మ్యారేజ్ సర్టిఫికెట్ లేకపోతే మహిళలకు ఈ ఇబ్బందులు తప్పవు.. జాగ్రత్త!!
హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం వివాహ నమోదు మన ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మహిళలు తమ వివాహాన్ని నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వివాహం తర్వాత
దిశ, ఫీచర్స్ : హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం వివాహ నమోదు మన ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మహిళలు తమ వివాహాన్ని నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వివాహం తర్వాత తన ఇంటిపేరును మార్చుకోని స్త్రీకి వివాహ ధృవీకరణ పత్రం చాలా ముఖ్యమైనది. కాగా అది లేకపోతే మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఏంటో తెలుసుకుందాం.
హిందూ వివాహ చట్టం , 1955లోని సెక్షన్ 8, హిందూ వివాహాలను నమోదు చేయడానికి వీలు కల్పిస్తుంది. అయితే ప్రతి రాష్ట్రంలో వివాహాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలనే నిబంధనలు లేవు. సెక్షన్ 8లోని 5వ పేరా.. మ్యారేజ్ నమోదు చేయడంలో వైఫల్యం వల్ల వివాహం చెల్లుబాటు ప్రభావితం కాదని పేర్కొంది. అంటే హిందూ వివాహం చెల్లుబాటు సప్తపది వేడుకపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరు హిందూ వ్యక్తుల మధ్య తమ ఆచారాల ప్రకారం వివాహం జరిగితే అది చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడుతుంది. అయితే నమోదు చేసుకోకపోవడం వలన వైవాహిక జీవితంలో స్త్రీని ప్రభావితం చేసే సమస్యలు కూడా లేకపోలేదు.
న్యాయ పోరాటం :
గృహ హింస, వేధింపులు, వైవాహిక అత్యాచారం మొదలైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు.. భర్తకు వ్యతిరేకంగా కేసులు నమోదు చేయడం, పోరాడటం జరుగుతుంది. కానీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ లేని సందర్భాల్లో కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తవచ్చు. న్యాయం జరగకపోవచ్చు.
పెన్షన్ ప్రయోజనాలు :
పెన్షనరీ, హెల్త్ బెనిఫిట్స్, సర్వైవర్ క్లెయిమ్‌లు వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను క్లెయిమ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) ప్రకారం.. వివాహిత సభ్యుడు కుటుంబ పెన్షన్ పొందేందుకు తన జీవిత భాగస్వామి, పిల్లలను మాత్రమే నామినేట్ చేయగలడు. అతని తల్లిదండ్రులను కాదు. కాబట్టి వివాహ ధృవీకరణ పత్రం కలిగి ఉండటం వలన స్త్రీ తన భర్త EPSలో సభ్యురాలిగా ఉన్నట్లయితే.. దాని నుంచి వచ్చే పెన్షన్ ప్రయోజనాలను పొందేందుకు సహాయపడుతుంది.
భర్త మరణిస్తే ఆస్తి హక్కు క్లెయిమ్ :
మ్యారేజ్ రిజిస్ట్రేషన్.. స్త్రీ తన భర్త మరణించిన సందర్భంలో ఆస్తి హక్కులను క్లెయిమ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. వారసత్వ కేసులలో భర్త తల్లిదండ్రులు జీవిత భాగస్వామిని తొలగించడానికి తరచుగా వివాహం చెల్లుబాటును ప్రశ్నిస్తారు. అలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
విడాకుల ఇష్యూ :
వివాహం నమోదు చేయనట్లైతే విడాకుల సమయంలో సమస్యలను కలిగిస్తుంది. స్త్రీకి భరణం చెల్లించే విషయంలో వాదన జరుగుతుంది. అలా కాకుండా పెళ్లి సర్టిఫికెట్ ఉన్నట్లైతే హెల్ప్ అవుతుంది. అయితే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది విడిపోయే సమయంలో పిల్లల సంరక్షణను ఎవరు పొందాలనే నిర్ణయాన్ని ప్రభావితం చేయదు.
వీసా, ఇమ్మిగ్రేషన్:
వీసా దరఖాస్తులు, ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం.. ప్రత్యేకించి మరొక దేశంలో తమ భాగస్వాములతో ఉండాలనుకునే వారికి పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం కావచ్చు. నమోదు చేయకపోవడం ఇలాంటి ప్రక్రియలకు ఆటంకం కలిగిస్తుంది.
ఇతర సమస్యలు:
మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌ని తప్పనిసరి చేయకపోవడం మహిళలపై నేరాలకు పాల్పడేలా చేస్తుంది. ఉదాహరణకు ఢిల్లీ మాజీ పోలీసు జాయింట్ కమిషనర్ కిరణ్ బేడీ తన పదవీకాలంలో.. వివాహం జరిగిన ఒక రోజులో పరారీ అయిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్న బాధితురాలు... తనకు చదువు, సపోర్ట్ ఉన్నా వివరాలు తెలియక భర్త ఆచూకీని కనుగొనడంలో నిస్సహాయంగా ఉండిపోయింది, ఈ సందర్భంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఉంటే పరారీలో ఉన్న భర్త శాశ్వత చిరునామాను అందించేది. అంతేకాదు ఇలా పెళ్లి చేసుకున్న వారికి పుట్టిన పిల్లలు తాము వారసులమే అని చట్టబద్ధంగా నిరూపించేందుకు సహాయం చేస్తుంది అంటున్నారు నిపుణులు.