శరీరంలో అలాంటి మార్పులా.? మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో చెక్ చేసుకోండి!
Heart Health: శరీరంలో అలాంటి మార్పులా..? మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో చెక్ చేసుకోండి!
దిశ, ఫీచర్స్ : మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు, వాయు కాలుష్యం.. ఇలాంటి కారణాలు ఏవైనా ప్రస్తుతం గుండె జబ్బుల బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు పెద్ద వయస్సులో మాత్రమే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి వచ్చేవి. ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అందరిలో కనిపిస్తున్నాయి. అంతసేపూ ఎంతో సంతోషంగా ఉన్న వారు కూడా అకస్మాత్తుగా కుప్పకూలుతున్న సంఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అయితే గుండె వైఫల్యానికి సంబంధించిన లక్షణాలు, శారీరక మార్పుల గురించిన అవగాహన ఉంటే ఇలాంటి సమయాల్లో ప్రాణహాని నుంచి బయటపడవచ్చునని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఆ మార్పులేవో ఇప్పుడు చూద్దాం.
* నిజానికి గుండె వైఫల్యం సంభవించడానికి కొన్ని రోజులు లేదా కొన్ని గంటల ముందు నుంచే శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాంటి వాటిలో మొదటివి తీవ్రమైన అలసట, శారీరక బలహీనత. ఈ రెండూ ఎప్పుడూ అనుభవించని మీరు ఒకటి రెండు రోజుల నుంచి లేదా ఒకే రోజులో రెండు మూడు గంటల ముందు నుంచి అనుభవిస్తుంటే మీ గుండె బలహీన పడిందని అనుమానించాలి. ప్రమాదంలో పడకముందే డాక్టర్లను సంప్రదించాలి.
* గుండె ప్రమాదంలో ఉందని తెలిపే మరో లక్షణం శరీరంలో వాపు. ముఖ్యంగా కాళ్లు, మోకాళ్లు, చీలమండలం వంటి భాగాల్లో ఉబ్చినట్లు అనిపిస్తుంది. కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. గుండె పనితీరు సక్రమంగా లేనప్పుడు రక్త సరఫరాలో తేడాలు వచ్చినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఎంతకైనా మంచిది, ఒకసారి వైద్యులను సంప్రదించి టెస్టు చేయించుకుకోవడం బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
* గుండె కొట్టుకునే తీరులో అతి వేగం లేదా చాలా తక్కువ వేగం ఉన్నట్లు మీకు అనుమానం వచ్చినా అలర్ట్ అవ్వాలి. హార్ట్‌బీట్ ఎక్కువ కావడం గుండె వైఫల్యానికి దారితీసే లక్షణాల్లో ఒకటిగా ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి గుండె స్పందన సరిగ్గా లేదని గానీ, సాధారణంకంటే మరీ ఎక్కువగా ఉందని గానీ మీరు గుర్తిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించండి.
* మీ హార్ట్ రిస్క్‌లో ఉందని తెలిపే ఇంకో లక్షణం బ్రీతింగ్ ప్రాబ్లం. విపరీతమైన దగ్గు, శ్వాస తీసుకుకోవడంలో ఇబ్బంది సంభవిస్తే వెంటనే అప్రమత్తం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గతంలో లేని విధంగా, ఒక్కసారిగా గురక సమస్య పెరిగిపోయినా వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఇవన్నీ గుండె సరిగ్గా పనిచేయడం లేదనడానికి సంకేతాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.