Overcompliment : పొగిడే వారితో జాగ్రత్త..! ఖాళీ చెంచాతో తినిపిస్తుంటారు!!

Overcompliment : పొగిడే వారితో జాగ్రత్త..! ఖాళీ చెంచాతో తినిపిస్తుంటారు!!

Update: 2024-10-20 06:25 GMT

దిశ, ఫీచర్స్ : ‘‘పొగిడేవారితో జాగ్రత్త ఖాళీ చెంచాతో తినిపిస్తుంటారు’’ అంటారు పెద్దలు. అలాగని మనిషికి పొగడ్తలు లేదా ప్రశంసలు అవసరం లేదని మాత్రం కాదు, కానీ.. మరీ ఎక్కువైతేనే మీరు రిస్క్‌లో పడవచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇక్కడ పొగిడే వ్యక్తి బాగానే ఉంటారు. దానికి పొంగిపోయే వారే నష్టపోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

లిమిట్ దాటితే..

దాదాపు ప్రతీ వ్యక్తి ఇతరులు తమను పొగడటాన్ని ఎంజాయ్ చేస్తారు. అయితే ఇది ఒక లిమిట్ వరకు ఉంటే మీలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయి. మానసిక వికాసాన్ని కలిగిస్తాయి. ప్రొడక్టివిటీని పెంచుతాయి. లిమిట్ దాటితేనే వ్యసనంగా మారవచ్చు. చివరికి ఎవరూ పొగడకపోతే మీకు ఏమీ తోచుదు. ప్రశంసించనిదే ముఖ్యమైన పని చేయలేని నిస్సాహాయులుగా మారుతారు. కాబట్టి జాగ్రత్త అంటున్నారు నిపుణులు.

పొగడ్తలు అనేక రకాలు

పొగడ్తల్లోనూ పలు రకాలు ఉంటాయి. మీ మంచి కోరి, మిమ్మల్ని ప్రోత్సహించాలని, మీ కళ్లల్లో ఆనందాన్ని చూడాలని పొగిడేవారు ఉంటారు. మిమ్మల్ని ఒత్తిడి నుంచి బయటపడేయాలని, మీరు సంతోషంగా ఉండాలని, మరింత ఉత్సాహంగా పనిచేయాలని పొగిడేవారు కూడా ఉంటారు. ఇలాంటివారివల్ల ఎలాంటి నష్టం లేదు. వాస్తవానికి వీరు మీకు ఆత్మీయులుగా భావించాలి. కానీ రెండవ రకం మనుషులుంటారు. వీరి పొగడ్తల్లో నిగూఢ అర్థాలు ఉంటాయి. మిమ్మల్ని మరీ ఎక్కువగా పొగిడేస్తుంటారు. చివరికి మీరు తప్పు చేసినా సమర్థిస్తూ పొగిడేస్తారు.

తప్పుదారి పట్టిస్తాయ్..

ఉదాహరణకు ఒక యువకుడు ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తుంటే వద్దని చెప్పాల్సింది పోయి.. ‘మహా రసికుడు ఆ మాత్రం ఉండాలి. మగాడు అన్నాక అలా చేయకుండా ఎలా ఉంటాడు’ అన్నారనుకోండి. ఇది ఆ వ్యక్తిని తప్పుదారి పట్టించే పొగడ్తగానే భావించాల్సి ఉంటుంది. పైగా ఇలాంటి పొగడ్త విన్న యువకుడు సంతోషంతో పొంగిపోవచ్చు. కానీ ఫైనల్లీ అతను నష్ట పోతాడు. ఇలా అనేక రకాల అతి పొగడ్తలు.. వాటికి పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యేవారిని ఇబ్బందుల్లోకి నెడతాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఎంతకైనా మంచిది మీకు లభించిన ప్రశంసలు, పొగడ్తలు మంచివేనా? మిమ్మల్ని ఉద్దరించేవేనా? ఒకసారి చెక్ చేసుకోవాలంటున్నారు నిపుణులు సూచిస్తున్నారు.

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త !

పొగడ్తలు స్వీకరించడం మంచిదే. మీలో మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. వాటికి పొంగిపోయే వ్యసనం ఉంటే మాత్రం జాగ్రత్త. మీరు ఇతరులు ఎప్పుడెప్పుడూ ప్రశంసిస్తారా అని ఎదురు చూడటం, పొగిడితే మాత్రమే ఆ రోజంతా ఉత్సాహంగా ఉండటం, పొగడకపోతే నిరాశకు గురికావడం, ఆ రోజు ఏమీ తోచకపోవడం, పొగిడే వ్యక్తి కనిపించకపోతే ఏదో కోల్పోయిన అనుభూతి కలగడం ఇవన్నీ మీలో పొగడ్తలకు పొంగిపోయే వ్యసనంగా నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి మీరు మారాలి.

బయటపడటం ఎలా?

పొగడ్తలను ఎంజాయ్ చేయడంలో తప్పులే. కానీ వ్యసనంగా కూరుకుపోతేనే నష్టం. కాబట్టి ఆ పరిస్థితి నుంచి బయటపడాలి. ఒకసారి ప్రశంసలకు అలవాటు పడ్డ తర్వాత బయటకు రావడం అంత ఈజీ కాకపోవచ్చు. కానీ సాధన చేయాలి. పొగడ్తలకు పొంగిపోయి నిర్ణయాలు తీసుకుంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించగలిగితే విషయం మీకే అర్థమై పోతుంది. సో.. అవతలి వ్యక్తి పొగిడినా, పొగడకపోయినా మీ పని మీరు సమర్థవంతంగానే నిర్వర్తించగలగాలి. మీరు మీలాగే ఉండాలి. ఇతరుల మాటలను బట్టి, పొగడ్తలను బట్టి మారకూడదు. మీ అవసరాన్ని, అవకాశాన్ని, ఆసక్తిని, ఆలోచనను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. అవి మీకు, ఇతరులకు హానిచేయ కూడదు. దీంతోపాటు పొగిడే వారి వ్యక్తిత్వాన్ని, భావాలను కూడా అర్థం చేసుకోగలిగే నాలెడ్జ్ మీకు ఉండాలి. అది అధ్యయనం, పరిశీలన ద్వారా అలవడుతుంది. పుస్తకాలు చదవడం, సామాజిక సంబంధాలు కలిగి ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ వంటివి ముఖ్యం. ఇవన్నీ మీలోని మానసిక బలహీనతలను పోగొడతాయంటున్నారు నిపుణులు. అప్పటికీ సాధ్యం కాదనుకుంటే మానసిక నిపుణులను సంప్రదించి తగిన సలహాలు, చికిత్స వంటివి తీసుకోవచ్చు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News