Birds life : పక్షులు చెట్ల కొమ్మలపై నిద్రపోతున్నా కూడా ఎందుకని జారిపడవు?
నిజానికి మనం గాఢమైన నిద్రలోకి జారుకుంటే బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. కొన్నిసార్లు కదిపి లేపినా త్వరగా మేల్కోని పరిస్థితి ఉంటుంది. మరికొందరైతే నిద్రలో పలువరించడం, బెడ్ మీద పడుకున్నప్పుడు దిగ్గున ఉలిక్కి పడటం, కింద జారిపడటం వంటి అనుభవాలను కూడా ఎదుర్కొంటుంటారు.
దిశ, ఫీచర్స్ : నిజానికి మనం గాఢమైన నిద్రలోకి జారుకుంటే బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. కొన్నిసార్లు కదిపి లేపినా త్వరగా మేల్కోని పరిస్థితి ఉంటుంది. మరికొందరైతే నిద్రలో పలువరించడం, బెడ్ మీద పడుకున్నప్పుడు దిగ్గున ఉలిక్కి పడటం, కింద జారిపడటం వంటి అనుభవాలను కూడా ఎదుర్కొంటుంటారు. అంటే నిద్రాణ స్థితిలో స్పృహ లేకపోవడమే ఇందుకు కారణం. మనుషులందరిలో ఉండే సహజమైన ప్రక్రియ ఇది. కానీ పక్షుల్లో మాత్రం అలా ఉండదంటున్నారు నిపుణులు. అవి చెట్ల కొమ్మలపై నిల్చొని నిద్రపోతున్నప్పటికీ కిందకు జారిపడవు. అందుకు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలు మనల్ని ఆకట్టుకుంటుంటాయి. అలాంటి వాటిలో పక్షులు కూడా ఉన్నాయి. వాటి జీవన శైలి గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత మనలో సహజంగానే ఉంటుంది. గాలిలో ఎగురుతూ, చెట్లపై వాలుతూ ఉండే దృశ్యాల్ని చూసినప్పుడు, వాటి కిల కిల రావాలను విన్నప్పుడు కలిగే ఆనందమే వేరు. కొమ్మలు, రెమ్మల మధ్యన గూళ్లను నిర్మించుకొని జీవించే పక్షులు ఆహార సేకరణ కోసం ఎక్కడికి వెళ్లినా.. సాయంకాలానికి తిరిగి వస్తుంటాయి. వర్షం పడ్డప్పుడు గూటిలో తలదాచుకునే చాలా పక్షులు మిగతా సమయాల్లో గూటి బయట చెట్ల కొమ్మలపై కూర్చొనే నిద్రపోతుంటాయని జంతు శాస్త్రవేత్తలు చెప్తు్న్నారు.
అయితే రాత్రిళ్లు పక్షులు నిద్రపోతున్నప్పుడు కునుకు తీస్తాయి కదా అలాంటప్పుడు కింద ఎందుకు పడవు? అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. నిపుణుల ప్రకారం.. సమాధానం ఏంటంటే.. పక్షులు గాఢ నిద్రలో ఉన్నప్పటికీ, ఒక కన్ను తెరిచి నిద్రపోతాయని, ఈ సమయంలో వాటి మెదడులోని ఒక భాగం యాక్టివ్‌గా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అంటే ఓ వైపు నిద్రపోవడం, ఇంకో వైపు తెరిచి ఉన్న కంటి భాగం, మెదడులోని ఒక భాగానికి మధ్య ఉండే కనెక్షన్‌తో స్పృహతో కూడిన సమాచార ప్రాసెస్ కూడా జరుగుతుంది. దీంతో పక్షులు నిద్రలో కిందపడకుండా జాగ్రత్త పడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీంతోపాటు పక్షుల పాదాల నిర్మాణం కూడా చెట్ల కొమ్మలను చుట్టి పట్టుకున్నప్పుడు జారకుండా ఉండేందుకు అద్భుతంగా సహాయపడతాయి.