Ginger Rock salt Tip : వర్షాకాలంలో ఇవి రెండు చాలు.. గొంతులో గరగర నుంచి రిలీఫ్!

సాధారణంగానే వర్షాకాలంలో జలుబు, గొంతు నొప్పి, గొంతులో గరగర వంటి సమస్యలు పిల్లల్లో, పెద్దల్లో తలెత్తుతుంటాయి. జ్వరాలు, వైరల్ ఇన్‌ఫెక్షన్లు వేధిస్తుంటాయి.

Update: 2024-09-06 13:07 GMT

దిశ, ఫీచర్స్ : సాధారణంగానే వర్షాకాలంలో జలుబు, గొంతు నొప్పి, గొంతులో గరగర వంటి సమస్యలు పిల్లల్లో, పెద్దల్లో తలెత్తుతుంటాయి. జ్వరాలు, వైరల్ ఇన్‌ఫెక్షన్లు వేధిస్తుంటాయి. వాతావరణ మార్పులు, తేమ శాతం పెరగడం కూడా ఇందుకు కారణం అవుతుంది. దీంతో కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు, దగ్గు వంటివి కూడా వస్తాయి. ప్రాబ్లమ్ ఎక్కువగా ఉన్నప్పుడు వైద్య నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. అయితే గొంతులో గరగర, జలుబు, అజీర్తి వంటి చిన్న చిన్న సమస్యలను అల్లం, రాతి ఉప్పుతో పోగొట్టుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. అదెలాగో చూద్దాం.

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉంటాయి. అజీర్తి, కడుపులో ఉబ్బరం, గొంతులో గరగర సమస్యల నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తాయి. అయితే భోజనానికి ముందు చిటికెడు రాతి ఉప్పుతో కలిపి తింటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. వీటిని ఉపయోగించడానికి నిపుణులు రెండు పద్ధతులు సూచిస్తున్నారు. మొదటి పద్ధతి ప్రకారం.. ఒక చిన్న అల్లం ముక్కను తీసుకోవాలి. దానిపై కొంచెం రాతి ఉప్పును చల్లాలి. భోజనానికి15 నిమిషాల ముందు దానిని తినాలి. ఈ సందర్భంగా ఉప్పు, అల్లం నుంచి వచ్చే ద్రవం కలిసి డైజెస్టివ్ సిస్టమ్‌ను ఉత్తేజపరుస్తాయి. గొంతులో గరగరను పోగొడతాయి.ఇక రెండవ పద్ధతి ప్రకారం అల్లాన్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో రాతి ఉప్పు కలిపి భోజనానికి ముందు కొద్దిగా తీసుకుంటే గొంతులో గరగరతోపాటు అజీర్తి సమస్యలు పోతాయి. అలాగే అల్లాన్ని నీటిలో మరిగించి వడబోసి, రాతి ఉప్పు లేదా చక్కెర వేసుకొని కూడా తాగవచ్చు. యాంటీ బయాటిక్ లక్షణాలు ఉండటంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో అల్లం అద్భుతంగా సహాయపడుతుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు డాక్టర్లను సంప్రదించగలరు.  


Similar News