నిద్ర తర్వాత బాడీ పెయిన్ వేధిస్తోందా? అందుకు కారణాలివే!
నిద్రలేవగానే మీ శరీరం అలసటగా ఉంటోందా? కండరాల్లో నొప్పిగా అనిపిస్తోందా?
దిశ, ఫీచర్స్: నిద్రలేవగానే మీ శరీరం అలసటగా ఉంటోందా? కండరాల్లో నొప్పిగా అనిపిస్తోందా?తలనొప్పి కూడా వేధిస్తోందా? అయితే అందుకు మీ స్లీపింగ్ పొజిషన్, వెయిట్, స్లీప్ డిజార్డర్‌తోపాటు విటమిన్లు, పోషకాల లోపం కూడా కారణం కావచ్చు. మీరు నిద్ర మేల్కోగానే శరీరంలో, వివిధ అవయవాల్లో నొప్పులు, హార్ట్ బీట్‌లో మార్పులు సంభవించడానికి ప్రత్యేక కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.
విటమిన్ డి లోపం
హైపోకాల్సెమియా (Hypocalcemia) లేదా లో బ్లడ్ కాల్షియం లెవల్స్, విటమిన్ డి లోపం వంటి కారణాలవల్ల నిద్రలేవగానే బాడీ పెయిన్స్ రావచ్చు. ఎందుకంటే శరీరంలో కిడ్నీలు, కండరాలు, ఇతర ముఖ్యమైన అవయవాలు సరిగ్గా పనిచేయడానికి, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి కాల్షియం చాలా అవసరం. కాల్షియంను గ్రహించడానికి దోహదం చేసే విటమిన్ డి శరీరంలో తగినంత లేకపోతే, అవయవాల్లో, ఎముకల్లో, కండరాల్లో నొప్పులు వస్తుంటాయి.
రక్తహీనత (Anemia)
మీ శరీరంలో ఎర్ర రక్త కణాల పనితీరు సరిగ్గా లేకపోతే రక్తహీనతకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితిలో శరీర కణజాలం తగినంత ఆక్సిజన్‌ను గ్రహించదు. ఈ కారణంగా శరీర భాగాలు తీవ్రంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. దీంతోపాటు మానసిక అలసట, హార్ట్ బీట్ పెరగడం, మైకం కమ్మినట్లు అనిపించడం, తల లేదా ఛాతీ నొప్పి సంభవించడం, అరికాళ్లు, అరిచేతులు చల్లగా అనిపించడం వంటి లక్షణాలు కూడా రక్తహీనతకు సూచనలుగా వైద్య నిపుణులు చెప్తున్నారు.
స్లీపింగ్ పొజిషన్, అధిక బరువు
అధిక బరువు శరీరం వెనుకభాగంపై, మెడపై ఒత్తిడిని పెంచుతుంది. శరీరంలోని వివిధ భాగాల్లో, కండరాల్లో నొప్పిని కలిగిస్తుంది. స్లీప్ బ్రీతింగ్ డిజార్డర్ సమస్యకు దారితీస్తుంది. స్లీప్ క్వాలిటీని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీంతోపాటు నాణ్యతలేని పరుపులు, బాడీపై ఒత్తిడిని పెంచే స్లీపింగ్ పొజిషన్స్ కూడా ఉదయం నిద్ర మేల్కొన్నప్పుడు బాడీపెయిన్స్ సమస్యకు కారణంగా పేర్కొనవచ్చు. కాబట్టి బరువు తగ్గడం మూలంగా మీ నిద్ర నాణ్యత మెరుగు పడుతుంది. దానికారణంగా వచ్చే బాడీ పెయిన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
Read More: బెల్లం కలిపిన నీళ్లను తీసుకోవడం వలన ఎన్ని లాభాలో తెలుసా?