Black Friday Sale 2022 : ఏడాదిలో అతిపెద్ద ఆన్‌లైన్ సేల్
బ్లాక్ ఫ్రైడే అనేది 'థాంక్స్ గివింగ్(పాడిపంటలతో ఆశీర్వదించిన ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే రోజు)' తర్వాత వచ్చే సేల్స్ వీకెండ్. ఇది క్రిస్మస్ ముందు, థాంక్స్ గివింగ్ తర్వాత షాపింగ్‌గా పాపులర్ అయింది.. Latest Telugu News
దిశ, ఫీచర్స్ : బ్లాక్ ఫ్రైడే అనేది 'థాంక్స్ గివింగ్(పాడిపంటలతో ఆశీర్వదించిన ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే రోజు)' తర్వాత వచ్చే సేల్స్ వీకెండ్. ఇది క్రిస్మస్ ముందు, థాంక్స్ గివింగ్ తర్వాత షాపింగ్‌గా పాపులర్ అయింది. అమెరికావ్యాప్తంగా దుకాణాదారులు ఈ టైమ్‌లో కస్టమర్లకు ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ అందిస్తారు. ఇక భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిటైలర్లు ఈ ఆచారాన్ని కొనసాగిస్తుండగా.. ఈ ఏడాది బ్లాక్ ఫ్రైడే సేల్ నవంబర్ 25న నిర్వహించబడనుంది.
బ్లాక్ ఫ్రైడే చరిత్ర, ప్రాముఖ్యత :
వెయ్యేళ్ల క్రితం నుంచి అమెరికన్లు ఈ థాంక్స్ గివింగ్ వేడుక జరుపుకుంటున్నారు. 1942లో ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ ప్రకటన తర్వాత, ప్రతి ఏటా నవంబర్ నాలుగో గురువారం దీన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే 20వ శతాబ్దం మధ్యకాలం వరకు కూడా బ్లాక్ ఫ్రైడేను థాంక్స్ గివింగ్‌తో అనుసంధానించలేదు. అంతేకాదు 'బ్లాక్ ఫ్రైడే' అనేది 1869 యూఎస్ గోల్డ్ మార్కెట్ క్రాష్‌కు ప్రాతినిధ్యం వహిస్తుందని భావిస్తుంటారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక పరిణామాలతో బంగారం ధరలు తగ్గడం ద్వారా మార్కెట్ క్రాష్ సంభవించిన రోజు.
'బ్లాక్ ఫ్రైడే' అనే పదబంధం మొదట 1960ల్లో యూఎస్‌లోని ఫిలడెల్ఫియాలో కనిపించిందని కూడా చరిత్రకారులు భావిస్తున్నారు. థాంక్స్ గివింగ్ తర్వాత శుక్రవారం వీధులు ట్రాఫిక్‌తో నిండిపోయినప్పుడు, ఫిలడెల్ఫియా పోలీస్ డిపార్ట్‌మెంట్ దాని గురించి ఫిర్యాదు చేసింది. దీనిని 'బ్లాక్ ఫ్రైడే'గా అభివర్ణించారు. మరోవైపు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ బ్లాగ్ ప్రకారం.. ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలోని లెక్సికోగ్రాఫర్లు ఈ పదం మొదట 1610లో వచ్చిందని కనుగొన్నారు. ఇది 'థాంక్స్ గివింగ్' లేదా అమ్మకాలతో సంబంధం లేనిది. బదులుగా, పరీక్ష ఉన్న ఏదైనా శుక్రవారం బ్లాక్ ఫ్రైడేగా సూచించబడుతుంది. ఇక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రకారం.. బ్లాక్ ఫ్రైడేను హాలిడే షాపింగ్ సీజన్‌కు అధికారిక ప్రారంభంగా ఉపయోగించే సంప్రదాయం 1961 నాటిది.