Digital Skills : భవితకు అదే భరోసా.. డిజిటల్ స్కిల్స్‌పై యువతలో పెరుగుతున్న ఇంట్రెస్ట్!

ఒకప్పుడు ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు ముఖ్యమైన అర్హతలుగా డిగ్రీలు, సంబంధిత స్టడీ సర్టిఫికెట్స్ మాత్రమే ఎక్కువగా పరిగణనలోకి తీసుకునే వారు. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది.

Update: 2024-08-29 10:02 GMT

దిశ, ఫీచర్స్: ఒకప్పుడు ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు ముఖ్యమైన అర్హతలుగా డిగ్రీలు, సంబంధిత స్టడీ సర్టిఫికెట్స్ మాత్రమే ఎక్కువగా పరిగణనలోకి తీసుకునే వారు. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. మీకు డిగ్రీ ఉన్నా లేకున్నా పర్లేదు.. కానీ స్కిల్స్ మాత్రం ఉండాల్సిందే అంటున్నాయి పలు కార్పొరేట్ సంస్థలు. అవి ఉంటే చాలు మీ మార్కుల లిస్టులు, పర్సంటేజీలతో పనిలేదంటూ అవకాశాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా జాబ్ మార్కెట్లో ఇప్పుడు ‘డిజిటల్ స్కిల్స్’కు ఫుల్ డిమాండ్ ఉందని సర్రే యూనివర్సిటీలోని ‘ఫ్యూచర్ ఆఫ్ వర్క్ రీసెర్చ్ సెంటర్’ నిపుణుల అధ్యయనంలోనూ వెల్లడైంది. యువత కూడా తమ బంగారు భవిష్యత్ కోసం ‘డిజిటల్ స్కిల్స్’పైనే ఇంట్రెస్ట్ చూపుతోంది.

మారుతున్న పరిస్థితి

కొన్నాళ్ల క్రితం మీకు మంచి ఉద్యోగం రావాలంటే స్టడీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటం ప్లస్ పాయింట్‌. కానీ ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది. మరిన్ని స్కిల్స్ అవసరం అవుతున్నాయి. ఎందుకంటే జాబ్ మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాలానుగుణంగా అప్డేట్ అవుతుంది. దీంతో అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకునే యూత్ కూడా మారాల్సి వస్తోంది. అలాంటప్పుడే నచ్చిన ఉద్యోగాలను సొంతం చేసుకునే వీలుంటుంది అంటున్నారు నిపుణులు. నిన్న మొన్నటి వరకు కంప్యూటర్ ఆపరేటింగ్, మెయిల్స్ పంపడం, చెక్ చేయడం, టైప్ చేయడం వంటివి వస్తే మీలో స్కిల్స్ ఉన్నాయి అనుకునేవారు. కానీ ఇప్పుడది సరిపోదు. డిజిటల్ స్కిల్స్ ఉంటేనే మీరు మోస్ట్ పర్‌ఫెక్ట్ అంటున్నారు నిపుణులు.

డిజిటల్ స్కిల్స్ అంటే?

టెక్నాలజీ డెవలప్ మెంట్ ఒకదగ్గర ఆగిపోయేది కాదంటున్నారు నిపుణులు. అది అప్డేట్ అవుతూ ఉంటుంది. అందుకు అనుణంగా ఉద్యోగాలు సృష్టించబడుతుంటాయి. యువత కూడా తదనుగుణంగా స్కిల్స్ పెంచుకుంటేనే వాటిని సొంతం చేసుకోగలుగుతుంది. రెండేండ్ల కిందటితో పోలిస్తే నేడు డిజిటల్ స్కిల్ పదానికి అర్థం కూడా మారిపోయింది. అంటే దాని పరిధి మరింత విస్తరించిందని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఒకప్పుడు కంప్యూటర్లు మాత్రమే ఇందులో భాగంగా ఉండేవి. ప్రస్తుతం ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, యాక్సెసరీస్ కూడా వచ్చి చేరాయి. అంటే డిజిటల్ డివైసెస్‌ను యూజ్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ పొందేందుకు లేదా తెలియజేసేందుకు అవసమైన నైపుణ్యాలనే నేడు డిజిటల్ స్కిల్స్ అంటున్నారు.

ఎందుకు అవసరం?

అధిక ఆదాయ సంస్థలు, కంపెనీలన్నీ డిజిటల్ స్కిల్స్ ఆధారంగానే ఎక్కువగా పనిచేస్తున్నాయి. వాటిని అలవర్చుకున్న ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. కాబట్టి యువత కూడా తమ భవిష్యత్ కోసం వాటిని నేర్చుకుంటోంది. అనేక రకాల టూల్స్, పరికరాలు, ప్లాట్‌ఫామ్స్ ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఆఫీస్ వర్క్ అయినా, రిమోట్ వర్క్ అయినా, హైబ్రిడ్ వర్క్ మోడల్ అయినా వర్క్ పర్‌ఫెక్ట్‌గా ఉండాలంటే ఇప్పుడు మీకు కావాల్సింది డిజిటల్ స్కిల్స్ మాత్రమే. ఇక సాఫ్ట్‌వేర్ రంగంలో ఇవి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఎంప్లాయెర్స్ కూడా తమ ఉద్యోగులు ‘డిజిటల్ స్కిల్స్’ను అందిపుచ్చుకోవాలని ఆశిస్తున్నాయి.

అవకాశాల మార్గం..

ప్రస్తుతం డిజిటల్ స్కిల్స్ కొందరు వ్యక్తులకో, కొన్ని రంగాలకో మాత్రమే వర్తించేవి కావు. అందరికీ అవసరం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే జాబ్ మార్కెట్ వాటిని ఆశిస్తోంది. అలాంటి వారికే అవకాశాలు, ఆఫర్లు కల్పిస్తోంది. బ్రిటన్ ప్రభుత్వం 2019లో నిర్వహించిన ఓ సర్వే ఫలితాల ప్రకారం.. ఆన్‌లైన్ వేదికల్లో ఉద్యోగ ప్రకటనలు వెలువరించే హై ఎర్నింగ్ సంస్థలు లేదా కంపెనీలు కూడా వాటి నోటిఫికేషన్లలో సుమారు 82 శాతం ప్రకటనల్లో డిజిటల్ స్కిల్స్‌ను కోరుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఆ స్కిల్స్ లేకపోతే కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేకపోవడం, కెరియర్ రిస్కులో పడే చాన్సెస్ ఉండటం ఇప్పుడు యూత్‌ను ఆలోచింప జేస్తున్నాయి. అందుకే తమ భవితకు భరోసానిచ్చే ముఖ్యమైన నైపుణ్యంగా ‘డిజిటల్ స్కిల్స్’ను గుర్తించి అలవర్చుకుంటోంది. 


Similar News