గాలిపటాల సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా.. గూగుల్ స్పెషల్ ఇండిపెండెన్స్ డూడుల్!
దిశ, ఫీచర్స్: భారతదేశంలో ఆగస్ట్ 15న జరుపుకునే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గాలిపటాలు ఎగరేయడం ఓ సంప్రదాయంగా వస్తున్న విషయం తెలిసిందే.
దిశ, ఫీచర్స్: భారతదేశంలో ఆగస్ట్ 15న జరుపుకునే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గాలిపటాలు ఎగరేయడం ఓ సంప్రదాయంగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనేస్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతిబింబించేలా గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను ప్రదర్శిస్తోంది, దీన్ని కేరళకు చెందిన ఆర్టిస్ట్ నీతి రూపొందించగా, ఇది పతంగుల చుట్టూ ఉన్న సంస్కృతిని తెలియజేస్తోంది.
భారత సంస్కరణలపై సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఓ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధానమంత్రి 1927 నవంబర్ 8న ప్రకటించాడు. ఈ వార్త దేశవాసులందరిలోనూ ఆగ్రహజ్వాలలు రగల్చింది. భారతదేశ భావి రాజ్యాంగం ఎలా ఉండాలో భారతీయులు కదా తేల్చుకోవలసింది? తెల్లోల్లకు ఎలా తెలుస్తుందంటూ మండిపడ్డారు. దీంతో కమిషన్ సభ్యులు భారతదేశంలో అడుగుపెట్టిన రోజునే దేశమంతటా నిరసన ప్రదర్శనలు మిన్నంటాయి, వారికి వ్యతిరేకంగా ప్రజలు నల్లజెండాలు, గాలిపటాలు ప్రదర్శించారు. వాటిపై 'సైమన్ గో బ్యాక్' అని రాయడంతో పాటు భారతదేశ స్వాతంత్ర్య సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు నినాదాలతో కూడిన గాలిపటాలను ఎగరేశారు. అప్పటి నుంచి స్వాతంత్ర్య దినోత్సవ వేళ గాలిపటాలు ఎగరేయడం ఓ సంప్రదాయంగా మారగా, అవి ప్రజల స్వేచ్ఛకు వ్యక్తీకరణగా, వలస పాలనను నిరోధించే సాధనంగా నిలిచాయి.
ఈ మేరకు ప్రజలు తమ కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తూ గాలిపటాలు ఎగురవేయడం ద్వారా తమ దేశభక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే 75 స్వాతంత్య్ర దినోత్సవ వేళ గూగుల్ ఈ ట్రెడిషనల్ టచ్ ఇస్తూ భారతీయులకు స్పెషల్ డూడుల్‌ను డెడికేట్ చేసింది.
'గాలిపటాల చుట్టూ ఉన్న మన దేశ సంస్కృతిని ఈ గూగుల్ డూడుల్ రూపంలో నా ఆర్ట్ వర్క్ వర్ణిస్తుంది. ఆకాశమే హద్దుగా ఎంతో ఎత్తుకు ఎదగాలని, మనం సాధించిన ఎన్నో ఘనతలను ఎగురుతున్న గాలిపటాలతో సూచించాను' అని నీతి తెలిపింది.