Cancer risk : ఒబేసిటీతో క్యాన్సర్ ముప్పు.. 2035 నాటికి మరింత పెరిగే చాన్స్!
Cancer risk : ఒబేసిటీతో క్యాన్సర్ ముప్పు.. 2035 నాటికి మరింత పెరిగే చాన్స్!
దిశ, ఫీచర్స్ : మారుతున్న జీవన శైలి, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు.. ఇలా కారణాలేమైనా ఊబకాయం బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 38 శాతం మంది ఒబేసిటీతో బాధపడుతున్నారు. అయితే ఇది ఇతర అనారోగ్యాలతో పాటు 40 శాతం క్యాన్సర్ ముప్పును పెంచుతోందని సైతం నివేదిక పేర్కొన్నది. పరిస్థతి ఇలాగే కొనసాగితే 2035 నాటికి జనాభాలో 51 శాతం మంది ఒబేసిటీ బారిన పడే అవకాశం ఉందని వెల్లడించింది. అందుకే అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
*ఒకప్పుడు భారత దేశంలో ఊబకాయం పెద్ద సమస్యగా ఉండేది కాదు, కానీ క్రమంగా పెరుగుతూ వస్తోందని నిపుణులు చెబుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. మన దేశంలోనూ ప్రతీ16 మంది మహిళల్లో ఒకరు, ప్రతీ 25 మంది పురుషుల్లో ఒకరు చొప్పున ఒబేసిటీ బారిన పడుతున్నారు. అట్లనే ప్రతీ సంవత్సరం ఒబేసిటీ రేట్ 5.2 శాతం పెరుగుతోంది. అయితే పురుషులకంటే మహిళలు దీనివల్ల ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఒబేసిటీ కారణంగా వీరిలో ఏడు రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ 40 శాతం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
*ఊబకాయంతో ఉన్న మహిళలకు జన్మించే పిల్లలకు కూడా పెద్దయ్యాక స్ట్రోక్, డయాబెటిస్, ఆస్తమా, గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కుగా ఉందని నిపుణులు అంటున్నారు. దీంతోపాటు హార్మోన్లలో మార్పులు, హెచ్చు తగ్గులు, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్), మెనోపాజ్ స్టేజ్ వంటివి కూడా మహిళల్లో ఊబకాయం పెరగడానికి కారణం అవుతున్నాయి.
*ఒబేసిటీకి మరో ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. దీనివల్ల కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది జీవక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో తినే రుగ్మతలు పెరుగుతాయి. అలాగే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కాకపోవడంవల్ల అధిక బరువు మరింత పెరుగుతారు. క్రమంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. కాబట్టి ఒబేసిటీ బారిన పడకుండా జాగ్రత్త పడాలి. అందుకోసం ఆరోగ్యకరమైన జీవన శైలిని, ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.