Age after 30 : ఆ వయసులో నిర్లక్ష్యం వద్దు..! పురుషులూ జర జాగ్రత్త!!
Age after 30 : ఆ వయసులో నిర్లక్ష్యం వద్దు..! పురుషులూ జర జాగ్రత్త!!
దిశ, ఫీచర్స్ : గడిచిన కాలం తిరిగి రానట్లే.. గతించిన వయస్సు కూడా తిరిగి రాదు అంటుంటారు పెద్దలు. అందుకే జీవితంలో దేనినీ నిర్లక్ష్యం చేయవద్దని చెబుతుంటారు. ముఖ్యంగా చదువు, కెరీర్, ఆరోగ్యం, ఆనందం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిపుణులు సూచిస్తుంటారు. అలాకాకుండా అదృష్టం ఉంటే అన్నీ అవే కలిసి వస్తాయని ఆలోచిస్తూ కూర్చంటే మాత్రం ఇబ్బందుల్లో పడతారు. తీరా తీరుకొని ప్రయత్నం మొదలు పెట్టేసరికి కాలం మిమ్మల్ని దాటేసి పోతుంది. చూస్తుండగానే వయస్సు కూడా దాటిపోతుంది. అప్పుడు మీరనుకున్న అవకాశాలు చేదాటిపోవచ్చు. కాబట్టి లైఫ్‌లో హ్యాపీగా ఉండాలంటే 30 ఏండ్ల వయస్సులో, ముఖ్యంగా పురుషులు ఫాలో అవ్వాల్సిన హ్యాబిట్స్ కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
టర్నింగ్ పాయింట్
ప్రతీ ఒక్కరి జీవితంలో మూడు పదుల వయస్సు ఓ టర్నింగ్ పాయింట్. ముఖ్యంగా మగవారికి ఈ బోర్డర్ దాటకముందు అంతా సవ్యంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఉద్యోగం ఉన్నా.. లేకున్నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ అవ్వరు చాలా మంది. నచ్చిన పనిచేస్తూ, నచ్చినట్లు తిరుగుతూ ఉంటారు. కానీ ఆఫ్టర్ 30 తర్వాత అన్నీ మారిపోతుంటాయి. పెళ్లి, పిల్లలు, కుటుంబం, ఉద్యోగం, బాధ్యతలు వంటివి ఒక్కసారిగా చుట్టు ముడుతుంటాయి. ఇలాంటప్పుడు మీరు ఇబ్బంది పడకూడదంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ప్రధానంగా జీవనశైలిలో సానుకూల మార్పులు, నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం తప్పనిసరి.
రెగ్యులర్ వ్యాయామాలు
ఆరోగ్యంగా, ఆనందగా ఉండాలంటే శరీరానికి తగిన వ్యాయామం లేదా ఇతర ఏదైనా శారీరక శ్రమ రోజూ అవసరం. ఎప్పుడైతే దీనికి దూరం అవుతారో అప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు ఎంత బిజీగా ఉన్నా రోజూ ఏదో ఒక వ్యాయామం చేయండి. మరీ అంత సమయం లేదనుకుంటే వారంలో కనీసం 150 నిమిషాలైనా వర్కౌట్స్ ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.
సమతుల్య ఆహారం
బిలో 30 ఏజ్ వరకు మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇమ్యూనిటీ పవర్ కూడా బాగుంటుంది. ఒక్కోసారి డైట్, వ్యాయామాల విషయంలో పెద్దగా పట్టించుకోకపోయినా ఎఫెక్ట్ చూపకపోవచ్చు. కానీ ఆఫ్టర్ 30 మాత్రం అలా చేయకండి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పండ్లు, తాజా కూరగాయలు, లీన్ ప్రోటీన్స్ వంటివి డైట్‌లో భాగంగా చేర్చుకోవడం మంచిది.
స్ట్రెస్ మేనేజ్‌మెంట్
జీవితంలో ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేని సమస్యల్లో మానసిక ఒత్తిడి ఒకటి. అప్పులు చేయడంవల్లో, అనారోగ్యాల కారణంగానో, ఫ్యామిలీ ఇష్యూస్ వల్లో, ఉద్యోగ జీవితంలో సమస్యలో.. ఇలా ఏదో ఒకటి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తుంటాయి. ప్రశాంతంగా ఆలోచిస్తే వాటికి పరిష్కారం దొరుకుతుంది. సవాళ్లను స్వీకరిస్తే ఒత్తిళ్లు కూడా మీకు ఎన్నో గుణపాఠాలు నేర్పుతాయి. అలా కాకుండా చిన్న సమస్యకే కుంగిపోయి, అధిక ఒత్తిడికి గురైతే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా 30 ఏండ్ల తర్వాత ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి స్ట్రెస్ మేనేజ్ మెంట్ టెక్నిక్స్ తెలిసి మసలు కోవాలంటున్నారు నిపుణులు. యోగా, మెడిటేషన్, ఇతర వ్యాయామాలు చేస్తూ ఉండాలంటున్నారు.
క్వాలిటీ స్లీప్
ముప్పై ఏండ్లు దాటిన వారిలో తలెత్తుతున్న మానసిక, శారీరక సమస్యలన్నీ వారి స్లీపింగ్ సైకిల్‌పై ఆధారపడి కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకూ ఏడు లేదా ఎనిమిది గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ 30 ఏండ్ల తర్వాత స్త్రీలైనా, పురుషులైనా కుటుంబం, ఉద్యోగం, ఇతర అంశాల్లో బాధ్యలు పెరుగుతాయి. ఇవన్నీ అప్పుడప్పుడూ అతి ఆలోచనలకు, ఒత్తిడికి గురిచేస్తుంటాయి. ముఖ్యంగా రాత్రిళ్లు నిద్రను పాడుచేస్తాయి. ఒకవేళ నిద్రపోతున్నప్పటికీ అది నాణ్యమైనదిగా ఉండకపోవచ్చు. ఇది మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తుంది. ఆయుష్షును తగ్గిస్తుంది. సో నిద్రలేమిని దరిచేరనివ్వకండి.
రిలేషన్ షిప్స్
చాలా మంది 30 ఏళ్లలోపు తక్కువ బాధ్యల కారణంగా కాస్త ఫ్రీగా ఉంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, బంధువులు అంటూ అందరిలో కలిసిపోతూ, అవసరం అయినప్పుడు సమయం కేటాయిస్తూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఏజ్‌లో మునుపటిలా సమయం ఉండదు. తీరికలేకపోవడంవల్లో, సెలవులు దొరకకపోవడంవల్లో ఎవరికీ సమయం కేటాయించరు. దీంతో సంబంధాల్లో పలకరింపులు, ఆప్యాయతలు తగ్గవచ్చు. పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే బంధాలు దూరం అవుతాయి. కాబట్టి మునపటిలా కాకున్నా వీలైన సమయంలో మీ ఇష్టమైన వారికోసం సమయం కేటాయించండి. దీంతో సంబంధాలు బలపడతాయి. సంతోషంగా, ఆరోగ్యంగా ఉండటంలో దోహదపడతాయి.
ఆరోగ్యం జాగ్రత్త
30 ఏండ్ల తర్వాత శారీరక మార్పులు వస్తుంటాయి. టీనేజ్ లాంటి శారీరక సౌష్టవం, ఉత్సాహం వంటివి ఉండకపోవచ్చు. నేటి బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల స్ట్రెస్, యాంగ్జైటీస్‌తోపాటు సమయానికి తినకపోవడంవల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ తలెత్తే చాన్స్ ఉంటుంది. ఆహారపు అలవాట్ల కారణంగా మీకు తెలియకుండానే కళ్లు, లివర్, కిడ్నీలు ఇలా ఏ అవయవాలైనా బలహీన పడవచ్చు. ఎంతకైనా మంచిది మూడు పదుల వయస్సు దాటాక రెగ్యులర్‌గా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలంటున్నారు నిపుణులు. దీనివల్ల హెల్త్ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను మానుకోవడం బెటర్.
సరిపడా నీళ్లు తాగండి
ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం 8 నుంచి 10 గ్లాసుల వాటర్ తాగాలని చెప్తుంటారు ఆరోగ్య నిపుణులు. కొన్నిసార్లు బిజీ వర్కులో ఉండటంవల్లో, బయట తిరగాల్సిన పరిస్థితుల్లోనో చాలామంది పురుషులు దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. తర్వాత హెల్త్ పాడవుతుంది. కాబట్టి తగినంత నీరు తాగడం మంచిది. అలాగే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడం, మిమ్మల్ని మెంటల్లీ యాక్టివ్‌గా ఉంచే హాబిట్స్ అవర్చుకోవడం ముఖ్యం.
ఫైనాన్షియల్ ప్లాన్స్
జీవితంలోని అనేక సమస్యలకు పరిష్కారం డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఆరోగ్యం బాగా లేకపోతే ఆస్పత్రికి వెళ్లాలంటే అదే కావాలి. హెల్తీ ఫుడ్స్ తినాలన్నా, ఎక్కడికైనా ట్రిప్‌కు వెళ్లాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, వస్తువులు కొనాలన్నా అన్నీ మీవద్ద ఉండే డబ్బును బట్టే నిర్ణయం తీసుకోవవాల్సి ఉంటుంది. కాబట్టి మీ కనీస అవసరాలు తీర్చగలిగేంత వరకైనా మీరు ఆర్థికంగా స్థిరపడే ప్రయత్నం చేయాలంటున్నారు నిపుణులు. అందుకోసం మీకు వచ్చే ఆదాయంలో కొంత పొదు చేయండి. ముఖ్యంగా 30 ఏండ్ల తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్‌ను, జీవిత భీమాలను, ఆరోగ్య భీమాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి అంటున్నారు నిపుణులు.