Rain alert : వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు? రెడ్ అలర్ట్ అంటే ఏమిటి?
బంగాళా ఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దిశ, ఫీచర్స్ : బంగాళా ఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనజీవనం అస్తవ్యస్థం అవుతోంది. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పంటలు, ఆస్తి నష్టాలు వాటిల్లుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ అప్రమంత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇటీవల తెలంగాణ, ఏపీలలో భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో 136 మి.మీ. వర్షం, ఇబ్రహీంపట్నంలో 120 మి. వీ వర్షం కురిసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అలాగే పలుచోట్ల మోస్తరు వర్షం, భారీ వర్షం, అతి భారీ వర్షం, కుంభ వృష్టి కురిసే అవకాశాలు ఉన్నట్లు ఒక్కో ఏరియాకు సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు అసలు వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
వేల ఏండ్ల చరిత్ర..
వర్షపాతానికి సంబంధించిన అంచనాలు ఆధునిక కాలానికి మాత్రమే సంబంధించినవి మాత్రమే కాదు. వీటి మూలాలు క్రీ.పూ 3 వేల సంవత్సరాల నుంచే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అప్పట్లో వానలు వచ్చే సూచనలను ఎలా అంచనా వేసేవారో ‘ఆపరేటింగ్ ప్రొసీజన్ హైడ్రో మెట్రోలాజికల్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా రిపోర్ట్‌లో పేర్కొన్నారు. కౌటిల్యుడి అర్ధశాస్త్రంలోనూ వర్షపాతాన్ని కొలిచే పద్ధనితిని పేర్కొన్నారు. అయితే ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమేనని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ ఆధునిక కాలంలో వర్షంపాతం అంచనాలను వేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రజెంట్ ఐఎండీ నుంచి మనం అందుకుంటున్న ఆధునిక సమాచారానికి గత మూలాలు కూడా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా థర్మోమీటర్, బారో మీటర్ ఆవిష్కరణ, వెదర్ చేంజింగ్ మెథడ్స్‌పై అవగాహనతో ప్రస్తుతం అంచనాలు వేయడం సులువు అవుతోంది. ప్రపంచంలోనే ప్రముఖ వాతావరణ అంచనాల కేంద్రాల్లో ఇండియా ఇప్పుడు ప్రముఖంగా ఉంది.
ఎలా అంచనా వేస్తారు?
ఐఎండీ ప్రకారం వర్షపాతానికి సంబంధించి రెండు రకాల అంచనాలు ఉన్నాయి. ఒకటి లాంగ్ టెర్మ్ అంచనా కాగా రెండవది డైలీ ప్రాసెస్ అంచనా. రుతుపవనాల వేళ ఒక ప్రాంతంలో నిర్ణీత సమయంలో వర్షపాతం ఎలా ఉండనుందో దీర్ఘకాలిక అంచనాలతో తెలుస్తుంది. దీనిని లాంగ్ రేంజ్ ఫర్ కాస్టింగ్ (ఎల్ఆర్ఎఫ్) అంటారు. నేషనల్ క్లైమేట్ సెంటర్ (ఎన్ సీసీ) ఈ వివరాలను సిద్ధం చేస్తుంది. అయితే దీర్ఘకాలిక వర్షపాత సగటు, ఉష్ణోగ్రత, గాలులు, తేమ ఆధారంగా అంచనాలు వెల్లడిస్తుంది. వీటిని సాధారణంగా 30 రోజులతో మొదలు పెట్టి మొత్తం కాలానికి ప్రాంతాల వారీగా వర్తింపజేసి జారీ చేస్తారు. అయితే దీర్ఘకాలిక అంచనాలతో పోలిస్తే రోజువారీ అంచనాలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక నిర్ధిష్ట ప్రాంతంలో నిర్ధిష్ట సమయంలో ఎంత వర్షం పడుతుందో కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఈ డైలీ ప్రాసెస్‌లో ఉంటుంది.
వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు?
ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైంది లేదా ఎంత కురుస్తున్నదో కొలవడానికి ఐఎండీ థర్మోమీటర్, బారోమీటర్, రెయిన్ గేజ్ వంటి ఆధునిక డివైసెస్‌ను యూజ్ చేస్తుంది. అంతేకాకుండా ఇలాంటి అంచనాలకోసమే ఇండియాలో మొత్తం 6000కు పైగా అబ్జర్వేటరీలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇవి నిత్యం వాతావరణ సమాచారాన్ని క్రోడీకరించి నేషనల్ క్లైమేట్ సెంటర్‌కు పంపిస్తాయి. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానానికి తోడు ఒక ప్రాంతంలో ఎంత వర్షపాతం కురుస్తున్నదో గెస్ చేయడంలో ‘పీడనం’ అనేది కీ రోల్ పోషిస్తుంది. కాగా ఈ పీడనం ఏర్పడటంలో ఉష్ణోగ్రత ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ రెండింటిని కూడా అంటే పీడనాన్ని బారోమీటర్‌తో, ఉష్ణోగ్రతలను థర్మో మీటర్‌తో కొలుస్తారు. ఇక థర్మోమీటర్ ద్వారా ఆయా ప్రాంతాల్లో సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రధాన వాతావరణ శాఖ కేంద్రానికి స్థానిక అధికారులు పంపిస్తుంటారు. దీంతో వర్షపాతం కురిసే అవకాశం ఎక్కడ ఉందనేది అంచనా వేస్తారు. కాగా ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)మోడల్ ఫోర్కాస్ట్ (ఎంఎఫ్) లాంటి విధానాలను పాటిస్తారు. వీటి ద్వారా ఒక నిర్దిష్ట ప్రాంతంలో పీడనానికి సంబంధించిన అప్పర్ లెవల్ చార్ట్ కూడా వాతావరణ శాఖ వద్ద అందుబాటులో ఉంటుంది. కొన్నిసార్లు మాన్యువల్‌గా కూడా అంచనా వేస్తారు.
రెడ్ అలర్ట్ ఎందుకు జారీ చేస్తారు?
వర్షాలు, తుఫానుల సందర్భంలో పరిస్థితిని బట్టి ఐఎండీ రీజినల్ కార్యాలయాలు రెడ్, ఎల్లో, ఆరేంజ్ లేదా గ్రీన్ అలర్ట్‌లు జారీ చేస్తుంటాయి. ఇందులో రెడ్ అలర్ట్ అంటే.. వచ్చే 24 గంటల్లో అతి భారీ లేదా కుంభ వృష్టి కురిసే అవకాశం ఉందని అర్థం. అంటే ఈ అలర్ట్ జారీ చేసిన ఏరియాలో 200 మి.మీ. వరకు వర్షపాతం నమోదు కావచ్చు. ఈ అలర్ట్ ప్రకటిస్తే గనుక ప్రభుత్వ యంత్రాంగం విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ప్రజలు కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎల్లో అలర్ట్ అంటే?
ఎల్లో అలర్ట్ ప్రకటిస్తే జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరికగా అర్థం చేసుకోవాలి. ఇలా ప్రకటించిన ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మోస్తరు అంటే 15.6 మి. మీ. నుంచి 64.4 మీ. మీ వరకు కురిసే వర్షపాతం. ఇక గ్రీన్ లేదా ఆరెంజ్ అలర్ట్ అంటే తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నప్పుడు జారీ చేస్తారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వర్షపాతాన్ని కొలిచే రెయిన్ గేజ్ స్టేషన్లు ఆరువేలకు పైగా ఉన్నాయి. కొన్నిసార్లు మాన్యువల్‌గా కూడా అంచనా వేస్తుంటారు. ఇక ఐఎండీ లేదా వాతావరణ శాఖ అంచనాలు వందశాతం నిజం అవుతాయా? అంటే.. దాదాపు అవుతుంటాయి. కాకపోతే ఈ అంచనాలు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.