Mental breakdown : ఒత్తిడి అధికమైప్పుడు ఏర్పడే మానసిక సమస్యలివే.. ఎలా బయటపడాలంటే..

కొన్ని ఆలోచనలు పదే పదే మీ మనసును వేధిస్తున్నాయా?, గత సంఘటనలు గుర్తు చేసుకొని తరచుగా బాధపడుతున్నారా? మీపై మీరు నమ్మకం కోల్పోయినట్టు అనిపిస్తోందా? అలసట, నీరసం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా?

Update: 2024-08-28 13:01 GMT

దిశ, ఫీచర్స్ : కొన్ని ఆలోచనలు పదే పదే మీ మనసును వేధిస్తున్నాయా?, గత సంఘటనలు గుర్తు చేసుకొని తరచుగా బాధపడుతున్నారా? మీపై మీరు నమ్మకం కోల్పోయినట్టు అనిపిస్తోందా? అలసట, నీరసం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? అయితే మీరు మెంటల్ బ్రేక్ డౌన్ లేదా నెర్వస్ బ్రేక్ డౌన్ అనే మానసిక రుగ్మతను ఎదుర్కొంటున్నట్లు అనుమానించాల్సిందే అంటున్నారు మానసిక నిపుణులు. ముఖ్యంగా మెంటల్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. సరైన సమయంలో గుర్తించి ట్రీట్మెంట్ అందించకపోతే ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తు్న్నారు. అయితే ఎలా గుర్తించాలి? ఎలా నివారించాలి? నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం.

లక్షణాలు

మెంటల్ బ్రేక్ డౌన్ రుగ్మత బారిన పడ్డవారిలో తరచుగా బీపీ పెరుగుతూ ఉండటంవల్ల కోపం ఎక్కువగా వస్తుంది. అలాగే తమపై తమకు నమ్మకం లేనట్లు వ్యవహరిస్తుంటారు. ఒకానొక దశలో సూసైడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. దీంతోపాటు రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం, విపరీతమైన అలసట, సమయానికి తిన్నా ఆహారం జీర్ణం కాకపోవడం, మీకు ఎలాంటి హాని జరగకపోయినా జరుగుతుందేమోనని భ్రమపడటం, ఉన్నట్లుండి ఉలిక్కి పడటం, గతంలో జరిగిన విషాద ఘటనలు పదే పదే గుర్తుకు రావడం వంటివి తరచుగా వేధిస్తుంటాయి. వీటితోపాటు నలుగురిలో కలువకపోవడం, సరిగ్గా తినకపోవడం వంటివి సాధారణంగా కనిపిస్తుంటాయి.

కారణాలు

వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలు, కుటుంబ, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, ఇష్టంలేని ఉద్యోగం లేదా వర్క్ చేయడం వల్ల కూడా మెంటల్ బ్రేక్ డౌన్ లేదా నెర్వస్ బ్రేక్ డౌన్ మానసిక స్థితికి కారణం అవుతుంటాయి. అలాగే దీర్ఘకాలంపాటు నిద్రలేకపోవడం, క్రానిక్ డిసీజెస్‌తో బాధపడటం ఈ పరిస్థితికి దారితీస్తాయి.

పరిష్కారం ఏమిటి?

తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా మెంటల్ బ్రేక్‌డౌన్ రుగ్మతను ఫేస్ చేస్తున్నవారు దాని నుంచి బయటపడాలంటే ముందుగా అందుకు గల కారణాలను గుర్తించాలంటున్నారు నిపుణులు. దీనిద్వారా నివారణ సలువువుతుంది. అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోతే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి. అప్పుడు వారు మీ మానసిక స్థితిని బట్టి టాక్ థెరపీ, కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీల వంటి చికిత్సలతో సమస్యకు తగిన పరిష్కారం చూపుతారు. అవసరమైతే యాంటీ యాంగ్జైటీస్ లేదా యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ కూడా సజెష్ చేస్తారు. అలాగే సమయం ప్రకారం నిద్రపోవడం, పడుకునే ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం, రాత్రిళ్లు గ్యాడ్జెటస్‌కు, కాఫీ, టీ వంటి కెఫిన్ రిలేటెడ్ పానీయాలకు దూరంగా ఉండటం కూడా నివారణలో భాగంగా పనిచేస్తాయి. 

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే మానసిక నిపుణులను సంప్రదించగలరు. 


Similar News