చీమలే కదా అనుకోకండి!.. అవి చేసే కొన్ని పనులు తెలిస్తే..

చీమలు.. ఈ పేరు వినగానే చిన్న జీవులే కదా అనుకుంటాం. కానీ జీవ వైవిధ్యంలో వాటి ప్రత్యేకతే వేరు అంటున్నారు నిపుణులు. నేల సంరక్షణలో, ప్రకృతి సమతుల్యతలో ఇవి తమవంతు పాత్రపోషిస్తాయి.

Update: 2024-07-06 12:34 GMT

దిశ, ఫీచర్స్ : చీమలు.. ఈ పేరు వినగానే చిన్న జీవులే కదా అనుకుంటాం. కానీ జీవ వైవిధ్యంలో వాటి ప్రత్యేకతే వేరు అంటున్నారు నిపుణులు. నేల సంరక్షణలో, ప్రకృతి సమతుల్యతలో ఇవి తమవంతు పాత్రపోషిస్తాయి. అంతేకాదు చీమలు తెలివైనవని, వాటిని చూసి ఐక్యతను, కష్టపడే తత్వాన్ని నేర్చుకోవాలని పెద్దలు చెప్తుంటారు. అయితే ఇటీవల జరిగిన ఓ అధ్యనంలో కూడా చీమల గొప్పతనమేంటో నిపుణులు తెలుసుకోగలిగారు. అదేంటో చూద్దాం.

ఆపద సమయంలో చీమలు తమను, తమ తోటి జీవులను ఎలా కాపాడుకుంటాయో తెలుసుకునే ఉద్దేశంతో జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ ఉర్జ్‌బర్గ్ సైంటిస్టులు మాటబెలే, మెగాపోనెరా అనే విభిన్న చీమ జాతులపై పరిశోధనలు నిర్వహించారు. ఇందులో భాగంగా వారు కొన్ని చీమల సమూహాలను గుర్తించారు. వాటిలో ఒక చీమ కుడి తొడ భాగాన్ని కొద్దిగా కట్ చేసి వదిలేశారు. అయితే ఈ సందర్భంగా ఆ గాయపడిన చీమచుట్టూ మిగతా చీమలన్నీ చుట్టుముట్టి, దానిని ఓ పుట్టలోకి తీసుకెళ్లడాన్ని శాస్త్రవేత్తులు గమనించారు.

అంతేకాకుండా మిగతా చీమలన్నీ తమ నోటిలోని లాలాజలాన్ని బాధిత చీమగాయంపై పూయడం చూశారు. దీంతోపాటు సగం తెగిన తొడ భాగంతో సదరు చీమ మనుగడ సాగించలేదనే విషయాన్ని అర్థం చేసుకున్న మిగతా చీమలు భాగాన్ని తమ నోటి ద్వారా కొరుతూ తొలగించి తమ పద్ధతిలో చికిత్స చేశాయట. ఆ తర్వాత మళ్లీ లాలాజలాన్ని పూస్తూ రక్త స్రావం కాకుండా అడ్డుకున్నాయి. ఈ విషయాలన్నీ కరెంట్ బయాలజీ జర్నల్‌లో పేర్కొన్న నిపుణులు.. చీమలే కదా అనుకోకండి అవి చాలా తెలివైనవి, గాయాలు, ప్రాణాంతక సమయాల్లో తోటి చీమలకు తమదైన పద్ధతిలో సహాయం, సర్జరీలు వంటివి కూడా చేయగలవు అని పేర్కొన్నారు. 


Similar News