క్వాంటిటీకి మించి కాఫీ తాగుతున్నారా.. ఎంత ప్రమాదమో చూడండి..

మన దేశంలో టీ, కాఫీలు రెండిటినీ ఎంతో ఇష్టంగా తాగుతుంటారు.

Update: 2024-10-08 09:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలో టీ, కాఫీలు రెండిటినీ ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. అంతే కాదు ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారంటే చాలు వారికి వెంటనే టీ కానీ, కాఫీ కానీ పెట్టి ఇస్తారు. జ్వరం వచ్చిన వారు కూడా టీ, కాఫీని తాగేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.

అయితే టీ, కాఫీ గురించి ప్రజలకు భిన్నాభిప్రాయాలను కలిగి ఉంటారు. వీటిని తాగేవారికి తక్షణమే శక్తి రావడం, తలనొప్పి నుండి ఉపశమనాన్ని అందించడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. అయితే ఈ రెండింటిలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరం, ఏది ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి హాని కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ?

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ స్ట్రోక్‌లో ప్రచురించిన ఓ అధ్యయనంలో 25,000 మందికి పైగా నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్రతిరోజూ నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం మెదడు ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని, స్ట్రోక్ ప్రమాదాన్ని 40 శాతం పెంచుతుందని వెల్లడించింది. ఇక టీ తాగడం వల్ల స్ట్రోక్ రిస్క్ 20 శాతం తగ్గుతుంది. ఎందుకంటే తరచుగా కాఫీ తాగడం వల్ల అధిక రక్తపోటు వచ్చి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని, ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

అధ్యయనంలో 25,000 మంది..

ఈ అధ్యయనంలో UK, కెనడాతో సహా 32 దేశాల నుండి 26,950 మంది వ్యక్తులు పాల్గొన్నారట. ఇందులో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది పురుషులు, వారి వయస్సు దాదాపు 60 సంవత్సరాలు. ఈ వ్యక్తులలో చాలా మంది సగటు బరువు కంటే ఎక్కువగా ఉన్నారు. ఇది స్ట్రోక్‌కు ప్రధాన ప్రమాద కారకం. అంతేకాదు వారి వైద్య చరిత్ర, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, ధూమపానం, అధిక రక్తపోటుకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఈ అధ్యయనంలో చేరుస్తారు. వారి టీ లేదా కాఫీ అలవాట్ల గురించి కూడా అధ్యయనంలో తెలుసుకున్నారని చెబుతున్నారు.

టీ కంటే కాఫీ చాలా ప్రమాదకరం..

రోజూ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగడం వల్ల స్ట్రోక్ ముప్పు 37 శాతం పెరుగుతుందని పరిశోధనలో వెల్లడైంది. అదే మొత్తంలో టీ తాగడం ద్వారా ఈ ప్రమాదం 19 శాతం తగ్గిందని చెబుతున్నారు. బ్లాక్ టీ తాగడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 29 శాతం తక్కువగా ఉంది. అయితే గ్రీన్ టీలో ఈ ప్రమాదం 27 శాతం తగ్గింది. అయితే మూడు లేదా అంతకంటే తక్కువ కప్పుల కాఫీ తాగడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం లేదు.

కాఫీ ఎందుకు ఎక్కువ హానికరం ?

నిజానికి కాఫీలో టీ కంటే ఎక్కువ కెఫిన్ ఉంటుంది. ఒక కప్పులో టీ కంటే కాఫీలో రెండు రెట్లు ఎక్కువ కెఫిన్ ఉంటుంది. కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల హృదయ స్పందన రేటు, అధిక రక్తపోటు పెరుగుతుంది. ఇది దీర్ఘకాలంలో మెదడులోని రక్తనాళాలకు నష్టం కలిగించి, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాఫీలో పాలు కలపడం వల్ల కలిగే ప్రయోజనాలు పోతాయి.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.


Similar News

Mr. మొహ‌మాటం.!