ప్రపంచంలో భారతీయులే నంబర్ వన్.. సరదాతో మొదలై సమస్యల ఊబిలోకి..

చేతిలో మొబైల్ పట్టుకుంటే మనకు ప్రపంచమే తెలియదు. ఉదయం లేవగానే సెల్‌ఫొన్ పట్టుకుంటారు కొందరు. తినేటప్పుడూ అది లేకుంటే ముద్ద దిగనంతగా అలవాటు పడేవారు మరికొందరు.

Update: 2024-10-16 12:34 GMT

చేతిలో మొబైల్ పట్టుకుంటే మనకు ప్రపంచమే తెలియదు. ఉదయం లేవగానే సెల్‌ఫొన్ పట్టుకుంటారు కొందరు. తినేటప్పుడూ అది లేకుంటే ముద్ద దిగనంతగా అలవాటు పడేవారు మరికొందరు. సోషల్‌మీడియాలో మునిగిపోతే చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోం. పక్కన ఎవరున్నారో.. ఎక్కడున్నామో.. అర్థం కాదు. పెట్టిన పోస్టు లేక సెల్ఫీని ఎంతమంది చూశారు.. ఎన్ని లైక్‌లు వచ్చాయి. ఎంత షేర్ అయింది. ఏం కామెంట్లు చేశారు. ఎవరు పొగిడారు.. ఇదే ప్రపంచం. పొగిడితే పొంగిపోతాం. విమర్శిస్తే కుంగిపోతాం. ఎంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే అంత పాపులర్ అయ్యామని ఫీల్ అవుతాం. కనీసం పరిచయం లేని వ్యక్తిని, ముక్కు మొహం తెలియనివారిని ‘నాకు ఫేస్‌బుక్ ఫ్రెండ్’ అని గొప్పగా చెప్పుకుంటాం. సరదాగా మొదలైన ఈ అలవాటు వ్యసనంగా మారింది. పిల్లల్లోనూ ప్రబలుతున్న ఈ వ్యసనాన్ని ముందుగానే అరికట్టాల్సింది. ఇందుకు ఈ ఫాస్టింగ్ ఒక విధానంగా నిపుణులు చెప్తున్నారు. మరి ఈ విధానం ఏమిటి? దీనిని ఎలా ప్రారంభించాలనే విషయంపై ప్రత్యేక కథనం. = దిశ, తెలంగాణ బ్యూరో

స్మార్ట్.. ఫాస్టింగ్

శాస్త్రీయమో.. ఆచారమో.. ప్రతివారం ఒక రోజు ఉపవాసం (ఫాస్టింగ్) ఉండటం కొందరిలో ఒక విధానంగానే కొనసాగుతున్నది. ఆరోగ్య అవసరాల రీత్యా దీన్ని పాటిస్తున్నాం. ఇప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు, మనల్ని మనం కంట్రోల్ చేసుకునేందుకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నుంచి కూడా దూరంగా ఉండటం ఒక అవసరంగా మారింది. ఇందుకోసం ఈ-ఫాస్టింగ్ విధానం కొన్ని దేశాల్లో అమలవుతున్నది. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వినియోగం నుంచి ఎంత ఎక్కువ సేపు దూరంగా ఉండాలో నియంత్రించుకోవడమే ఈ విధానం ఉద్దేశం. సరదా నుంచి అలవాటుగా, ఆ తర్వాత అవసరంగా, చివరకు వ్యసనంగా మారే ధోరణి నుంచి బైటపడటమే దీని లక్ష్యం. ప్రతిరోజూ కొంత సమయాన్ని సోషల్ మీడియాకు దూరంగా ఉండగలిగితే మన మీద మనకు కంట్రోల్ పెరగడంతో పాటు సెల్ఫ్ డిసిప్లెన్ కూడా అలవాటవుతుంది.

పంచ సూత్రాలు

టెక్నాలజీ పెరిగి అరచేతిలోనే ప్రపంచాన్ని వీక్షిస్తున్న ఇప్పటి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తప్పనిసరిగా మారింది. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్, ట్విట్టర్ (ఎక్స్), టిక్‌టాక్, స్నాప్‌చాట్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వాడకుండా ఉండలేని చట్రంలో ఇరుక్కున్నాం. ప్రతిరోజూ గంటల తరబడి వీటిల్లో మునిగిపోయి ఒకవైపు మానసిక ప్రశాంతత కోల్పోతున్నాం. మరోవైపు ఆరోగ్యమూ చెడిపోతున్నది. స్పాండిలైటిస్, నెక్ పెయిన్, దృష్టిదోషం.. ఇలాంటివి వెంటాడుతున్నాయి. కానీ, ఆ వ్యసనం నుంచి బైటపడలేకపోతున్నాం. కుటుంబ సభ్యుల, వ్యక్తుల మధ్య సంబంధాలూ తగ్గిపోతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వాడకుండా ఒక రోజులో ఎంత సేపు ఉండగలమో మనల్ని మనం టెస్ట్ చేసుకోడానికి పాటించాల్సిన పంచ సూత్రాలు ఇవే.

