Morning waking up : ఉదయం నిద్రలేవాలంటే బద్దకంగా ఉందా?.. డైలీ ఇలా చేస్తే చాలు!
సూర్యోదయానికి ముందు నిద్రలేచి ఆ చల్లటి వాతావరణాన్ని మీరెప్పుడైనా ఆస్వాదించారా?, ఆకాశంవైపో, పచ్చని చెట్ల వైపో చూసినప్పుడు కలిగే ఆనందాన్ని ఎంజాయ్ చేశారా?
దిశ, ఫీచర్స్: సూర్యోదయానికి ముందు నిద్రలేచి ఆ చల్లటి వాతావరణాన్ని మీరెప్పుడైనా ఆస్వాదించారా?, ఆకాశంవైపో, పచ్చని చెట్ల వైపో చూసినప్పుడు కలిగే ఆనందాన్ని ఎంజాయ్ చేశారా? ఎంత బాగుంటుంది కదూ.. ఇదొక్కటే కాదు ఉదయపువేళ ప్రకృతిలోని ప్రతీ దృశ్యం మనలో మధురాను భూతిని కలిగిస్తుంది. అందుకే మార్నింగ్ లేచేవారు లేవని వారితో పోలిస్తే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతారని నిపుణులు చెప్తుంటారు. అయితే అనుకున్నప్పటికీ కొందరు ఉదయం నిద్రలేకపోతారు. బద్దకంగా అనిపిస్తుంది. అలాంటివారు కొన్ని రోజువారీ అలవాట్ల ద్వారా బయట పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.
నీళ్లు తప్పకుండా తాగండి
మార్నింగ్ నిద్ర మేల్కోగానే ముందుగా మీరు చేయాల్సింది బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవడం. అందుకోసం ముందుగా కొన్ని మంచి నీళ్లు తాగాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే చాలామంది రాత్రిళ్లు సరిగ్గా నీళ్లు తాగరు. ఉదయం కూడా తాగకపోతే బాడీ డీహైడ్రేషన్‌కు గురికావచ్చు. కాబట్టి కచ్చితంగా నీళ్లు తాగాలి. మీ అలవాటును బట్టి నార్మల్ వాటర్, గోరు వెచ్చని నీళ్లు ఇలా ఏవైనా తాగొచ్చు. దీంతో ప్రేగుల్లో కదలికలు మెరుగు పడతాయి. క్రమంగా ఈ అలవాటు మీలో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, ఉదయం మేల్కొనేందుకు ప్రేరేపిస్తుంది.
శరీరాన్ని కదిలించడం, సాగదీయడం
ప్రతి రోజూ ఉందయం లేవగానే బాడీ బిగుతుగా అనిపిస్తుంది కొందరికి. అప్పుడు శరీరాన్ని ఎక్కువగా కదిలించడం లేదా తేలికగా సాగదీయం వంటివి చేయాలి. ఇది మీలో మంచి అనుభూతిని కలిగించడంతోపాటు హ్యాపీనెస్ హార్మోన్ల విడుదలకు కారణం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా మానసిక స్థితిని కూడా మెరుగు పరుస్తుంది.
ధ్యానం లేదా మెడిటేషన్
ఉదయం లేచిన తర్వాత వ్యాయామాలు చేయడం, వివిధ ఫిజికల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. బద్దకాన్ని పారదోలుతాయి. వీటితోపాటు ధ్యానం లేదా మెడిటేషన్ వంటివి కూడా మీలోని ఆందోళన, ఒత్తిడులను తగ్గిస్తాయని, మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని నిపుణులు చెప్తున్నారు.
ఆ రోజుకు అవసరమైన ప్లాన్
ఉదయం లేవడంవల్ల మరో బెనిఫిట్ ఏంటంటే.. ఆ రోజు పని ప్రారంభించేకంటే ముందే.. మీకు కాసేపైనా ఖాళీ సమయం దొరుకుతుంది. అంటే మీరేం చేయాలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ఏరోజుకారోజు ఏం నోట్ చేసుకోవడం, ప్లాన్ రెడీ చేసుకోవడం, దానిని అమలు చేయడం మీలో మంచి అనుభూతిని కలిగిస్తుంది. క్రమ శిక్షణను పెంపొందిస్తుంది.
బ్రేక్ ఫాస్ట్ తప్పక తినండి
ఉదయం లేచి వ్యాయామాలు, వివిధ పనులు చేస్తుంటారు. కాబట్టి కనీస ఎనర్జీ కోసం బ్రేక్ ఫాస్ట్ చేయడం మర్చిపోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అల్పాహారం అంటే ఇడ్లీ, వడ, దోశ, పూరి వంటివి మాత్రమే కాదు, మీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం ఏదైనా కావచ్చు. క్యారట్ ముక్క, కీర దోస వంటివి కూడా బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. ఇవి మళ్లీ లంచ్ టైమ్ వరకు మీకు శక్తినిస్తాయి. ఇలాంటి రోజువారీ ఉదయపు అలవాట్లతో బద్దకం దూరం అవుతుంది. ఉత్సాహంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు.