Liver health : పోషకాలు ఫుల్.. లివర్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలివే..

ఆహారపు అలవాట్లో ప్రతికూల మార్పులు, మద్యపానం, ధూమపానం, అపరిశుభ్రత కలిగిన వాతావరణంలో ఎక్కువసేపు గడపడం, వాయు కాలుష్యం.. ఇలా రకరకాల కారణాలు ఈరోజుల్లో లివర్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.

Update: 2024-08-31 11:59 GMT

దిశ, ఫీచర్స్ : ఆహారపు అలవాట్లో ప్రతికూల మార్పులు, మద్యపానం, ధూమపానం, అపరిశుభ్రత కలిగిన వాతావరణంలో ఎక్కువసేపు గడపడం, వాయు కాలుష్యం.. ఇలా రకరకాల కారణాలు ఈరోజుల్లో లివర్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. దీంతో ఒకప్పటితో పోలిస్తే కాలేయ వ్యాధులు పెరుగుతున్నాయి. 40 ఏండ్లలోపు వారిలో కూడా ఫ్యాటీ లివర్ సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. మనం రోజూ వాడే కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

* బీట్ రూట్ : యాంటీ ఆక్సిడెంట్లు ఫుల్లుగా ఉండే వాటిలో బీట్ రూట్ ఒకటి. ఇందులో బీటైన్ సమ్మేళనం కూడా ఉంటుంది. ఇవి లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి. ఫైబర్ కంటెంట్ కూడా కలిగి ఉన్నందున మెటబాలిజం ఆరోగ్యానికి మంచిది. ఇక బీట్‌రూట్‌ను కూరగా వండటం ద్వారా లేదా సలాడ్‌లు, జ్యూస్‌ల రూపంలోనూ తీసుకోవచ్చు. పచ్చిగా కూడా తినవచ్చు.

* పసుపు : కొందరు కూరలో పసుపు తక్కువగా లేదా అసలు వేయకుండా వండుతుంటారు. కానీ ఇలా చేస్తే నష్టం. ఎందుకంటే పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి లివర్ వాపును తగ్గించడంలో, విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి.

* ఆకు కూరలు : పాలకూర, మెంతికూర, బచ్చలి కూర, తోట కూర ఇలా దాదాపు అన్ని రకాల ఆకు కూరలు కూడా లివర్ హెల్త్‌కు మంచిది. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటంవల్ల ఆకూకూరలు తినేవారిలో కాలేయ సమస్యలు తలెత్తే అవకాశం తగ్గుతుంది.

* వాల్ నట్స్ : యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ వాల్‌నట్స్‌లో ఎక్కువగా ఉంటాయి. చిక్కుడు కాయ, గుమ్మడి గింజలు, ఆనెంకాయ, బోడకార కాయ వంటివి కూడా వాల్ నట్స్ జాతి ఆహారంలో భాగమే. వీటిని తరచుగా తినడం వల్ల కాలేయం ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెప్తున్నారు. దీంతోపాటు గ్రీన్ టీ కూడా లివర్ హెల్త్‌కు మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

*గమనిక:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News