Lovely personality : ఎక్కువ మంది అవి చూసే ఇష్టపడుతున్నారు..! స్పెషాలిటీ ఏంటంటే..

Lovely personality : ఎక్కువ మంది అవి చూసే ఇష్టపడుతున్నారు.. స్పెషాలిటీ ఏంటంటే..!

Update: 2024-10-19 12:57 GMT

దిశ, ఫీచర్స్ : మనం రోజూ ఎంతో మందిని చూస్తుంటాం. కానీ కొందరు ప్రత్యేకంగా కనిపిస్తారు. మనం రోజూ ఎంతో మందితో మాట్లాడుతుంటాం. కానీ కొందరితో మాట్లాడుతుంటే.. మనసుకు హాయిగా ఉంటుంది. మనం రోజూ ఎంతో మందిని కలుస్తుంటాం. కానీ కొందరిని కలిసినప్పుడు మాత్రం ఎక్కువ ఆనందాన్ని పొందుతాం. వారి మాటలు, చేతలు, ప్రవర్తన, పని విధానం, అలవాట్లు అన్నీ ఆకట్టుకుంటాయి. అంటే ఇవన్నీ అవతలి వ్యక్తి రూపాన్ని, డబ్బును బట్టి కాకుండా వ్యక్తిత్వాన్ని బట్టి ప్రజలు ఇష్టపడే లక్షణాలుగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి అట్రాక్టివ్ పర్సనాలిటీ లక్షణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జెన్యూన్‌గా ఉంటారు

మీరు గమనించారో లేదో కొందరు చాలా క్లారిటీతో ఉంటారు. సందర్భం ఏదైనా నిజాయితీగా ఉంటూ.. సూటిగా మాట్లాడుతుంటారు. ఒక విషయంపట్ల ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా తమకంటూ ప్రత్యేక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. అవతలి వ్యక్తులను బట్టి, హోదాను, పదవులను బట్టి అభిప్రాయాన్ని గుడ్డిగా చెప్పడం కానీ, అంగీకరించడం కానీ చేయరు. తమకు అనిపించింది మాత్రమే చెప్తారు. ఇతరులు మెచ్చుకున్నా, విమర్శించినా తమ ఒపీనియన్ తాము కలిగి ఉంటారు. అలాగే ఇతరుల అభిప్రాయాలను గౌరవించడంలో, అర్థం చేసుకోవడంలోనూ వీరు ప్రామాణికమైన వ్యక్తులుగా కనిపిస్తారు. అవసరం కోసం మాట మార్చడం, పొగడటం, నటించడం వంటివి చేయరు. అందుకే ప్రజలు ఇలాంటి వారిని నిజమైన వ్యక్తిత్వం గలవారిగా పేర్కొంటారు. అట్రాక్టివ్ అండ్ లవ్‌లీ పర్సనాలిటీలో ఇదొక భాగమని నిపుణులు పేర్కొంటున్నారు.

శ్రద్ధగా వింటారు

ఒకటి అవతలి వారు చెప్పేది శ్రద్ధగా, పూర్తిగా వినే అలవాటు కూడా నలుగురిని ఆకట్టుకునే వ్యక్తిత్వ లక్షణాల్లో ఒకటిగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఎవరైనా ఒక విషయం చెప్తుంటే.. తమకు తెలిసు అనో, అవసరం లేదనో మధ్యలోనే కట్ చేయరు. మీ మాటలను, మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. తర్వాత తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. కొన్ని అంశాలు మీకు నచ్చినా, నచ్చకపోయినా, పాటించినా, పాటించకపోయినా సరే అర్థం చేసుకుంటారు. ఇలా.. ఇతరులు ఏదైనా చెప్తున్నప్పుడు దానిని వినే ఓపిక, రిసీవ్ చేసుకునే విధానం, హుందాతనంతో కూడిన ప్రవర్తనను ప్రజలను ఆకట్టుకునే లవ్‌లీ పర్సనాలిటీగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. సమస్యలను పరిష్కరించడంలో, ఓదార్పునివ్వడంలో, బాధలు, సంతోషాలు వ్యక్త పరచడంలో కూడా గ్రేట్ లిజనింగ్ చాలా ముఖ్యం.

సానుభూతిని ప్రదర్శిస్తారు

కొందరు ఏది చెప్పినా ఒకేలా స్పందిస్తుంటారు. సానుభూతి ప్రదర్శించే సందర్భాల్లో కూడా కోపంగానో, సరదాగానో అనిపిస్తుంటారు. ఈ విధమైన వ్యక్తిత్వం ప్రజలను ఆకట్టుకోదని నిపుణులు చెప్తున్నారు. అవసరమైనప్పుడు సానుభూతి చూపగలగడం అట్రాక్టివ్ పర్సనాలిటీలో ఒక భాగం. ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, మీ భావాలను పంచుకోవడం బలమైన, ఆరోగ్య కరమైన సంబంధాలుగా పరిగణించబడతాయి. ఇందులో సానుభూతి కూడా అంతర్భాగంగా ఉంటుంది. మీరు ఇతరులపై సానుభూతి చూపినప్పుడు లేదా మీరు సానుభూతి పొందినప్పుడు ఈ రెండు సందర్భాల్లోనూ మెదడు ఆక్సిటోసిన్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది ఇతరులతో కనెక్ట్ అయ్యే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఒక విధంగా చెప్పాలంటే సానుభూతి స్వభావం మిమ్మల్ని ఇతరులు ఇష్టపడేలా చేస్తుంది.

