Diwali : బాణాసంచా కాలుస్తున్నారా..? వీరు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు
Diwali : బాణాసంచా కాలుస్తున్నారా..? వీరు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు
దిశ, ఫీచర్స్ : ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకునే దీపావళి (Diwali) సందడి ఇప్పటికే మొదలైంది. టపాసులతో, రకరకాల బొమ్మలతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ఇక పండుగ రోజైతే వెలుగు జిలుగుల దీపకాంతులతో, బాణా సంచా మోతలతో ఇండ్లు, వీధులు వెలుగుల్ని విరజిమ్ముతాయి. అయితే బాణా సంచా వల్ల వెలువడే శబ్ద, వాయు కాలుష్యాలతో వాతావరణమే మరోలా మారిపోచ్చు. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బాణాసంచాల కాల్చడం ద్వారా వెలువడే కాలుష్యాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు (Children and pregnant women) శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారిపై ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
ఏం జరుగుతుంది?
పటాకులు కాల్చడంవల్ల దాదాపు 80 డెసిబుల్స్ (80 decibels) కంటే ఎక్కువ శబ్దం విడుదల అవుతుంది. దీనికి గురైతే చెవుడు, రక్తపోటు, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే పిల్లలు, గర్భిణులు అధిక శబ్దాలు (Loud noises) వినడంవల్ల తలనొప్పి, వికారం, వాంతులు వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. కాలుష్యం నిండిన పొగ కారణంగా దగ్గు, కళ్లల్లో మంట, చర్మంపై దద్దుర్లు వంటివి ఏర్పడవచ్చు. పటాకుల్లో ఉండే కెమికల్స్ మూలంగా చర్మం పొడిబారడమే కాకుండా స్కిన్ అలెర్జీలు తలెత్తుతాయి. కాబట్టి పండుగ రోజు వాయు, శబ్ద కాలుష్యాల నుంచి జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు ఎక్కువ కేర్ తీసుకోవాలి.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.