గర్భధారణ సమయంలో రక్తస్రావం ప్రమాదకరమా.. అలా ఎందుకు జరుగుతుంది ?
గర్భం అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను తెస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్: గర్భం అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను తెస్తుంది. అది మొదటి గర్భం అయితే స్త్రీకి చాలా విషయాలు తెలియవు. అలాంటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే ఈ కాలంలో జరిగే ప్రతి చిన్న, పెద్ద విషయాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే గర్భధారణ సమయంలో సంభవించే రక్తస్రావం గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో ఏ రకమైన రక్తస్రావం అయినా సాధారణమేనా ? లేదా ప్రమాద కరమా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి త్రైమాసికంలో తేలికపాటి రక్తస్రావం సాధారణం అంటున్నారు వైద్య నిపుణులు. మొదటి త్రైమాసికంలో మొదటి 12 వారాలలో 25 శాతం మంది మహిళలు అప్పుడప్పుడు స్పాటింగ్ ( రక్తస్రావం ) గురించి ఫిర్యాదు చేస్తుంటారు. ఇది చాలా సాధారణమైన విషయం అంటున్నారు నిపుణులు. ఈ సమయంలో శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి, కాబట్టి ఈ కాలంలో తేలికపాటి రక్తస్రావం జరగవచ్చంటున్నారు. కానీ రక్తస్రావం ఎక్కువగా ఉంటే అది సాధారణమైన విషయం కాదంటున్నారు. చాలా సందర్భాల్లో ఇది గర్భస్రావానికి సంకేతాలు కూడా కావచ్చంటున్నారు. అందుకే అలాంటి సమయంలో వెంటనే వైద్యుడికి సంప్రదించాలని చెబుతున్నారు. అల్ట్రాసౌండ్ సహాయంతో వైద్యులు పిండం హృదయ స్పందనను గుర్తిస్తారు, ఇది గర్భస్రావం జరిగిందో లేదో నిర్ణయిస్తుందంటున్నారు నిపుణులు.
మొదటి త్రైమాసికంలో రక్తస్రావానికి కారణాలు..
గర్భధారణ ప్రారంభ రోజుల్లో కొంత సాధారణ రక్తస్రావం ఉండవచ్చు, ఎందుకంటే ఈ సమయంలో ఫలదీకరణం చేయబడిన అండం గర్భాశయం లైనింగ్‌లో ఇంప్లాంట్ అవుతుందని చెబుతన్నారు. కొంతమంది స్త్రీలు తాము గర్భవతి అని తెలియకపోవటం వల్ల దీనిని సాధారణ పీరియడ్స్‌గా పరిగణిస్తారట. కానీ ఈ రక్తస్రావం సాధారణ కాలాల కంటే తక్కువగా, కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు ఉంటుందంటున్నారు నిపుణులు.
ఎక్టోపిక్ గర్భం ప్రమాదకరం..
మొదటి త్రైమాసికంలో చాలా సార్లు ఫలదీకరణం అయిన అండం గర్భాశయం గోడకు అంటుకోకుండా గర్భాశయం వెలుపల ఉన్న ఫెలోపియన్ ట్యూబ్‌కు జోడి అవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని చెబుతున్నారు నిపుణులు. సకాలంలో తెలియజేయకపోతే తల్లి ప్రాణానికే ప్రమాదం అంటున్నారు. కానీ ఇది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే కనిపిస్తుందట. ఇక్కడ పిండం అభివృద్ధి చెందడం ప్రారంభిస్తే, ఫెలోపియన్ ట్యూబ్ పగిలిపోయే ప్రమాదం ఉంటుందంటున్నారు. దీని వల్ల తల్లి చనిపోవచ్చంటున్నారు నిపుణులు.
మోలార్ గర్భం
మోలార్ గర్భాన్ని గర్భధారణ ట్రోఫోబ్లాస్టిక్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి అతి తక్కువ మందిలో కనిపిస్తుందట. ఈ పరిస్థితిలో శిశువుకు బదులుగా గర్భాశయం లోపల అసాధారణ కణజాలం అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఈ కణజాలాలు కూడా క్యాన్సర్‌గా మారవచ్చు. అంతే కాదు ఈ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తాయంటున్నారు. దీని వలన వాంతులు కలిగిన అనుభూతి చెందుతారు. అంతే కాదు గర్భాశయ క్యాన్సర్ విషయంలో గర్భధారణ సమయంలో కూడా రక్తస్రావం జరగవచ్చు. కొన్నిసార్లు ఇది కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించవచ్చు, కాబట్టి దీనికి సంబంధించి వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
రెండవ, మూడవ త్రైమాసికంలో రక్తస్రావం..
గర్భం దాల్చిన తరువాత రెండవ, మూడవ త్రైమాసికంలో రక్తస్రావం తల్లి, శిశువు ఆరోగ్యానికి హాని కలిగించవచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి మీరు దీనికి కారణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ప్లాసెంటా ప్రెవియా..
మావి గర్భాశయం క్రింద కూర్చుని పాక్షికంగా లేదా పూర్తిగా జనన ప్రదేశాన్నికప్పితే అది చాలా ప్రమాదకర పరిస్థితి అంటున్నారు నిపుణులు. ఇది దాదాపు 200 కేసులలో ఒకరిలో కనిపిస్తుందట. ప్లాసెంటా ప్రెవియా సంభవించినప్పుడు రక్తస్రావం ఉండవచ్చు ఈ సమయంలో స్త్రీకి సి-సెక్షన్ అవసరం కూడా కావచ్చంటున్నారు నిపుణులు.
రక్తస్రావాన్ని నిర్లక్ష్యం చేయవద్దు..
మూడవ త్రైమాసికంలో బిడ్డ పుట్టకముందే స్త్రీకి తేలికపాటి రక్తస్రావం మొదలవుతుందంటున్నారు. ఇది బిడ్డ ప్రసవ సమయం దగ్గరలో ఉందని తెలియజేస్తుందంటున్నారు. ఈ రక్తస్రావం చాలా సాధారణంగా ఎరుపు లేదా గోధుమ రంగులో ఉంటుందంటున్నారు నిపుణుల. అందుకే గర్భధారణ సమయంలో సంభవించే ఏదైనా రక్తస్రావాన్ని విస్మరించవద్దంటున్నారు నిపుణులు.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.