ప్లే స్కూల్ ఫీజే రూ.4 లక్షలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ తండ్రి పోస్ట్!

ఒక మనిషి జీవించడానికి గాలి, నీరు, ఆహారం వంటివి ఎంత ముఖ్యమో, ఈ రోజుల్లో చదువు కూడా అంతే ముఖ్యం. అందుకే విద్యను కనీస ప్రాథమిక హక్కుగా, అవసరంగా పేర్కొంటున్నారు నిపుణులు. ఒక విధంగా చెప్పాలంటే ఆధునిక మానవ మనుగడ అంతా చదువుపైనే ఆధారపడి ఉంది.

Update: 2024-04-16 06:38 GMT

దిశ, ఫీచర్స్ : ఒక మనిషి జీవించడానికి గాలి, నీరు, ఆహారం వంటివి ఎంత ముఖ్యమో, ఈ రోజుల్లో చదువు కూడా అంతే ముఖ్యం. అందుకే విద్యను కనీస ప్రాథమిక హక్కుగా, అవసరంగా పేర్కొంటున్నారు నిపుణులు. ఒక విధంగా చెప్పాలంటే ఆధునిక మానవ మనుగడ అంతా చదువుపైనే ఆధారపడి ఉంది. అవగాహనతోపాటు జీవనోపాధిని చూపే మార్గంగా చదువు వెలుగుగొందుతోంది. అందుకే తల్లిదండ్రులు ఉన్నంతలో తమ పిల్లల్ని మంచిగా చదివించుకోవాలని కష్టపడుతుంటారు. ఒక వైపు ప్రభుత్వ పాఠశాల్లో చదివించుకుంచుకోవాలనుకున్నా అవి అన్నిచోట్ల అందుబాటులో లేక కొందరు, అందుబాటులో ఉన్నప్పటికీ తగిన సౌకర్యాలు, నాణ్యమైన విద్య అందడం లేదనే ఉద్దేశంతో ఇంకొందరు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో, ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికి సిద్ధ పడుతున్నారు. అంతేకాదు తమ పిల్లలు ప్రయోజకులుగా మారాలని పేరెంట్స్ కలలు కంటుంటారు. కానీ సమాజంలో ఎదురయ్యే కొన్ని ప్రతికూల పరిస్థితులు పేద, మధ్య తరగతి తల్లిదండ్రుల కలలు నెరవేరకుండా అడ్డుకుంటున్నాయి. అలాంటి ఒక సంఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

చదువుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లకోసం చదువు‘కొనలేక’ అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే అదొక ఖరీదైన వ్యవహారంగా మారింది. నాణ్యమైన చదువుకోసమంటూ ప్రైవేటు స్కూళ్లలో తమ పిల్లల్ని జాయిన్ చేస్తున్న తల్లిదండ్రులు అప్పులపాలై ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజుల కిందట కేవలం మూడవ తరగతికే రూ.3 లక్షలు ఫీజు అనే వార్త నెట్టింట హల్ చల్ చేయగా, ప్రస్తుతం ఓ తండ్రి తన కుమారుడికి ప్లే స్కూల్‌ ఫీజు మాత్రమే రూ. 4 లక్షలు వసూలు చేస్తున్నారనే వివరాలను ఎక్స్(ట్విట్టర్)వేదికగా పంచుకోగా, ఈ వార్త వైరల్‌ అవడంతోపాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఢిల్లీకి చెందిన ఆకాశ్ కుమార్ ఓ ప్రైవేటు ఉద్యోగి. తన కుమారుడి ప్లే స్కూల్ ఫీజు ఎప్పుడెప్పుడు ఎంతెంత చెల్లించాడో వివరిస్తూ రిసిప్ట్‌తో సహా వివరాలను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ప్లే స్కూల్ ఫీజులే ఈ విధంగా ఉంటే పిల్లల్ని ఎలా చదివించుకోగలమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆకాశ్ పెట్టిన పోస్ట్ ప్రకారం.. సదరు ప్లే స్కూల్‌లో రిజిస్ట్రేషన్ ఫీజు రూ.10 వేలు, వార్షిక ఫీజు రూ. 25 వేలు. ఇక టర్మ్ -1(ఏప్రిల్ -జూన్ 2024) రూ. 98, 750, టర్మ్ -2 (జులై -సెప్టెంబర్ 2024) - రూ. 98,750, టర్మ్ -3 (అక్టోబర్ -డిసెంబర్ 2024) రూ. 98,750, టర్మ్ - 4 (జనవరి -మార్చి 2025)- రూ. 98,750 కాగా, టోటల్ ఫీజు రూ. 5,40,000 అని పేర్కొన్నాడు. ఆకాశ్ పోస్ట్ చేసిన వివరాలను చూసిన నెటిజన్లు ఆయనపట్ల సానుభూతి చూపుతుండగా, పలువురు తల్లిదండ్రులు తాము కూడా పిల్లలు ఫీజులు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Similar News