1. వారంలో ఏదో ఒక రోజును సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనే నిబంధన పెట్టుకోవాలి. దీంతో యాంగ్జైటీ తగ్గుతుంది. ఒక రోజంతా దూరంగా ఉంటే దానిని రెండు రోజుల టార్గెట్‌కు పెంచుకోవాలి. దీంతో వ్యసనంగా మారిన సోషల్ మీడియా నుంచి దూరమై డైలీ లైఫ్‌లో ఒక డిసిప్లిన్ అలవడుతుంది.

2, ఒక రోజంతా సోషల్ యాప్స్ దూరంగా ఉండటం సాధ్యం కాదనుకుంటే ఏ టైంలో వీలవుతుందో అప్పుడు షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవాలి. లేదా ఫలానా టైమ్‌లో మాత్రమే కనెక్ట్ అవుతామనే డిసిప్లిన్‌ను అలవర్చుకోవాలి. లిమిటెడ్ టైమ్ ఉండేలా డైలీ క్యాలెండర్‌ను ఫిక్స్ చేసుకోవాలి. సాయంత్రం టైంలో లేదా పడుకునే ముందు మొబైల్‌లో సోషల్ మీడియాను వాడకుండా స్వీయ నియంత్రణకు మార్గాలు వెతుక్కోవాలి.

3. నిర్దిష్టమైన కారణం, ప్రయోజనం లేకుండా సోషల్ మీడియా బ్రౌజింగ్ మానుకోవాలి. కాలక్షేపం కోసం వాడటాన్ని పూర్తిగా తగ్గించాలి. వాడే ముందు తప్పనిసరియా? కాదా? ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సోషల్ మీడియా వాడాకే అల్గారిథమ్స్‌తో మన ఆలోచనలో లేని, సంబంధం లేనివి కూడా ప్రత్యక్షమవుతాయి. ఒకసారి ఆ ట్రాప్‌లో పడితే తరచూ ప్రత్యక్షమయ్యే వాటి నుంచి బైటపడటం కష్టమనే విజ్ఞతతో వ్యవహరించాలి.

4. వాటికి దూరంగా ఉండే క్రమంలో నోటిఫికేషన్ల ద్వారా అవి మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటాయి. వీటిని డిసేబుల్‌(ఆఫ్)లో పెట్టుకోవాలి. టెంప్ట్ కాకుండా సెల్ఫ్ కంట్రోల్ పద్ధతికి అలవాటుపడాలి.

5. స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా యాప్‌లను పర్మినెంట్‌గా డిలీట్ చేసుకునేలా మానసికంగా సిద్ధం కావాలి. ఆ వ్యసనం నుంచి బయటపడలేకపోతున్నామనుకుంటే డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌‌టాప్ ద్వారా మాత్రమే వాడేలా చూసుకోవాలి. క్రమంగా యాక్సెస్ చేయడంలో ఇబ్బందులతో వినియోగం తగ్గించుకుని వ్యసనాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్ పాత్ర ఎక్కువ

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అన్నింటికంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్నది ఫేస్‌బుక్‌కే. ఆ తర్వాతి స్థానాల్లో యూ ట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ (భారత్‌లో నిషేధం), వి చాట్, ఫేస్‌బుక్ మెసెంజర్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్‌లు ఉన్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్ వినియోగం ప్రపంచంలో ఇతర దేశాల కంటే భారత్‌లోనే ఎక్కువ. ప్రపంచం మొత్తం మీద ఫేస్‌బుక్‌కు 3.07 బిలియన్ (307 కోట్లు) యూజర్లు ఉంటే యూ ట్యూబ్‌కు 250 కోట్లు, వాట్సాప్‌కు 290 కోట్లు, ఇన్‌స్టాగ్రామ్‌కు 240 కోట్లు, ఫేస్‌బుక్ మెసెంజర్‌కు 97.7 కోట్లు, టెలిగ్రామ్‌కు 90 కోట్లు, స్నాప్‌చాట్‌కు 80 కోట్ల మంది చొప్పున యూజర్లు ఉన్నారు. ట్విట్టర్ (ఎక్స్), లింక్డ్ ఇన్ లాంటి ప్లాట్‌ఫామ్‌ వినియోగదారులు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. డాటా రిపోర్టల్, స్టాటిస్టా తదితర సంస్థల రిపోర్టుల ద్వారా తేలింది.

