Good bye : జీవితంలో ఎదగాలంటే ఈ 7 విషయాలను వదిలేయాల్సిందే !

Good bye : జీవితంలో ఎదగాలంటే ఈ 7 విషయాలను వదిలేయాల్సిందే !

Update: 2024-10-09 12:52 GMT

దిశ, ఫీచర్స్ :  సమాజంలో రకరకాల వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను మనం చూస్తుంటాం. వారిలో కొందరు మెంటల్లీ స్ట్రాంగ్‌గా కనిపిస్తుంటారు. మరికొందరు చాలా సున్నితంగా అనిపిస్తుంటారు. అయితే వయస్సు పెరిగే కొద్దీ, సమాజాన్ని చదివేకొద్దీ కొందరు మానసికంగా దృఢంగా తయారవుతుంటే.. మరి కొందరు అందుకోసం చాలా కష్టపడుతుంటారు. ఇవన్నీ ఆయా వ్యక్తుల ఆలోచనలు, ప్రవర్తనలు, మనస్తత్వాలు, సామాజిక సంబంధాలపై కూడా ఆధారపడి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అయితే మీరు జీవితంలో స్ట్రాంగ్‌గా, సంతోషంగా ఉండాలంటే మాత్రం కొన్నింటికి గుడ్ బై చెప్పాల్సిందే అంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దాం.

ఓవర్ థింకింగ్

మీరు చిన్నప్పటి నుంచి పెరిగేకొద్దీ అనేక సామాజిక, వ్యక్తిగత పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. అవన్నీ మీలో కొన్ని ఆలోచనలు స్థిరపడేలా, వ్యక్తిత్వం రూపు దిద్దుకునేలా సహాయపడి ఉండవచ్చు. అయితే అవన్నీ మీకు మేలు చేసేవి అయినప్పుడు సమస్యలేమీ ఉండవు. కానీ కొన్ని ఆలోచనలు కాలంతోపాటు మిమ్మల్ని మారనివ్వకుండా వెంటాడుతుంటాయి. మరి కొన్ని మీ అభివృద్ధికి ఆటంకంగా మారవచ్చు. అలాంటి వాటిలో ఓవర్ థింకింగ్ ఒకటి. నిజానికిది మానసిక బలానికి అడ్డంకిగా మారుతుందని నిపుణులు చెప్తున్నారు. చదువు, ఉద్యోగం, జీవితం, రోజువారీ కార్యకలాపాలు దానిని బట్టే ప్రభావితం అయ్యే అవకాశం ఉటుంది. ఈ క్రమంలో ఓవర్ థింకింగ్ మీలో నిరాశ, ఆందోళన, ఒత్తిడికి కారణం కావచ్చు. ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. విజయానికి ఆటంకంగా మారవచ్చు. కాబట్టి మీరు ఎదగాలంటే అతి ఆలోచన ధోరణిని ఈ రోజు నుంచే వాటిని వదిలేయండి.

స్వీయ సంరక్షణపై నిర్లక్ష్యం

జీవితంలో సంతోషంగా ఉండాలంటే సెల్ఫ్ కేర్ చాలా ముఖ్యం. అయితే బిజీ లైఫ్ షెడ్యూల్ కారణంగా కొందరు శ్రద్ధ చూపరు. సమయానికి తినకపోవడం, నిద్రను త్యాగం చేయడం, అనారోగ్యాలు వచ్చినప్పుడు తర్వాత చూద్దాం లే అనుకొని కేర్ తీసుకోకపోవడం వంటివి జరిగిపోతూ ఉంటాయి. కానీ తర్వాత సమస్యలుగా మారుతాయని గుర్తుంచుకోండి. అందుకే ఎంత బిజీగా ఉన్నా.. సమయానికి తిండి, సరైన నిద్ర, మెరుగైన ఆరోగ్యం వంటివి ముఖ్యమని గుర్తుంచుకోండి. ఇవి మీలో ఒత్తిడిని తగ్గిస్తాయి. మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి.

