Excessive exercise : సిక్స్‌ప్యాక్ కోసం జిమ్‌కు వెళ్తున్నారా..? ఎక్కువసేపు చేస్తే ఆ సామర్థ్యం తగ్గిపోవచ్చు!

Excessive exercise : సిక్స్‌ప్యాక్ కోసం జిమ్‌కు వెళ్తున్నారా..? ఎక్కువసేపు చేస్తే ఆ సామర్థ్యం తగ్గిపోవచ్చు!

Update: 2024-10-20 07:31 GMT

దిశ, ఫీచర్స్: అందం, ఫిట్‌నెస్ వంటి అంశాలపై యూత్‌‌‌లో రోజు రోజుకూ ఇంట్రెస్ట్ పెరుగుతోంది. కండలు తిరిగిన శరీర సౌష్టవం కోసం కొందరు తరచుగా జిమ్‌లకు వెళ్తుంటారు. మరికొందరు ‘సిక్స్ ప్యాక్’ బాడీపై ఆసక్తితో గంటల తరబడి వర్కవుట్లకే కేటాయిస్తుంటారు. అయితే జిమ్‌లలో చేసే అతి వ్యాయామాలు పురుషుల సంతాన సాఫల్యంపై ప్రతి కూల ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. యూకేకు చెందిన పలువురు నిపుణులు జరిపిన అధ్యయనంలోనూ ఇది వెల్లడైంది.

ఇటీవల జంటల్లో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి గల కారణాలపై కూడా అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే యూకేకు చెందిన కొందరు నిపుణులు పురుషుల్లో వంధ్యత్వంపై అతి వ్యాయామాలు, జిమ్‌లలో వర్కవుట్లు, అక్కడి వాతావరణం ఏమైనా ప్రభావం చూపుతుందా? అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. స్టడీలో భాగంగా తరచుగా జిమ్‌సెంటర్లకు వెళ్లే స్త్రీ, పురుషులను కూడా ప్రశ్నించారు. కాగా ఈ సందర్భంగా వారు జిమ్‌లో అత్యధిక సమయం గడిపే ప్రతీ ఏడుగురు జంటల్లో ఒకరిని సంతానలేమి సమస్య వేధిస్తోందని గుర్తించారు. ముఖ్యంగా మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంటోందని తేలింది.

అధిక వేడికి గురికావడంవల్లే..

జిమ్‌లలో ఎక్కువసేపు గడిపే మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం, ఒకవేళ సరైన పరిమాణంలో ఉన్నప్పటికీ నాణ్యత లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే జిమ్‌కు వెళ్లే ప్రతి ఒక్కరిలో ఈ సమస్య తలెత్తుతుందని కాదు. కానీ ఫిట్‌నెస్ కోచ్‌లు, అతి వ్యాయామాలు చేసేవారిలో వంధత్యానికి ప్రత్యేక కారణాలు ఉంటున్నాయి. టైట్ జిమ్ వేర్స్, లెగ్గింగ్స్, షార్ట్స్ ధరించడం, 12 నుంచి 16 గంటల జిమ్‌లోనే గడుపుతూ కసరత్తులు చేయడం బాడీ టెంపరేచర్ పెరగడానికి దారితీస్తోందని, ఈ వేడి స్పెర్మ్‌కౌంట్ తగ్గడానికి కారణం అవుతోందని నిపుణులు నిర్ధారించారు. అలాగే జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతూ వర్కవుట్లు చేయడం జననేంద్రియాల్లో ఇన్‌ఫెక్షన్లకు కూడా దారితీస్తోందట. మొత్తానికి అక్కడి వాతావరణం, టైట్‌ఫిట్ దుస్తులు, అతి వ్యాయామాలు పురుషుల్లో స్పెర్ట్ కౌంట్‌ను, నాణ్యతను తగ్గించడం ద్వారా వారిలో సంతానం పొందే సామర్థ్యాన్ని తగ్గిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు.

పరిష్కారం ఏమిటి?

పురుషుల శరీరంలో దాదాపు హీట్ ఎక్కువగానే ఉంటుంది. అయితే జిమ్‌లలో అధిక వ్యాయామాల వల్ల, మరింత ఎక్కువగా వేడి ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా చూడ్డానికి ఉత్సాహంగా అనిపిస్తారు కానీ స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు ఎక్కువ. కాబట్టి జిమ్‌కు వెళ్లేవారు అక్కడే అధిక సమయం కేటాయించకుండా చూసుకోవాలి. అలాగే వర్కవుట్లు చేసేటప్పుడు బిగుతుగా ఉండే దస్తులు కాకుండా వదులుగా ఉండేవి వేసుకోవాలి. అలాగే తగినంత నిద్ర, హెల్తీ ఫుడ్, హెల్తీ లైప్ స్టైల్ వంటివి అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 


Similar News