జీవితంలో ఈ రెండు విషయాలకు బాధపడకండి..!
ప్రతీ ఒక్కరి జీవితంలో కష్టాలు, బాధలు, సంతోషాలు ఉంటాయి.
దిశ, ఫీచర్స్: ప్రతీ ఒక్కరి జీవితంలో కష్టాలు, బాధలు, సంతోషాలు ఉంటాయి. జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు మనిషిని కుంగదీస్తాయి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు మారుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళితే విజయం మన సొంతం అవుతుంది. జీవితంలో ఈ రెండు విషయాలు గొప్ప గుణపాఠాలు నేర్పుతాయి. అందులో ఒకటి ‘కష్టాలు’, రెండవది ‘ఓటమి’. దాదాపుగా ప్రతీ ఒక్కరి జీవితంలో ఇవి ఎదురవుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ బాధపడకూడదు. వాటిని ఎలా అధికమించి ముందుకు సాగుతారనే విషయాలపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
కష్టాలు.. పోరాడే శక్తినిస్తాయి: జీవితంలో కష్టాలు అనేవి సర్వసాధారణం. ఇవి ఏ రకంగానైనా రావొచ్చు. అయితే, జీవితంలో ఎదురయ్యే సమస్యలు.. వాటిని ఎలా అధికమించాలనే కసిని పెంచుతాయి. ప్రాథమిక దశలోనే కష్టాలను ఎదర్కొన్నట్లైతే, ఆ తరువాత వచ్చే ఎటువంటి సమస్యనైనా ఆత్మవిశ్వాసంతో సులువుగా అధిగమిస్తారు. సమస్యలు ఎదురైనప్పుడు, మనకు మద్ధతుగా ఎవరు ఉంటారో అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతీ కష్టం వెనుక ఒక కారణం ఉంటుంది. దానిని ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తే, విజయంవైపు అడుగులు పడినట్లై. కష్టానికి తగ్గ ఫలితం అని పెద్దలు అంటుంటారు. జీవితంలో మొదట కష్టాలను ఎదుర్కొన్న చాలామంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటే.. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించే నేర్పరి తనం పెరుగుతుంది.
ఓటమి నేర్పించే గుణపాఠం: ఓటమి మనిషికి గుణపాఠంతో పాటుగా భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే అనుభవాన్ని నేర్పిస్తుంది . ఏదైనా పని చేస్తున్నప్పుడు ఓటమి ఎదురవడం సహజమే. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, వ్యాపారంలో నష్టం, ఉద్యోగం కోల్పోవడమో, ఇలా జీవితంలో కొన్ని సందర్భా్ల్లో ఓటమి ఎదురవుతుంది. అలాంటి సమయంలోనే ఒక్కసారి ఆ సమస్యను మరో కోణం నుంచి పరిష్కరించే మార్గాన్ని వెతికేలా చేస్తుంది. భవిష్యత్తులో మళ్లీ ఓటమి ఎదురైతే, దానిని సులువుగా పరిష్కరించే ఆలోచనలను కలిగిస్తుంది.
కానీ, కొందరికి ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోతుంటారు. అలాంటి సమయంలోనే ఓటమికి గల కారణాలను వెతికి, మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలి.