Clay pot : మట్టికుండలో వండితే.. ఆ టేస్టే వేరబ్బా..!

Clay pot : మట్టికుండలో వండితే.. ఆ టేస్టే వేరబ్బా..!

Update: 2025-03-22 12:18 GMT
Clay pot : మట్టికుండలో వండితే.. ఆ టేస్టే వేరబ్బా..!
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ : మట్టికుండ గుర్తుందా? ఒకప్పుడు వంట చేయడానికి, నీళ్లు తేవడానికి, ధాన్యం వగైరా స్టోర్ చేయడానికి మట్టి కుండలు, పాత్రలు వాడేవారు. కాలక్రమంలో వాటివాడకం తగ్గింది. ప్రస్తుతం స్టీల్ పాత్రలు, పలు రకాల మెటల్ కోటెడ్ పాత్ర వచ్చాయి. అయినప్పటికీ మట్టికుండకున్న పవర్, మట్టి పా్రతలకున్న ఆదరణ, వాటిపట్ల మక్కువ ఏమాత్రం తగ్గలే.. ఎందుకంటే ఇవి మన సంస్కృతిలో, సంప్రదాయంలో ఓ భాగం అంటారు పెద్దలు. నిజానికి మట్టి పాత్రల్లో వంట, మట్టి కండల్లో నీరు ఆరోగ్యదాయకం కూడాను. అదెలాగో చూద్దామా?

కుండను నానబెట్టడం

మంటికుండ లేదా పాత్రల్లో వంటచేస్తే మంచి రుచి వస్తుంది. పోషక నిలుపుదల లభిస్తుంది. అలాగే అధిక నూనె అవసరం ఉండదు. ఫలితంగా ఆరోగ్యకరమైన భోజనం లభిస్తుంది. మట్టి కుండలలో ఎటువంటి హానికరమైన రసాయనాలు లేదా విషపదార్థాలు ఉండవు. అయితే ఆహారాన్ని వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే కుండను నానబెట్టడం. వంటకు ముందు కొద్దిసేపు మట్టి కుండలో నీరు పోసి ఉంచాలి. దీంతో అది తేమను నిలుపుకొని వంట చేసేటప్పుడు పగుళ్లు రాకుండా ఉంటుంది. కుండను నానబెట్టిన తర్వాత దానిని ఒక గుడ్డతో శుభ్రంగా తుడవండి. ఇప్పుడు దానిని నీటితో నింపి తక్కువ మంట మీద ఉంచండి. రెండు నిమిషాల తర్వాత నీటిని పారపోయండి.

తక్కువ వేడి మీద..

మన సాధారణ వంటగది కుండల మాదిరిగా కాకుండా మట్టి కుండల్ని అధిక వేడితో వంట చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. కాగా ఎప్పుడూ కూడా మంట తక్కువ మీడియంలో ఉండేలా చూసుకోండి. అంతేకాకుండా తక్కువ వేడి మీద వంట చేయడం వల్ల ఆహారం నెమ్మదిగా ఉడికిపోతుంది. అప్పుడు ఆహారం రుచిగా మారుతుంది. ఇక మరో విషయం ఏంటంటే.. మట్టి కుండలోని ఆహారాన్ని కలపడానికి లోహ గరిటెను ఉపయోగించడం వల్ల దాని లోపలి భాగం దెబ్బతింటుంది. కాగా బంకమట్టి కుండల కోసం, చెక్క, సిలికాన్ గరిటె ఉత్తమ ఎంపికలు. అవి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు.

శుభ్రపరచడం

మట్టి కుండను సబ్బు, సున్నితమైన స్క్రబ్బర్ ఉపయోగించి సున్నితంగా శుభ్రం చేయండి. దానిని కడగేటప్పుడు జాగ్రత్తగా వహించండి. ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తే కుండ సెకన్లలోనే విరిగిపోతుంది. శుభ్రం చేసిన తర్వాత దానిని కాటన్ వస్త్రంతో తుడవండి. మట్టి కుండను గాలిలో ఆరబెట్టండి లేదా సూర్యకాంతిలో ఉంచడం మేలు. మట్టి కుండను సూర్యకాంతిలో ఆరబెట్టడం దాని నుండి తేమను తొలగించడానికి ఉత్తమ మార్గం. మట్టి కుండను కాటన్ వస్త్రంలో చుట్టి నిల్వ చేయండి.

ప్రయోజనాలు

మట్టికుండలోని నీరు తప్పక తాగాలని పెద్దలు, నిపుణులు చెప్తారు.కారణం వేసవిలో కండనీరు ఉష్ణోగ్రత సమతుల్యతను కలిగిస్తుంది. డీహైడ్రేషన్ ను నివారించడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా ప్లాస్టిక్ లేదా మెటల్ పాత్రల్లో, బిందెల్లో నీరు నిల్వ ఉంచితే వాటిలోని రసాయనిక చర్యలు, పదార్థాలవల్ల కలుషితం కావచ్చు. మట్టికుండల్లో అయితే ఆ చాన్స్ ఉండదు. ఇవి రసాయన రహితమైనవి. శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో మట్టికుండలోని నీరు, ఆహారాలు సహాయపడతాయని ప్రజలు నమ్ముతారు.

మోడర్న్ డిజైన్లలో..

మట్టికుండలకు ఆదరణ తగ్గిందని, వాటి వల్ల ఉపయోగం లేదని కొందరు అనుకుంటారు. కానీ ఇటీవల మళ్లీ మట్టికుండలపై ఆసక్తి పెరుగుతోంది. ఆధునిక డిజైన్లలో కూడా అవి లభిస్తున్నాయి. వాటిని గ్లాసులు, మగ్గులు, వాటర్ బాటిల్స్ రూపంలోనూ తయారు చేసి అమ్ముతున్నారు. కుండలకు ట్యాప్ సౌకర్యం కూడా లభిస్తున్నందున వేసవిలో ఫ్రిజ్ కొనే స్థోమత లేని చాలామంది ట్యాప్ ఉన్న మట్టి కుండలను కొంటారు. వీటిలో నీరు చల్లగా ఉంటుంది. ఇలా ఆరోగ్య ప్రయోజనాలతోపాటు మట్టి కుండలు మన సంస్కృతి, సంప్రదాయంలో భాగం. పర్యావరణ హితంగా చూస్తే మంచి ఎంపిక. అందుకని మట్టికుండలు మంచిదంటారు పెద్దలు, నిపుణులు.

Tags:    

Similar News