Pregnancy: ప్రెగ్నెన్సీ రావట్లేదా..? నాన్‌-స్టిక్ వంటసామానే కారణం.?

మహిళలు గర్భం దాల్చకపోవడానికి సరికొత్త కారణాన్ని వివరించారు పరిశోధకులు.

Update: 2023-03-25 07:53 GMT

దిశ, ఫీచర్స్: మహిళలు గర్భం దాల్చకపోవడానికి సరికొత్త కారణాన్ని వివరించారు పరిశోధకులు. పర్యావరణం, మనం రోజూ వినియోగించే ఉత్పత్తుల్లో పేరుకుపోతున్న ‘ఫరెవర్ కెమికల్స్’ ఇందుకు కారణమని వివరించారు. PFASగా పిలవబడే పెర్‌ ఫ్లోరో ఆల్‌కైల్ పదార్థాలు.. కాబోయే తల్లుల రక్తంలో అధిక స్థాయిలో చేరడం మూలంగా ప్రెగ్నెన్సీ పొందేందుకు 40 శాతం వరకు తక్కువ అవకాశాలున్నాయని తెలిపారు.

18-45 సంవత్సరాల వయస్సు గల 382 మంది మహిళల రక్త నమూనాలను దాదాపు ఏడాది పాటు పరిశీలించిన న్యూయార్క్‌ మౌంట్ సినాయ్‌లోని ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు.. గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తున్న మహిళలు నాన్-స్టిక్ వంటసామాను, యాంటీ-స్టెయిన్ ఫ్యాబ్రిక్స్ వంటి PFAS కలిగిన ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. PFAS మహిళల్లో సంతానోత్పత్తిని తగ్గిస్తుందని, PFAS ఎక్స్‌పోజర్ ప్రెగ్నెన్సీకి అడ్డుపడుతుందని వివరించారు. పునరుత్పత్తి హార్మోన్లపై ఎఫెక్ట్ చూపుతూ స్త్రీ సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తున్నాయని.. ఎండోమెట్రియోసిస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌(PCOS)కు ఎక్కువ ప్రమాదాలను కలిగి ఉందని తెలిపారు.

ఇక PFAS అనేది మానవ నిర్మిత రసాయనాల తరగతి. వేడి, నీరు, గ్రీజు, మరకలకు నిరోధక ఉత్పత్తులను తయారుచేయడానికి అనేక రకాల పరిశ్రమలలో దశాబ్దాలుగా ఉపయోగించబడుతున్నాయి. టాయిలెట్ పేపర్, పీరియడ్ అండర్‌వేర్ వంటి వాటిల్లోనూ వినియోగిస్తున్నారు. చాలా బలమైన ఫ్లోరిన్-కార్బన్ బంధాలు కలిగిన ఈ రసాయనాలు పర్యావరణంలో, మన శరీరంలో సులభంగా విచ్ఛిన్నం కాకుండా.. నెలలు, సంవత్సరాల పాటు పేరుకుపోయి కిడ్నీ మరియు వృషణ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి.  

Tags:    

Similar News