Child health : పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. జాగ్రత్తపడకపోతే గనుక..!

ఇటీవల వానలు దంచికొడుతున్నాయి. దీంతో పిల్లలు, పెద్దల్లో వైరల్ ఫీవర్లు, ఇతర సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

Update: 2024-09-03 07:27 GMT

దిశ, ఫీచర్స్ : ఇటీవల వానలు దంచికొడుతున్నాయి. దీంతో పిల్లలు, పెద్దల్లో వైరల్ ఫీవర్లు, ఇతర సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే కొందరు పిల్లలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చిన్నారుల్లో కనిపించే కొన్ని సంకేతాలు లేదా లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని పేర్కొంటున్నారు. అవేమిటో చూద్దాం.

అధిక అలసట, శ్వాసలో ఇబ్బందులు

ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల అలసిపోవడం వేరు.. కానీ కొందరు అలాంటివేమీ లేకపోయినా అధిక అలసటతో కనిపిస్తుంటారు. ముఖ్యంగా నడిచినా, మెట్లెక్కినా, ఆటల్లో పాల్గొన్నా పిల్లల్లో శ్వాసలో ఇబ్బందులు, అధిక అలసట వేధిస్తుంటే అది ప్రమాదకర సంకేతం కావచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆస్తమా లేదా హృదయ సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు లేదా డెవలప్ అయినప్పుడు కూడా ఈ లక్షణాలు పొడచూపుతాయి. రక్తహీనత కారణంగా కూడా జరగవచ్చు. అలాగే వర్షాకాలంలో అధిక అలసట ఆస్తమాతోపాటు న్యుమోనియా వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీయవచ్చు. కాబట్టి దానిని గుర్తించిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

ఆహారం ఇష్టపడకపోవడం

పిల్లలు ఇంటిలో వండిన ఆహారాన్ని ఎప్పటి లాగా తినడానికి ఇష్టపోడకపోవడం, టేస్టీ కోసం బయటి ఆహారాలు, జంక్ ఫుడ్స్ కావాలని కోరడం కూడా తరచుగా చేస్తుంటే.. వారిలో ఏదో ఒక సమస్యకు సంకేతం కావచ్చు. మానసిక రుగ్మతవల్ల కూడా ఇలా చేస్తుంటారు. అలాగే పోషకాహార లోపం, జీర్ణ సమస్యలు, కడుపులో ఉబ్బరం, గ్యాస్ట్రరైటిస్ వంటి సమస్యలున్నా పిల్లలు హోమ్ ఫుడ్ ఇష్టపడరు.

నడుము భాగం లావుగా మారడం

పిల్లలు చాలా వరకు సన్నగా లేదా బొద్దుగా ఉంటారు. వారి శరీరాన్ని గమనించినప్పుడు దాదాపు ఒకే పరిమాణంలో ఉంటుంది. బొద్దుగా ఉన్నా కూడా పిల్లల బుగ్గలు, చేతులు, బ్యాక్ అన్నీ కాస్త లావుగా కనిపిస్తాయి. కానీ ఇలా కాకుండా కేవలం నడుము, పిరుదుల భాగం వద్ద మాత్రమే లావుగా ఉండి.. మిగతా శరీర భాగం సన్నగా ఉంటే అది అనారోగ్య లక్షణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది డయాబెటిస్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్‌తో ముడిపడి ఉండవచ్చు అంటున్నారు.

రాత్రిళ్లు నిద్రలేకపోవడం

నిజానికి పిల్లలు ఆటల్లో మునిగిపోతుంటారు. మధ్యాహ్నం పూట నిద్రవచ్చినా స్కూల్లో ఉండటంవల్లనో, ఇంట్లో ఉంటే ఆటలు ఆడుకోవడంవల్లనో నిద్రపోరు. కానీ రాత్రికి మాత్రం త్వరగా నిద్రపోతుంటారు. ఇది వారిలో కనిపించే అత్యంత సహజ లక్షణం. అయితే ఇందుకు భిన్నంగా ఏడెనిమిదేండ్లలోపు పిల్లలు రాత్రిపూట 11 గంటలు దాటినా నిద్రపోకుండా ఉండటం, అలసిపోవడం వంటివి చేస్తుంటే.. దానిని ప్రమాద సంకేతంగా లేదా అనారోగ్య లక్షణాలుగా పరిగణించాలంటున్నారు వైద్య నిపుణులు. నిర్లక్ష్యం చేస్తే ఇతర వ్యాధులకు దారితీయవచ్చు.

* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు. 


Similar News