Personal Boundaries : హద్దే ముద్దు..! సంతోషంగా ఉండాలంటే పర్సనల్ బౌండరీస్ ముఖ్యమంటున్న నిపుణులు..
‘దేనికైనా ఒక హద్దుండాలి.. అవి ఆలోచనలైనా, వ్యక్తుల ప్రవర్తనలైనా..’ అంటుంటారు పెద్దలు. లేకపోతే నష్టపోతామని చెప్తుంటారు. ప్రతీ ఒక్కరి జీవితానికి ఇది వర్తిస్తుందని మానసిక నిపుణులు సైతం పేర్కొంటున్నారు.
దిశ, ఫీచర్స్ : ‘దేనికైనా ఒక హద్దుండాలి.. అవి ఆలోచనలైనా, వ్యక్తుల ప్రవర్తనలైనా..’ అంటుంటారు పెద్దలు. లేకపోతే నష్టపోతామని చెప్తుంటారు. ప్రతీ ఒక్కరి జీవితానికి ఇది వర్తిస్తుందని మానసిక నిపుణులు సైతం పేర్కొంటున్నారు. మితి మీరితే.. ఏదైనా బెడిసి కొడుతుందని, అందుకే ‘పర్సనల్ లైఫ్ బౌండరీస్’ను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. మానవ సంబంధాల్లో ఇవి చాలా ముఖ్యమని చెప్తున్నారు. సమాజంలో మీరు మంచి వ్యక్తులు గుర్తింపు పొందాలంటే.. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని గౌరవించాలంటే.. మీకంటూ కొన్ని సరిహద్దులు ఉండాలి. అలాంటి వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
అవును.. మీరొక ఆటలో నెగ్గాలంటే దానికున్న సరిహద్దును అంగీకరించాలి. ఉదాహరణకు టెన్నిస్, క్రికెట్, కబడ్డీ ఇలా ఏది తీసుకున్నా వాటికుండాల్సిన పద్ధలులు, రూల్స్ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే అవే వాటి సరిహద్దులు. గ్రౌండ్‌లోకి దిగాక వాటిని తప్పక పాటించాల్సిన అవసరం ఉంటుంది. పాటించకపోతే ఓటమిపాలవుతారు లేదా మీకు ఆట తెలియదని ఇతరులు అనుకుంటారు. దీంతో మీరు చులకనై పోవచ్చు. అందుకే ఆరోగ్యకరమైన సరిహద్దులు ఏర్పర్చుకోవడం, పాటించడం మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తాయని నిపుణులు చెప్తున్నారు.
మీకేం కావాలో తెలుసుకోండి
ఒక వ్యక్తిని హద్దుల్లో ఉంచడం లేదా హద్దుల్లో ఉండటం అనేది కరెక్ట్ కాదని మీరు అనుకోవచ్చు. కానీ హెల్తీ బౌండరీస్ విషయంలో ఇది వర్తించదంటున్నారు నిపుణులు. కొన్ని విషయాల్లో సరిహద్దులు లేకపోతేనే నష్టం జరుగుతుంది. నిరాశ, నిస్పృహ, బాధ వంటి వెంటాడుతాయి. హద్దుల్లో ఉంటే ఇవేవీ మీ దరిచేరవు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం, మీకు ఏం కావాలో తెలుసుకోవడం, ఇతరులు మీతో ఎలా ప్రవర్తించాలో ఒక క్లారిటీతో ఉండటం వంటివి సాధ్యం అవుతాయి. దీంతో మీకంటూ ఒక సరిహద్దును సెట్ చేసుకుంటారు. నిజం చెప్పాలంటే చాలా విషయాల్లో మీ సొంత ఆలోచనలకు పని చెప్తారు.
ఇతరుల జోక్యం వద్దు
అవసరమైనప్పుడు మీకంటూ పర్సనల్ స్పేస్ చాలా అవసరం. ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవడానికి, ఒక పనిచేస్తున్నప్పుడు ఇతరులతో ఇబ్బందిగా ఉన్నప్పుడు నిర్మొహమాటంగా చెప్పాలి. అలాగే మీ రిలేషన్ షిప్‌లో అయినా సరే.. టచ్ విషయంలో సౌకర్యంగా ఉండాలనుకోవడం, ఇష్టమైనప్పుడు ఆహారం, నీరు తీసుకోవడం, వ్యక్తిగత విషయాలు మాట్లాడటం, శృంగారంలో పాల్గొనడం వంటివి మీరు నిర్ణయించుకునే సరిహద్దులుగా ఉండాలి తప్ప అవతలి వ్యక్తి బలవంత పెడితే అంగీకరించే విషయాలుగా ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హగ్ చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం వంటి విషయాల్లో వ్యతిరేకించగలిగే ఫిజికల్ బౌండరీస్ కూడా మీరు కలిగి ఉండవచ్చు.
భావోద్వేగ సమయాల్లో..
మానవ సంబంధాల్లో భావోద్వేగాలు సహజం. అలాగనీ అన్నింటినీ మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి ఎమోషనల్ బౌండరీస్ కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తు్న్నారు. ఉదాహరణకు మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, కార్యాలయ విషయాలు మీరు ఎప్పుడు ఎవరితో పంచుకోవాలి. ఎవరితో షేర్ చేసుకోవద్దనేది మీ ఇష్టం. అది మీకు మీరే నిర్ణయించుకునే సరిహద్దుగా ఉండాలి. అంతేకానీ ఒకరి ప్రోత్సాహంవల్లో, ఒకరి బలవంతం కారణంగానో మీరు భావోద్వేగాలను వ్యక్తం చేయకూడదు. ముఖ్యంగా మీకు ఇష్టం లేని వ్యక్తులతో, ఇబ్బందిగా ఉండే వారితో ఏవీ చెప్పకండి. చెప్పకపోతే ఏం జరుగుతుందోననే భయం, ఆందోళన ఇక్కడ అవసరం లేదు. ఎంత బాధలో, భావోద్వేగంతో నిండిన సందర్భం అయినా సరే. ఎవరైనా మిమ్మల్ని గుచ్చి గుచ్చి అడిగినా ‘మీతో నా ఎమోషన్స్ లేదా పర్సనల్ విషయాలు పంచుకోలేను’ అని సూటిగా చెప్పేయడమే మీరు కలిగి ఉండే భావోద్వేగ సరిహద్దుగా చెప్పవచ్చు.
సమయం - సద్వినియోగం
సమయం చాలా విలువైనది. కాబట్టి తప్పక సద్వినియోగం చేసుకోవాలి. ఇతరులకోసం దానిని వృథాచేయకపోవడం, ఇతరులవల్ల మీ సమయాన్ని వృథా చేసుకోకపోవడం, మీ పనులకు ఆటంకం కలిగించే ఇతరుల ప్రవర్తనను వ్యతిరేకించడమే మీరు కలిగి ఉండే బెస్ట్ ‘టైమ్ బౌండరీస్’గా నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటిలో, ఆఫీసులో, సమాజంలో మీ సమయాన్ని ఎవరూ వృథా చేయని విధంగా సరిహద్దులు సెట్ చేసుకొని పాటించడం ఇందులో భాగం. ఉదాహరణకు మీకు ముఖ్యమైన పని ఉన్నప్పుడే మీ ఫ్రెండ్స్ ఏదైనా ఈవెంట్‌కి వెళ్దామంటారు. ఇక్కడ మొహమాటానికి పోతే నష్టపోతారు. మీకు ఇష్టమైతేనే వెళ్లండి. ఒక వేళ వెళ్లినా అక్కడ మీరు 20 నిమిషాలు లేదా అరగంట మాత్రమే ఉంటానని కూడా నచ్చిన ‘టైమ్ బౌండరీ’ని సెట్ చేసుకొని పాటించవచ్చు. అన్ని విషయాల్లోనూ మీ సమయాన్ని ఇతరులవల్ల వృథా చేసుకోకపోవడమే ఈ సరిహద్దు ప్రధాన ఉద్దేశంగా నిపుణులు చెప్తున్నారు.
గోప్యత ముఖ్యం
ప్రతి ఒక్కరి జీవితంలో ప్రైవసీ అనేది చాలా ముఖ్యం. వ్యక్తిగత జీవితం, శరీరం, శృంగారం వంటి విషయాల్లో సరిహద్దులు కలిగి ఉండటం, ఇతరుల జోక్యం లేదా ఆధిపత్యం లేకుండా ఉండటం ఉండటం ఇందులో భాగంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు మీ అనుమతి లేకుండా మీ భర్త/భార్య అయినా సరే మీతో శృంగారపరమైన చర్యలకు పూనుకోకూడదు. సంబంధిత విషయాలను చర్చించడం, ప్రేరేపించడం, ప్రోత్సహించడం వంటివి చేయకూడదు. అంటే ఇక్కడ మీరు వ్యక్తిగత సరిహద్దును కలిగి ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే వాటిని గౌరవించాలి. అలా గౌరవించని వ్యక్తులకు మీరు దూరంగా ఉండవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
సందర్భోచిత సంభాషణ
కొందరు సమయం, సందర్భం లేకుండా తమకు తోచింది మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. నలుగురిలో ఉన్నప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ లేదా వ్యక్తిగత విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు ఇది మీ ఇంటలెక్చువల్ బౌండరీని ఉల్లంఘించడంగానే అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ గౌరవానికి, వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలిగించే సందర్భోచితం కాని మాటలను, నిర్ణయాలను అనుమతించకపోవడం, నిర్మొహమాటంగా వ్యతిరేకించడం వంటివి సందర్భోచిత లేదా సంభాషణ సరిహద్దులను కలిగి ఉండటంగా నిపుణులు పేర్కొంటున్నారు. జీవితంలో మీరు సంతోషంగా ఉండాలన్నా, సక్సెస్ సాధించాలన్నా ఇవి చాలా ముఖ్యమని చెప్తున్నారు.