రాత్రిపూట మెరిసే పుట్టగొడుగుల్ని చూశారా?.. మన దేశంలో ఆ ఒక్కచోటే కనిపిస్తాయ్..

పుట్ట గొడుగులు ఆహారంగా ఉపయోగపడతాయని, తెల్లగా, ఎర్రగా, వివిధ రంగుల్లో ఉంటాయని చాలామందికి తెలుసు. కానీ రాత్రిళ్లు మెరిసే పుట్టగొడుగుల గురించి మీరు విన్నారా?.. ప్రకృతి ప్రసాదించిన అందమైన అద్భుతాల్లో ఇవి కూడా ఒకటి.

Update: 2024-06-22 12:15 GMT

దిశ, ఫీచర్స్ : పుట్ట గొడుగులు ఆహారంగా ఉపయోగపడతాయని, తెల్లగా, ఎర్రగా, వివిధ రంగుల్లో ఉంటాయని చాలామందికి తెలుసు. కానీ రాత్రిళ్లు మెరిసే పుట్టగొడుగుల గురించి మీరు విన్నారా?.. ప్రకృతి ప్రసాదించిన అందమైన అద్భుతాల్లో ఇవి కూడా ఒకటి. మన దేశంలో మొదటిసారిగా కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్ రాణిపురం రిజర్వ్ ఫారెస్టులో ఇవి ఉన్నట్లు అక్కడి అటవీశాఖ అధికారులు గుర్తించారట. ఫిలోబోలెటస్ మానిప్యులారిస్ (Phylloboletus manipularis) అనే శాస్త్రీయ నామంగా పిలిచే ఈ పుట్టగొడుగులు రాత్రిపూట వాటిలో జరిగే రసాయనిక చర్యలవల్ల ఆకుపచ్చ కాంతిని వెదజల్లుతుంటాయి.

రాత్రిళ్లు మాత్రమే కాంతిని వెదజల్లే ఈ అరుదైన షైనింగ్ మష్రూమ్స్‌ను పగటి పూట గుర్తించడం కష్టం. వాటి గురించి బాగా తెలిసినవారే గుర్తుపట్టే చాన్స్ ఉంటుంది. అయితే షైనింగ్ మష్రూమ్స్ రాత్రిపూట ఆకు పచ్చని కాంతి వెదజల్లడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందంటున్నారు నిపుణులు. ఏంటంటే.. రసాయనిక చర్యవల్ల ఈ పుట్టగొడుగుల్లో లూసిఫేరేస్ అనే ఎంజైమ్ విడుదల అయి బయోలుమినిసెన్స్‌ అనే కాంతి పరావర్తనానికి ప్రేరణగా మారుతుందట. పైగా దీనికి ఆక్సిజన్ కూడా తోడవడంవల్ల ఆక్సీకరణం చెంది ఆకు పచ్చని కాంతి రూపంలో మెరుస్తుంది. ప్రస్తుతం కేరళలోని రాణిపురం అటవీ ప్రాంతంలో 50 రకాల పుట్టగొడుగులు ఉండగా వాటిలో షైనింగ్ మష్రూమ్స్ రాత్రిళ్లు ఆకట్టుకుంటున్నాయి. 


Similar News