‘పానిక్ ఎటాక్స్’ బాధితులకు చేయాల్సిన సహాయం ఏంటో తెలుసా?

పానిక్ అటాక్స్ అనేవి ముందస్తు హెచ్చరిక లేకుండా సంభవించే భయాందోళనతో కూడిన పరిస్థితి.

Update: 2023-06-01 09:26 GMT

దిశ, ఫీచర్స్ : పానిక్ అటాక్స్ అనేవి ముందస్తు హెచ్చరిక లేకుండా సంభవించే భయాందోళనతో కూడిన పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఇవి తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. బాధితుడిని ఆ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు తగిన భరోసా లేదా సహాయం లభించకపోతే ప్రాణహాని సంభవించవచ్చు. అందుకే ఇటువంటి పరిస్థితుల్లో మీరు చేయాల్సిందేమిటో నిపుణులు సూచిస్తున్నారు.

భయాందోళన, యాంగ్జయిటీ, స్ట్రెస్ పరస్పర సంబంధం కలిగిన పదాలుగా అనిపిస్తాయి. కానీ ఎక్స్‌‌పీరియన్స్ భిన్నంగా ఉంటుంది. అలాగే మెంటల్ హెల్త్ కూడా లాంగ్ టైమ్ ట్రాక్షన్‌ను పొందుతుండగా.. ప్రజల్లో దీనిపై అవగాహన, ప్రాముఖ్యత క్రమంగా పెరుగుతున్నాయి. అదే సందర్భంలో ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. అలాంటి వాటిలో పానిక్ ఎటాక్స్ ఒకటి.

కాగా దీన్ని వ్యక్తుల్లో ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేదా లక్షణాలు లేకుండా తలెత్తే భయాందోళనగా పేర్కొంటున్నారు మానసిక నిపుణులు. ఒక వ్యక్తి తీవ్రమైన భయం లేదా ఒత్తిడికి గురైనప్పుడు ఇటువంటి హైపర్‌ వెంటిలేషన్(hyperventilation) వంటి శారీరక పరిణామాలకు దారి తీస్తుందని, వ్యక్తుల్లో తలెత్తే లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా దానివల్ల కలిగే ప్రభావాన్ని నియంత్రించచ్చునని చెప్తున్నారు.

పానిక్ ఎటాక్ లక్షణాలు

ఒక్కసారిగా మూడ్ చేంజ్ అవ్వడం, గుండె వేగంగా కొట్టుకోవడం, కళ్లు బైర్లు కమ్మడం, తలనొప్పి, తల తిరగడం, కాళ్లు, చేతులు చెమలు పట్టడం, వణకడం, శ్వాస ఆడకపోవడం, ఛాతి నొప్పి, అసౌకర్యం, వికారం, పట్టుకోల్పోవడం, తమకు ఏదో జరుగుతుందని భయపడటం, ఇక చనిపోతామేమోననే ఫీలింగ్ కలగడం వంటి హైపర్ వెంటిలేషన్ పరిస్థితులను పానిక్ ఎటాక్స్‌ లక్షణాలుగా పేర్కొంటారు.

భరోసా ఇవ్వండి

మీ కుటుంబసభ్యుడు లేదా మరెవరైనా.. పానిక్ ఎటాక్‌కు గురైన సింప్టమ్స్ గమనిస్తే కంగారు పడకండి. వారికి ఏం జరుగుతుందోనని ఏడ్వడం, భయపడుతూ కనిపించడం చేయకండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి బాధితుల్లో భయాందోళన తీవ్రమవుతుంది. కాబట్టి మీ మనసులో ఆందోళన ఉన్నా అది బయటకు కనిపించనీయకుండా.. ఏమీ కాదులే అన్నట్లు వ్యవహరిస్తూ ప్రశాంతంగా ఉండండి. భయాందోళనకు గురైన వ్యక్తికి.. ‘భయం అవసరం లేదు. ఏం కాదు, మేమున్నాం కదా, కాసేపట్లో తగ్గిపోతుంది’ అనే మాటలతో భరోసా ఇవ్వాలి. దీనివల్ల బాధితుల్లో అంతా సవ్యంగా జరుగుతుందనే పాజిటివ్ ఫీలింగ్ కలిగి ప్రమాద తీవ్రత తగ్గుతుంది. 20 నుంచి 30 నిమిషాల్లో పరిస్థితి అదుపులోకి వస్తుంది. ఒకవేళ రాకపోయినా వైద్య నిపుణులను సంప్రదించవచ్చు.

ఏది సౌకర్యమో తెలుసుకోండి

భయాందోళనకు గురైన వ్యక్తిని సౌకర్యవంతమైన, నిశ్శబ్ద వాతావరణంలో ఉండేలా చూడండి. ఏ విధంగా ఉంటే సౌకర్యంగా అనిపిస్తుందో బాధితులను అడిగి తెలుసుకోండి. ఉదాహరణకు వర్టిగో(తల తిరగడం) మొదటిసారి ఎటాక్ చేసినప్పుడు కూడా బాధితులు తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఒక్కసారిగా తల తిరగడం వల్ల తమకు ఏదో అయిందని, చనిపోతామని భయపడుతుంటారు. ఈ పరిస్థితిలో కొందరికి కూర్చుంటేనో, పడుకుంటేనో దాని తీవ్రత అధికం అవుతుంది. కాబట్టి నిలబడి ఉండటం, చెయిర్‌పై కొద్దిగా వెనక్కి వాలి కూర్చోవడం వల్ల బాధితులకు కొంత ఉపశమనంగా అనిపించవచ్చు. ఈ పరిస్థితిలో వారిని అలాగే చేయనివ్వాలి. మీరు దగ్గరగా ఉంటూ పర్యవేక్షిస్తూ ఉండాలి. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఇలా ఏ రకమైన పానిక్ ఎటాక్ సంభవించినా ముందు బాధితులకు మైండ్ ఫుల్‌‌నెస్ భరోసా ఇవ్వాలి.

కోపింగ్ స్టేట్మెంట్స్

పానిక్ ఎటాక్ బాధితుల పరిస్థితిని తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవాలి. అవసరం అయినప్పుడు వారితో తేలికపాటి సంభాషణ కొనసాగించాలి. వారు ఏ విధమైన స్ట్రెస్, పెయిన్ అనుభవిస్తున్నారో అడగండి. ‘‘మీరు దీనిని అధిగమించగలరు. అలా జరగడం సహజం. అదేం ట్రీట్మెంట్ లేని పరిస్థితి కాదు, మనుషులకు ఇలాంటివన్నీ వచ్చిపోవడం సహజం’’ అని కోపింగ్ స్టేట్‌మెంట్స్ ఇస్తూ ధైర్యం చెప్పాలి.

బాధితులకు ‘మేమున్నాం నీకేం కాదు’ అనే భరోసా ఇవ్వడం ద్వారా భయాందోళనతోపాటు అనేక సమస్యలు సగం దూరం అవుతాయని మానసిక నిపుణులు చెప్తున్నారు. కొన్ని భయాందోళనలు కేవలం ఇటువంటి భరోసా ద్వారానే తగ్గిపోయే అవకాశం లేకపోలేదు. మరికొన్ని చికిత్స అవసరమయ్యే ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి బాధితులకు తగిన భరోసా, సౌకర్యాన్ని అందించాక నిపుణులను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్.

Read More:   నర్వ్ ఫ్లాసింగ్.. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌‌ను తగ్గించే మోడ్రన్ ట్రీట్‌మెంట్ 

మీ భర్త పరాయి స్త్రీ వైపు చూడకూడదా.. అయితే ఇలా చేయండి

Tags:    

Similar News