Edible Gold : తినే బంగారం గురించి తెలుసా?.. ఏయే పదార్థాల్లో యూజ్ చేస్తారంటే..

Edible Gold : తినే బంగారం గురించి తెలుసా?.. ఏయే పదార్థాల్లో యూజ్ చేస్తారంటే..

Update: 2024-10-19 07:04 GMT

దిశ, ఫీచర్స్ : బంగారాన్ని రకరకాల ఆభరణాల తయారీలో వాడతారు. అయితే దీనిని తినడానికి కూడా యూజ్ చేస్తారనే విషయం మీకు తెలుసా? బయట స్వీట్లు కొన్నప్పుడు వాటిమీద మెరుస్తున్న సిల్వర్ షీట్ మీరు చూసే ఉంటారు. ఎలాగైతే దీనిని వెండితో తయారు చేస్తారో.. అలాగే బంగారాన్ని కూడా ప్రాసెస్ చేసి తినడానికి యూజ్ చేయవచ్చు. ఇన్నాళ్లు దీని గురించి అంతగా తెలియదు కానీ.. ఇటీవల మార్కెట్లోకి తినే బంగారం కూడా వచ్చేసింది అంటున్నారు నిపుణులు. దీనినే ఎడిబుల్ గోల్డ్ అంటారు. పైగా దీనితో తయారు చేసిన పదార్థాలు కూడా రుచిగా ఉంటాయని చెప్తున్నారు.

ఏయే పదార్థాల్లో వాడుతారు?

స్వీట్లకు, వివిధ తినుబండారాలకు వాడే సిల్వర్ షీట్లు ఎలా దొరుకుతున్నాయో.. ఇప్పుడు ఎడిబుల్ గోల్డ్ కూడా అట్లనే లభిస్తోందని నిపుణులు అంటున్నారు. గోల్డ్ ఫ్లేక్స్, గోల్డ్ లీఫ్, గోల్డ్ డస్ట్.. ఇలా అనేక రూపాల్లో తినే బంగారం దొరుకుతోంది. ఈ గోల్డ్ షీట్స్ ఒకటి ఇప్పుడు రూ. 2 వందలు మొదలు కొని వేల రూపాయల వరకు వివిధ ధరల్లో లభిస్తున్నాయి. కాగా వీటిని బజ్జీలు, సమోసాలు, ఐస్ క్రీములు, స్వీట్లు, ఫ్రూట్స్ ఇలా రకరకాల ఆహార పదార్థాలతో కలిసి తినే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఎడిబుల్ గోల్డ్ పొడిని కూడా వాడవచ్చు. ఇప్పటికే దుబాయ్, ఖతార్ వంటి అరబ్ దేశాల్లోని విలాసవంతమైన విందుల్లో ఎడిబుల్ గోల్డ్‌తో కూడిన ఆహార పదార్థాలను వడ్డిస్తుంటారు. ఇండియాలోనూ ఈ సంప్రదాయం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది.

ఎలా తయారు చేస్తారు?

తినే బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంతోనే తయారు చేస్తారు. ఒక గోల్డ్ లీఫ్ తయారు చేయాలంటే అందుకు తగిన పరిమాణంలో గోల్డ్ తీసుకొని, దానిని వెయ్యి డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలో హీట్ చేస్తారు. అది కరిగిన తర్వాత అనేకసార్లు ప్రాసెస్ చేసి, రోల్ చేసి పలుచని పేపర్‌ లేదా రేకులా తయారు చేస్తారు. దీని మందం మహా అయితే 0.0001 మి. మీ ఉంటుంది. ఇక దీనిని వివిధ ఆహార పదార్థాలపై పూతలా యూజ్ చేయడం, పొడిలా మార్చి చల్లడం వంటివి చేస్తారు. ఇక రుచి విషయానికి వస్తే ఎడిబుల్ గోల్డ్‌కు ఏ విధమైన రుచి, వాసన ఉండదు. కాపోతే చూడ్డానికి అక్రటాక్ట్‌గా ఉంటుంది కాబట్టి కొందరు తమ విలాసవంతమైన హోదాను చాటుకోవడం కోసం ఈ ఎడిబుల్ గోల్డ్‌ను విందుల సందర్భంగా ఆహార పదార్థాల్లో వాడుతుంటారు. 


Similar News