Processed Foods: ప్రాసెసింగ్ ఫుడ్స్ అకాల మరణానికి దారితీస్తాయా?
డబ్ల్యుహెచ్‌ఓ మొదటి ప్రపంచ నివేదిక కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
దిశ, ఫీచర్స్: సోడియం (ఉప్పు) అధికంగా ఉండే చిప్స్, నూడుల్స్ వంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్, వివిధ రకాల ప్రాసెసింగ్ ఫుడ్స్ అకాల మరణానికి (premature death) కారణం అవుతాయా? అవుననే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. డబ్ల్యుహెచ్‌ఓ మొదటి ప్రపంచ నివేదిక కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. శరీరంలో నీరు, మినరల్స్ (ఖనిజాల) బ్యాలెన్స్‌ను కాపాడుకోవడానికి సోడియం ఒక ముఖ్యమైన పోషకాహారం, నరాల పనితీరులో కూడా మెరుగైన పాత్ర పోషిస్తుంది. కానీ అదే సందర్భంలో అతిగా వాడటంవల్ల దీర్ఘ కాలిక వ్యాధులు, అకాల మరణాలు సంభవించే ప్రమాదం ఉంది.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఉప్పు (సోడియం) వాడుక మరింత పెరిగినట్లు అంచనా. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, ప్రీ మెచ్యూర్ డెత్స్ పెరుగుతున్నాయని కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. WHO మొదటి ప్రపంచ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2025 నాటికి ఉప్పువాడకాన్ని 30% తగ్గించాలి. కానీ ఆ దిశగా అడుగులు వేయలేకపోతోంది ప్రపంచం. డబ్ల్యుహెచ్‌ఓ సభ్య దేశాలలో కేవలం 5 శాతం మాత్రమే సోడియం తగ్గింపు విధానాలను అవలంభించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే మిగతా దేశాలు ఇష్టారీతిన సోడియాన్ని వాడుతున్నాయి.
వీటిలో గ్లుటామేట్ అధికం
సోడియం ప్రధాన మూలకం సోడియం క్లోరైడ్ (టేబుల్ సాల్ట్). కానీ ఇది సోడియం గ్లుటామేట్ వంటి ఇతర మసాలా దినుసులలో కూడా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్, చిప్స్, స్నాక్స్, సూప్‌లు, ప్రాసెస్ చేసిన మాంసాలు, ఇన్‌స్టంట్ నూడుల్స్ అన్నీ సోడియం గ్లుటామేట్‌ను కలిగి ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడంవల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఈ వ్యాధులకు అదే కారణం
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సోడియం రోజుకు ఒక వ్యక్తి 10.8 గ్రాములు వాడుతున్నట్లు అంచనా. అయితే రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు (ఒక టీస్పూన్)వాడాలని డబ్ల్యహెచ్‌ఓ సూచిస్తోంది. కానీ అంతకంటే ఎక్కువే ప్రజలు వాడుతున్నారు. దీనివల్ల సోడియంవల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, కిడ్నీ వ్యాధి వంటి అనారోగ్యాలు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువ. ‘‘ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహార పద్ధతులే ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాధులు, మరణాలకు దారితీస్తున్నాయి. అలాంటి వాటిలో సోడియం అధికంగా వాడటం కూడా ఒకటి’’ అని డబ్ల్యుహెచ్‌ఓ (WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అంటున్నారు. ఈ కారణంగా ప్రజలకు గుండెపోటు, స్ట్రోక్, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదం పొంచి ఉందని డబ్ల్యుహెచ్‌ఓ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇప్పటికైనా తగ్గించాలని, వివిధ ఆహార పదార్థాలలో సోడియం కంటెంట్‌ను స్థాయికి మించి వాడ కూడదని WHO పిలుపునిస్తోంది.