ఐస్‌క్రీమ్ తింటే భావోద్వేగాల్ని నియంత్రించవచ్చట.. పరిశోధనలో తేలింది ఇదే!
సహజంగా మనసు బాగలేకపోయినా కాస్త తలనొప్పిగా ఉన్నా వెంటనే టీ తాగాలనుకుంటారు.
దిశ, వెబ్‌డెస్క్ : సహజంగా మనసు బాగలేకపోయినా కాస్త తలనొప్పిగా ఉన్నా వెంటనే టీ తాగాలనుకుంటారు. టీతో మనసు ప్రశాంతం అనిపించడంతో రిలీఫ్‌గా ఫీలవుతారు. అయితే ఇప్పుడు ఆ టీ ప్లేస్‌లోకి ఐస్ క్రీం వచ్చిందనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. టీ, కాఫీ తాగితే ఎలాంటి ప్రశాంతత ఉంటుందో అదే రిలీఫ్ ఐస్ క్రీం కూడా ఇస్తుందని తాజాగా చేసిన పరిశోధనలో తేలింది. ఐస్ క్రీమ్ మనిషి భావోద్వేగాల్ని కూడా నియంత్రిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీకి చెందిన న్యూరో సైంటిస్ట్‌లు ఐస్‌క్రీం తినడం వల్ల సంతోషిస్తారా లేదా అని తెలుసుకోవాలనుకున్నారు. దీనిలో భాగంగా వారు చేసిన పరిశోధనల్లో పలు ఆసక్తిర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మానసిక ఒత్తిడి, చిరాకు, అసహనం వంటి సమస్యలు మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు ఒక చిన్న కప్పు ఐస్ క్రీమ్ తింటే చాలు.. చాలావరకు మూడ్ సాధారణ స్థితికి వచ్చేస్తుందట. ఇది మొదడులో సంతోషాన్ని ప్రేరేపించే సెరటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుందని తేలింది. ఐస్ క్రీం ప్రోటీన్, కొవ్వును కలిగి ఉంటుంది. ఈ రెండూ మన శరీరాలు మన మానసిక స్థితిని సమం చేయడంలో సహాయపడతాయి. పైగా, ఐస్ క్రీం తిన్నప్పుడు మీరు తీసుకునే అమైనో ఆమ్లాలు, ట్రిప్టోఫాన్ వంటివి సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అది మనల్ని ప్రశాంతంగా, సంతృప్తిగా, సంతోషాన్ని కలిగిస్తుందని వారి పరిశోధనలో తేలింది.
మహిళలు గర్భం ధరించిన సమయంలో హార్మోన్ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. వైద్యుల సలహా తీసుకొని గర్భవతులు కూడా ఐస్ క్రీంను లక్షణంగా లాగించేయొచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే సహజంగా డ్రై ఫ్రూట్స్, నట్స్, పండ్లతో తయారుచేసిన ఐస్ క్రీంను తింటేనే ఈ ప్రయోజనాలన్నీ ఉంటాయి. కృత్రిమ రంగులు, ప్లేవర్స్ కలిపిన ఐస్ క్రీములకు దూరంగా ఉండటం మంచిది. ఐస్ క్రీమ్ మీద ఉన్న మక్కువతో పెళ్ళి భోజనాలలో తాంబూలానికి బదులు ఐస్ క్రీములు అందిస్తున్న విషయం తెలిసిందే.