషణలో మరో అద్భుతాన్ని కనుగొన్నారు. ఒక ప్రత్యేకమైన ట్రాప్‌డోర్ స్పైడర్‌తో పాటు యూథికేలస్ కునాంపియా, నీష్నోకోలస్ మెకానా, మెలోయినా పసిఫికా అనే మరో మూడు టరాన్టులా జాతులను కనుగొన్నారు. ఈ సాలె పురుగులు భూ సంబంధమైనవని, లిమిటెడ్ భౌగోళిక ఉనికిని కలిగి ఉంటాయని రీసెర్చర్ తెలిపారు. బయో డైవర్సిటీ గురించి మరిన్ని పరిశోధనలు విస్తరించడానికి కొత్తగా కనుగొన్న టరాన్టుల ఇన్ఫర్మేషన్ కీలకంగా మారనుందని భావిస్తున్నారు.