Laughing Benefits : నవ్వుతూ ఉండండి.. గుండె జబ్బుల రిస్క్ తగ్గించుకోండి!
‘నవ్వు నాలుగు విధాలా చేటు’ అనే గతకాలపు నానుడికి ఎప్పుడో కాలం చెల్లిందని నిపుణులు చెప్తున్నారు.
దిశ, ఫీచర్స్ : ‘నవ్వు నాలుగు విధాలా చేటు’ అనే గతకాలపు నానుడికి ఎప్పుడో కాలం చెల్లింది. వాస్తవానికి నవ్వు నాలుగు విధాలా మేలు అంటున్నారు నిపుణులు. తాజా అధ్యయనాలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. మానసిక ఆనందానికే కాదు, శారీరక ఆరోగ్యానికి కూడా నవ్వు టానిక్‌లా పనిచేస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా గుండె జబ్బుల నివారణలో కీ రోల్ పోషిస్తుందని జపాన్‌లోని యమగాట (amagata University) యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల స్టడీలోనూ వెల్లడైంది.
రక్త ప్రసరణ మెరుగుపడుతుంది
నవ్వకపోవడం ఒక రోగం లాంటిదని పెద్దలు కూడా చెప్తుంటారు. అయితే నవ్వడం అంటే ఇక్కడ ఏదో ఆర్టిఫిషియల్ నవ్వు కాదు, నిజంగా ఫీల్ అవ్వడం ద్వారా గుండెలోతుల్లోంచి వచ్చే సహజమైన, స్వచ్ఛమైన నవ్వు. అలాంటి నవ్వువల్ల మెదడులోని నరాలు ఉత్తేజితం అవుతాయి. శరీరంలో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. ఆనందానికి కారణమైన ఎండార్ఫిన్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు.
అధ్యయనంలో తేలిందేమిటి?
వాస్తవానికి నవ్వు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? హార్ట్ హెల్త్‌కు, నవ్వుకు గల సంబంధం ఏమిటి? అనేది తెలుసుకునే క్రమంలో జపాన్‌లోని యమగాట వర్సిటీ పరిశోధకులు 40 ఏండ్లలోపు వయస్సు గల 17,152 మందిపై స్టడీ చేశారు. కాగా వారిలో ఎక్కువగా నవ్వుతూ ఉండే ఆనందకరమైన మానసిక స్థితిని ఎక్కువగా అనుభవించిన వారు మిగతా వారితో పోలిస్తే ఆరోగ్యంగా ఉంటున్నారని, గుండె జబ్బుల బారిన పడకుండా ఉండటంలో వారిలోని ఫీల్ ఆఫ్ లాఫింగ్ సహాయపడుతుందని ఈ సందర్భంగా గుర్తించారు.
తగ్గుతున్న రిస్క్
మనుషుల్లోని సహజమైన లాఫింగ్ ఫ్రీక్వెన్సీ పెరగడంవల్ల హార్ట్ రిలేటెడ్ సమస్యలు రాకుండా ఉంటాయని, దీంతో వారి ఆయుష్షు పెరుగుతుందని ప్రివెంటివ్ మెడిసిన్ జర్నల్‌లో పబ్లిషైన స్టడీలో కూడా వెల్లడైంది. దీని ప్రకారం వృద్ధులు తమ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు నవ్వు తెప్పించే సందర్భాలను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఆనందంగా ఉండటంవల్ల వారిలో గుండె జబ్బుల రిస్క్ తగ్గింది. అదే వయస్సులో ఉన్న ఇతర వ్యక్తులు నవ్వుకు దూరంగా ఉండే పరిస్థితుల కారణంగా గుండె జబ్బుల ప్రమాదన్ని ఎదుర్కొన్నారు. అంటే ఇక్కడ లాఫింగ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
మానసిక ఆందోళనకు చెక్
గుండె జబ్బుల రిస్క్‌నే కాదు, నవ్వు మానసిక ఆందోళనను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని నర్సింగ్ అండ్ హెల్త్ సైన్సెస్ అధ్యయనం కూడా పేర్కొన్నది. దీని ప్రకారం.. వ్యక్తులు నవ్వినప్పుడు శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తిని పరిమితం చేస్తుంది. ఫలితంగా మానసిక ఆందోళన తగ్గి, ఆనందం ఏర్పడుతుంది. అంతేకాకుండా నవ్వినప్పుడు ఎండార్ఫిన్లు విడుదల కావడంవల్ల మానసిక ఆనందంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో అవి సహాయపడతాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎవల్యూషనరీ సైకాలజీ విభాగం నిపుణులు పేర్కొన్నారు.
నొప్పి నివారణలో కీ రోల్
నవ్వడంవల్ల రిలీజ్ అయ్యే ఎండార్ఫిన్లు పెయిన్ మేనేజ్ మెంట్‌లో కీ రోల్ పోషించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అంతే కాకుండా లాఫింగ్ ద్వారా సామాజిక ప్రయోజనాలు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నలుగురు కలిసి సరదాగా మాట్లాడుకొని నవ్వుకోవడం మానవ సంబంధాలను మెరుగు పర్చడంతోపాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. అందుకే నవ్వాల్సి వచ్చిన ఏ సందర్భాన్నీ వదులుకోవద్దని, మనస్ఫూర్తిగా నవ్వును ఆస్వాదించాలని నిపుణులు సూచిస్తున్నారు.