గతంలో జీవితంపై ఆసక్తి

ప్రతీ ఒక్కరికి గత అనుభవాలు ఉంటాయి. అవి ఆసక్తిగా, ఆనందాన్ని కలిగించేవిగా ఉండవచ్చు. ఎవైనా సరే మీరు వర్తమానంలో ఎదగాలంటే వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయవద్దు అంటున్నారు నిపుణులు. దీనివల్ల సమయం వృథా చేసుకునే వారు చాలా మందే ఉంటారు. గత పొరపాట్లకు జీవితాంతం చింతిస్తూ కూర్చోవడం, మధురమైన పాతరోజుల కోసం ఆరాట పడుతూ వర్తమానాన్ని పట్టించుకోవడం మీ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. కాబట్టి గతాన్ని ఒక జ్ఞాపకంగా ఉండనివ్వండి. వర్తమానంలో జీవించండి. అప్పుడే మీరు దృఢంగా తయారవుతారు.

సవాళ్లకు భయపడటం

జీవితం ఎల్లప్పుడూ సౌకర్యవంతంగానే ఉండాలని భావిస్తుంటారు చాలా మంది. కానీ అసాధ్యం. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో, ఏదో విషయంలో సమస్యలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. కొందరు వీటికి భయపడి అవకాశాలను కోల్పోతుంటారు. పైగా సవాళ్లను స్వీకరించకముందే నిరోధించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వృత్తిపరమైన, చదువుపరమైన సవాళ్లను నిరోధించడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. వాటిని స్వీకరించడం మీ మానసిక దృఢత్వానికి పునాదిగా మారుతాయి. కాబట్టి వదిలేయాల్సింది సవాళ్లను కాదు, వాటిని స్వీకరించలేని భయాన్ని అనేది గుర్తుంచుకోండి.

సంబంధాలను నిర్లక్ష్యం చేయడం

మీకు చాలా విషయాలు తెలిసి ఉండవచ్చు. కానీ ఏ వ్యక్తి కూడా సర్వస్వం తెలిసిన వారిగా ఉండటం ఎవ్వరికీ సాధ్యం కాదు. అనుభవాలు, అవగాహన, ప్రవర్తన, సమస్యలు, సవాళ్లు, ఆటంకాలు ఇలా రకరకాల సందర్భాల్లో నేర్చుకుంటూ ముందుకు సాగాల్సిందే. అయితే ఇలాంటి మానసిక బలం, ధైర్యం, ఆత్మ స్థైర్యం వంటివి ఒంటరిగా వృద్ధి చెందేవి కావు. సామాజిక సంబంధాలతో చెందుతుందుతాయి. కాబట్టి మీరు వాటిని నిర్లక్ష్యం చేయయడం మానుకోవాలి.

పగ, ప్రతీకారం, జెలసీ

పగ, ప్రతీకారం, జెలసీ వంటివి ఇతరులను నష్టపరిచేందుకు కొందరు ఉపయోగపడే అలవాట్లు లేదా ప్రవర్తనగా నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని కలిగి ఉండటంవల్ల ఇతరులకు జరిగే నష్టంకంటే, అవి కలిగి ఉన్నవారే అధికంగా నష్టపోతారు. నచ్చని విషయాలను మనసులో పెట్టుకోవడం, నచ్చని వారికి నష్టం చేయడమే లక్ష్యంగా నడుచుకునే క్రమంలో తమ పని, తమ అభివృద్ధి, తమ కుటుంబం వంటి విషయాలపై తక్కువ ఫోకస్ చేస్తారు. చివరికి స్వీయ అపరాధ భావనకు గురి అవుతారు. పైగా పగ, ప్రతీకారం, జెలసీ వంటివి పరిపూర్ణ వ్యక్తిత్వానికి ప్రతిబింబం కావు. పిరికి మనస్తత్వానికి నిదర్శనంగా నిపుణులు పేర్కొంటున్నారు.

మార్పునకు భయపడటం

సహజంగానే చాలా మంది రొటీన్‌‌కు అలవాటు పడిపోతుంటారు. ఏదైనా ఒక విషయంలో మార్పును అంత త్వరగా ఇష్టపడరు. అయితే నష్టం చేసేది అయినప్పుడు ఆలోచించవచ్చు. కానీ జీవితానికి మేలు చేసేదైతే ఎందుకు ఆహ్వానించకూడదు అంటున్నారు నిపుణులు. కాలంతోపాటు మీరు మారనంత వరకు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మార్పును గుడ్డిగా వ్యతిరేకించడం కూడా ఒక మానసిక బలహీనతే. కాబట్టి దృఢత్వమైన మనుషులుగా తయారు కావాలంటే మంచి కోసం మారే అవకాశాలను చేజార్చుకోవద్దు.

Tags:    

Similar News