పాకిస్థాన్‌లో ఆడపిల్లల కనీస పెళ్లి వయస్సు మిమ్మల్ని షాక్‌కు గురిచేయవచ్చు...
ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాల రేటు అత్యధికంగా ఉన్న దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. కాగా దాదాపు 30% మంది బాలికలు 18 ఏళ్లు నిండకముందే వివాహం చేసుకున్నారని నివేదికలు చెప్తున్నాయి.
దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాల రేటు అత్యధికంగా ఉన్న దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. కాగా దాదాపు 30% మంది బాలికలు 18 ఏళ్లు నిండకముందే వివాహం చేసుకున్నారని నివేదికలు చెప్తున్నాయి. UNICEF ప్రకారం ఈ దేశంలో 18.9 మిలియన్ల మంది బాలికలు 18 ఏళ్లలోపు, 4.6 మిలియన్ల మంది 16 ఏళ్లలోపు వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది.
నిజానికి పాక్ లో పెళ్లి చేసుకునేందుకు చట్టబద్ధమైన వయసు అబ్బాయిలకు 18 అయితే.. అమ్మాయిలకు 16 మాత్రమే. కానీ అంతర్జాతీయ ప్రమాణాలు స్త్రీ, పురుషులకు 18 ఏళ్లుగా ప్రకటించాయి. సింధ్ ప్రావిన్స్ 2013లో ఆడ, మగ వివాహ వయస్సును 18కి పెంచడానికి ఒక చట్టాన్ని ఆమోదించింది. కానీ ఈ మార్పు దేశవ్యాప్తంగా వర్తించబడలేదు. అందుకే బాల్యవివాహాలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఖైబర్ పఖ్తున్ఖ్వా, గిల్గిత్ బాల్టిస్తాన్ వంటి ప్రాంతాలలో సాంస్కృతిక, సాంప్రదాయ, సామాజిక నిబంధనలలో ఈ పద్ధతి పాతుకుపోయింది.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన బాల్య వివాహ సమస్యను హైలైట్ చేస్తుంది. 12 ఏళ్ల బాలికతో పెళ్లికి ప్రయత్నించిన 72 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా బాలిక తండ్రి ఆలం సయ్యద్ తన కుమార్తెను ముసలి పెళ్లి కొడుకు హబీబ్ ఖాన్‌కు 500,000 పాకిస్తానీ రూపాయలకు విక్రయించడానికి అంగీకరించాడు. కాగా వరుడిని అరెస్టు చేయగా.. బాలిక తండ్రి మాత్రం తప్పించుకున్నాడు.