Health : వైరస్‌ ముప్పు.. రోగాలను ఎదుర్కోవాలంటే..?

Health : వైరస్‌ ముప్పు.. రోగాలను ఎదుర్కోవాలంటే..?

Update: 2025-01-10 06:55 GMT

దిశ, ఫీచర్స్ : నాడు కోవిడ్ 19, నేడు హ్యూమన్ మెటాన్యూ వైరస్, అంతకుముందు ఇంకెన్నో.. ఇలా రకరకాల వైరస్‌ల దాడి పెరుగుతూనే ఉంది. నెలరోజుల ముందు వరకూ చైనాకే పరిమితమైందనుకున్న హెచ్ఎంపీవీ ప్రస్తుతం భారత్‌కు చేరింది. ఇక్కడ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు విధానపరమైన చర్యలు తీసుకుంటున్నాయి. అదే సందర్భంలో ప్రజలు కూడా అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు. అందుకోసం ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో వైరస్ ముప్పును ఎదుర్కోవడానికి తగిన రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కూడా ఒకటి. అందుకోసం ఉపయోగపడే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* హెచ్ఎంపీవీ అనే కాదు, మనల్ని అనారోగ్యానికి గురిచేసే అనేక రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలు ఉంటాయి. కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఆల్రెడీ మన శరీరంలో కూడా ఉంటాయి. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి పడిపోతుందో అప్పుడు వాటి ప్రభావం పెరుగుతుంది. దీంతో వ్యాధుల బారిన పడుతుంటాం. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా చూసుకోవాలంటున్నారు నిపుణులు. అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. రోజువారి ఆహారంలో భాగంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు, హెల్తీ ఫ్యాట్స్ వంటివి తీసుకుంటూ ఉండాలి. అట్లనే విటమిన్ ఎ, సి, డి, ఇ, అట్లనే జింక్, సెలీనియం లభించే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు.

*రోగ నిరోధక శక్తి పెంచడంలో నారింజ, నిమ్మ, దానిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడైనా వీటిని తినాలి. దీంతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే పాలకూర, బ్రోకలీ, తోటకూర, పుంటి కూర వంటివి తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

* పెరుగు, క్యాబేజీ, క్యారెట్, బీట్‌రూట్ వంటివి ఆరోగ్యకరమైన గట్‌ను నిర్వహించడానికి సహాయపడతాయి. అంటే పేగులు హెల్తీగా ఉంటేనే ఇమ్యూనిటీ పవర్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మీ డైట్‌లో భాగంగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. బాడి డిటాక్సినేషన్ కోసం, కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉండటానికి రోజంతా శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి. గ్రీన్ టీ, చమోమిలే టీ, అల్లంటీ వంటి హెర్బల్ టీలు కూడా రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్ ఇ ఉంటుంది. కాబట్టి బాదం పప్పులు కూడా తినాలి. అయితే ఇవి ఎక్కువగా తింటే కొందరికి అలర్జీ వస్తుంది. అలాంటి వారు తక్కువగా తినడం బెటర్. వెల్లుల్లిపాయలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది వైరల్ ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. కాబట్టి ఆహారంలో భాగంగా వెల్లుల్లిని వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటితోపాటు సరైన నిద్ర, ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేలా చూసుకోవాలి.

*నోట్:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.  

Tags:    

Similar News