లైఫ్‌‌‌ లాంగ్ బ్యాచిలర్స్‌కంటే.. పెళ్లైన పురుషులే ఎక్కువకాలం బతుకుతారు.. అసలు కారణం ఇదే..

పెళ్లైన వారితో పోల్చినప్పుడు నిత్య బ్రహ్మచారులుగా ఉండే పురుషులు ఎక్కువకాలం జీవిస్తారని ఇప్పటికీ కొందరు నమ్ముతుంటారు. కానీ ఇది వాస్తవం కాదని, అపోహ మాత్రమేనని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

Update: 2024-05-30 13:17 GMT

దిశ, ఫీచర్స్ : పెళ్లైన వారితో పోల్చినప్పుడు నిత్య బ్రహ్మచారులుగా ఉండే పురుషులు ఎక్కువకాలం జీవిస్తారని ఇప్పటికీ కొందరు నమ్ముతుంటారు. కానీ ఇది వాస్తవం కాదని, అపోహ మాత్రమేనని ఓ అధ్యయనంలో వెల్లడైంది.పెళ్లైతే పొట్ట పెరుగుతుందని కొందరు సెటైర్లు కూడా వేస్తుంటారు. పొట్ట ఏమోకానీ ఆయుష్షు మాత్రం తప్పక పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. దీనిని ‘మ్యారేజ్ ప్రొటెక్షన్’ లేదా ‘మ్యారేజ్ అడ్వాంటేజ్’ బెనిఫిట్స్‌గా కూడా అభివర్ణిస్తున్నారు.

ఏది నిజం?

మ్యారీడ్ లైఫ్‌కంటే.. జీవితాంతం బ్యాచిలర్ లైఫ్ బాగుంటుందని కొందరు చెప్తుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత బాధ్యతలు, రకరకాల టెన్షన్లు పెరుగుతాయని భావిస్తుంటారు. ఈ పరిస్థితి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అపోహ పడుతుంటారు. పైగా ‘బ్రహ్మచారులు’ చాలా సంతోషంగా ఉంటారని, ఎక్కువకాలం జీవిస్తారని ప్రచారం చేస్తుంటారు. కానీ ఇవి నిజం కాదని పరిశోధలు పేర్కొంటున్నాయి. పైగా పెళ్లి చేసుకోవడంవల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయని, మ్యారీడ్ లైఫ్ దీర్ఘాయుష్షు కారణం అవుతుందని నిపుణులు అంటున్నారు.

అధ్యయనంలో ఏం తేలింది?

స్టడీలో భాగంగా జపాన్ పరిశోధకులు ఆసియా ఖండంలో 50 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్సు గలిగిన 6,23,140 మంది పురుషులపై పరిశోధనలు నిర్వహించారు. ఇందులో పెళ్లైన వారు, కానివారు కూడా ఉన్నారు. అందరినీ 15 సంవత్సరాలపాటు అబ్జర్వ్ చేశారు. వారు ఎదుర్కొంటున్న సామాజిక, ఆరోగ్య సమస్యలను, ప్రయోజనాలను ఎనలైజ్ చేశారు. కాగా ఈ సందర్భంగా వారు పెళ్లికాని వారితో పోల్చినప్పుడు, పెళ్లైన జంటలు ప్రమాదాలు, గాయాలు లేదా గుండె జబ్బులతో మరణించే అవకాశం 20 శాతం తగ్గినట్లు గుర్తించారు.

పెళ్లికాకుంటే రిస్క్ ఎక్కువ

పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం ఆయా వ్యక్తుల వ్యక్తిగత అంశం. అలా ఉండే హక్కు అందరికీ ఉంది. అయితే బ్యాచిలర్లుగా ఉండేవారి ఆయుష్షు తగ్గడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆర్థికంగా సెటిల్ అవ్వకపోవడం, ఆపద సమయంలో పర్సనల్ కేర్ తీసుకునే వారు లేకపోవడం, డబ్బు సంపాదనలో పడి సొంత ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం వంటివి బ్యాచిలర్లలో ఒత్తిడిని పెంచుతుంది. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనికి తోడు సామాజిక పరిస్థితులు మెంటల్ హెల్త్‌పై ఎఫెక్ట్ చూపుతాయి. ఇవన్నీ కలిసి పెళ్లికాని వారి ఆయుష్షు తగ్గడానికి కారణం అవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

పెళ్లి తర్వాత రిస్క్ తక్కువ..

పెళ్లి తర్వాత పురుషులు సంతోషంగా ఉండటం, ఎక్కువకాలం జీవించే అవకాశం పెరగడానికి కారణం వారు తమ లైఫ్‌ను రిస్కులో పెట్టరు. ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటారు. కొందరు మద్యం తాగినా ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు బ్యాచిలర్లకంటే ఇది చాలా తక్కువ శాతంగా ఉంటోంది. అలాగే రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యాలు, గాయాలు వంటివి జరిగి మరణించే అవకాశం మ్యారీడ్ పీపుల్‌‌లో చాలా తక్కువ. అదే బ్యాచిలర్స్ అయితే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటివి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.

ఆరోగ్యంపై సానుకూల ప్రభావం

వివాహిత పురుషుల్లో తక్కువ రక్తపోటు, దీర్ఘకాలిక వ్యాధుల రేటు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వివాహం మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. నిరాశ, ఆందోళన వంటివి తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే రెగ్యులర్ వ్యాయామాలు, సమతుల్య ఆహార నియమాలు పెళ్లైన పురుషులు తప్పక పాటిస్తుంటారు. సామాజికంగా వీరికి ఎమోషనల్ సపోర్ట్ కూడా లభిస్తుంది.

పెరుగుతున్న భరోసా, ఆర్థిక భద్రత

పెళ్లి తర్వాత పురుషులకు అనేక విషయాల్లో భార్య అండగా ఉంటుంది. కష్ట సుఖాల్లో ఓదారుస్తుంది. మోటివేటర్‌గా మారి భర్తలో సంతోషానికి కారణం అవుతుంది. అలాగే భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటూ కుటుంబ, సామాజిక విషయాల్లో తగిన ప్రణాళికతో వ్యవహరిస్తారు. ఇది సామాజిక, ఆర్థిక భద్రతకు, వ్యక్తిగత సంతోషానికి కారణం అవుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపడంవల్ల ఎక్కువకాలం జీవిస్తారు. 


Similar News