యూత్‌లోనే ఎక్కువ యూజర్లు :

ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్, టిక్‌టాక్ లాంటి సోషల్ మీడియాను వాడుతున్నవారిని వయసుల వారీగా విశ్లేషిస్తే (2024 మే వరకు) 18-44 ఏజ్ మధ్య ఉన్నవారే ఎక్కువ అని తేలింది. మొత్తం వంద మంది యూజర్లలో 31 మంది 18-24 ఏజ్ గ్రూపులోని వారు ఉంటే, మరో 31 మంది 25-34 ఏజ్ గ్రూపులోని వారు, 16 మంది 35.44 ఏజ్ గ్రూపులో ఉన్నట్లు వెల్లడైంది. కెన్యా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, కొలంబియా, చిలీ, అర్జెంటినా, ఇండోనేషియా, నైజీరియా, మెక్సికో దేశాలు టాప్ టెన్ జాబితాలో ఉన్నాయి. మూడు ఆఫ్రికా రీజియన్ (ఖండం)లో ఉంటే ఐదు లాటిన్ అమెరికా, రెండు ఆసియాలో ఉన్నాయి. దక్షిణ కొరియా, జపాన్ లాంటి దేశాలు అన్ని దేశాలకంటే దిగువన ఉన్నాయి. యూజర్లతో పాటు రోజువారీ వినియోగించే సమయం కూడా చాలా తక్కువ అని తేలింది.

రోజుకు రెండున్నర గంటల యూజ్

ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో టిక్‌టాక్, యూ ట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు టాప్ -5 ప్లాట్‌ఫామ్స్‌గా ఉన్నాయి. ఇందులో చివరి 3 ఒక్క కంపెనీకి చెందినవే. అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వినియోగం రోజుకు సగటున (గ్లోబల్ ప్రామాణికంగా) 140 నిమిషాలు ఉంటే పై ఐదింటికి మాత్రం యావరేజ్‌గా 64 నిమిషాలు ఉన్నట్లు వెల్లడైంది. వాట్సాప్ మాత్రం నెలకు సగటున ప్రపంచవ్యాప్తంగా 922 సార్లు చూస్తున్నట్లు తేలింది. భారతదేశంలో ఇంటర్నెట్ వాడుతున్న వారిలో దాదాపు 80.6% మంది ఇన్‌స్టా వాడుతున్నారు. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే ఇది ‘మా ఫేవరేట్’ అని 38% మంది రెస్పాండ్ అయ్యారు. నెలకు సగటున 20 గంటలు (రోజుకు 40 ని.లు) వాడుతున్నారు. డాటా రిపోర్టల్, స్టాటిస్టా, బ్యాక్‌లింకో, డిమాండ్స్ ఏజ్ లాంటి పలు సంస్థల రిపోర్టుల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

వినియోగంలో ఇండియా టాప్

ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూ ట్యూబ్, వాట్సాప్ వినియోగంలో ప్రపంచంలో మరే దేశం కంటే ఇండియా టాప్ ప్లేస్‌లో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ యూజర్లు 307 కోట్ల మంది ఉంటే అందులో ఇండియాలోనే 37.50 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు 240 కోట్ల మంది ఉంటే అందులో ఇండియా యూజర్లు 38.55 కోట్ల మంది ఉన్నారు. ఇక యూట్యూబ్ యూజర్లు ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది ఉంటే ఇండియాలో 47.6 కోట్ల మంది ఉన్నారు. వాట్సాప్ విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా 295 కోట్ల మంది యూజర్లు ఉంటే ఇండియాలో 53.58 కోట్ల మంది ఉన్నారు. ఇక్కడా ఫస్ట్ ప్లేస్ ఇండియాదే. దాదాపు 180 దేశాల్లోని యూజర్లు రోజుకు సుమారు 60 కోట్ల మెసేజ్‌లను పోస్ట్ చేస్తుండగా వచ్చే ఏడాది చివరకు ప్రపంచవ్యాప్త యూజర్ల సంఖ్య 314 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ నాలుగు ప్లాట్‌ఫామ్‌లలో ఇండియాదే ఫస్ట్ ప్లేస్.







 


 


 



Similar News