సవాళ్లను అధిగమిస్తారు 

సానుకూల దృక్పథం (positive outlook) కలిగి ఉండటం మిమ్మల్నే కాదు, మీ చుట్టూ ఉండే వ్యక్తుల్లోనూ ఆనందానికి కారణం అవుతుంది. సాధారణంగా సమస్యలు, సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో చాలా మందిని ప్రతికూల ఆలోచనలు వేధిస్తాయి. కానీ ఆ సమయంలో కూడా సానుకూల దృక్పథాన్నే కలిగి ఉండేవారిగా ఉండటం ఇతరులను ఆకట్టుకునే లవ్ లీ పర్సనాలిటీగా ఉంటుందని నిపుణులు చెప్తు్న్నారు. అలాగే సానుకూల దృక్పథం అంటే ప్రతీది పరిపూర్ణంగా ఉన్నట్లు నటించడం అస్సలు కాదు. వాస్తవంపై ఆధారపడి మంచివైపు ఆలోచించడం, ఇతరులను కూడా ప్రోత్సహించడం. బాధకారమైన సందర్భంలో, దిగాలుగా ఉన్న సమయంలో కూడా సానుకూల దృక్పథం వెలుగులా పనిచేస్తుందని, ఇది కలిగిన వ్యక్తితోపాటు చుట్టు పక్కల వారిలోనూ ఆశావాదాన్ని పెంపొందిస్తుందని నిపుణులు చెప్తున్నారు.

ఇతరులను గౌరవిస్తారు

గౌరవభావం అనేది ప్రజలు ఇష్ట పడే వ్యక్తిత్వ లక్షణం. అయితే ఇక్కడ కేవలం తాము మాత్రమే గౌరవాన్ని పొందాలనుకోవడం మాత్రం స్వార్థానికి, గర్వానికి నిదర్శనంగా నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి వారిని ప్రజలు, స్నేహితులు, చుట్టు పక్కలవారు ఎవరూ ఇష్టపడరు. మీరు గౌరవం పొందాలనుకోవడాన్ని నిజానికి సమాజంలో ఎవరూ తప్పు పట్టరు. కాకపోతే ఇతరులను గౌరవించకపోవడం కూడా మీ ప్రవర్తనలో ఒక భాగంగా ఉన్నప్పుడు మాత్రమే లవ్‌లీ పర్సనాలిటీగా చెప్పవచ్చు. ఇతరుల ఫీలింగ్స్, ఓపీనియన్స్ అర్థం చేసుకోవడం, అవసరమైనప్పుడు అంగీకరించడం, భిన్నంగా ఉన్నా గౌరవించడం వంటివి లక్షణాలు కూడా ఇతరులను ఆకట్టుకుంటాయి.

అట్రాక్టివ్ పర్సనాలిటీస్ మరికొన్ని..

ప్రజలు అత్యంత ఇష్టపడే వ్యక్తిత్వ లక్షణాల్లో పాజిటివ్‌గా ఉండటం ఒకటి. ఆత్మ విశ్వానికి ఇది నిదర్శనం. ఇతరులను సంతోష పెట్టడానికి మీకు నచ్చని దుస్తులు వేసుకోవడం, నచ్చని మేకప్ చేసుకోవడం, నచ్చని పని చేయడం వంటివి ప్రజలు ఇష్టపడరు. ఇక్కడ మీరెలాంటి వారో అలా ఉండటమే లవ్‌లీ పర్సనాలిటీ. దీంతోపాటు మీ లోపాలను గ్రహించడం సరిదిద్దుకోవడం, ఇతరుల లోపాలను మంచి ఉద్దేశంతో ఎత్తి చూపడం లేదా వివరించడం వంటివి ప్రజలు ఇష్టపడే అట్రాక్టివ్ అండ్ లవ్‌లీ పర్సనాలిటీలో భాగంగా ఉన్నాయి. తప్పులను, పొరపాట్లను ఎత్తిచూపడంలో ఎలాంటి భయాన్ని కలిగి ఉండకపోవడం, వాస్తవ పరిస్థితులపై ఆధారపడుతూ నిర్ణయాలు తీసుకోవడం కూడా ప్రజలు మెచ్చుకునే ప్రవర్తగా ఉంటుంది.


Similar News