Self acceptance : మిమ్మల్ని మీరు అంగీకరించడమే సక్సెస్ మంత్ర.. లోపాలను అధిగమించడంలో అదే కీ రోల్!

కొంతమంది తమలో చిన్న చిన్న లోపాలున్నా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ సెల్ఫ్ యాక్సెప్టెన్సీ (స్వీయ అంగీకారం) అందుకు దోహదపడుతుందని నిపుణులు చెప్తున్నారు.

Update: 2024-09-01 12:31 GMT

దిశ, ఫీచర్స్ : కొంతమంది తమలో చిన్న చిన్న లోపాలున్నా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ సెల్ఫ్ యాక్సెప్టెన్సీ (స్వీయ అంగీకారం) అందుకు దోహదపడుతుందని నిపుణులు చెప్తున్నారు. అదే వారిని సక్సెస్ వైపు నడిపిస్తుంది. మరికొందరు చిన్న సమస్యను కూడా పెద్దగా ఊహించుకుంటారు. వీరు తమ లోపాన్ని అధిగమించే ప్రయత్నంలో భాగంగా ఇతరులను నిందిస్తుంటారు తప్ప సెల్ఫ్ యాక్సెప్టెన్సీకి అవకాశం ఇవ్వరు. అదే వారిలో ఓటమికి కారణం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే మీరు సక్సెస్ ఫుల్ పర్సన్ కావాంటే స్వీయ అంగీకార భావాన్ని కలిగి ఉండాలని, ఆయా పరిస్థితుల్లో దానిని అంగీకరించాలని, అన్వయించుకోవాలని సూచిస్తున్నారు.

ఇటీవల బాడీ పాజిటివిటీ, న్యూట్రాలిటీ విషయాల్లో సెల్ఫ్ యాక్సెప్టెన్సీ ప్రయారిటీపై సోషల్ మీడియా వేదికగా పలువురు డిస్కస్ చేస్తున్నారు. కొందరు తాము అందంగా లేమని, లావుగా ఉన్నామని, ఏదో వైకల్యం ఉందని భావిస్తున్నప్పటికీ వాటిని తమలో భాగంగా అంగీకరించడం ద్వారా ప్రతికూల భావాలను, సమాజంలో ఎదురయ్యే అవమానాలను, విమర్శలను తట్టుకొని నిలబడుతున్నారు. వాటిని పట్టించుకోకుండా తమను తాము ప్రేమించుకోవడం ద్వారా చదువులో, ఉద్యోగాల్లో, చేస్తున్న పనిలో విజయం సాధిస్తున్నారు. ఇక్కడ స్వీయ అంగీకారమే వారిని తీర్చిదిద్దుతోంది. భౌతిక రూపం ఏదైనా ప్రమాదకర భావాలను, విలువలను తమకు ఆపాదించుకోవడం, పోల్చుకోవడం సరైంది కాదని నేటి యువత గుర్తించడంలో సెల్ఫ్ యాక్సెప్టెన్సీ కీ రోల్ పోషిస్తుందని మానసిక నిపుణులు చెప్తున్నారు.

మీపై మీరు ఫోకస్ చేయండి

సమాజంలో, ఇతర వ్యక్తుల్లో లోపాలను గుర్తించడంపై, వాటిని ఎత్తి చూపడంపైనే ఫోకస్ పెడుతుంటారు కొందరు. ఇది అవసరమే కానీ.. తమలోని లోపాలపై అంతగా దృష్టి పెట్టకపోవడం ఇక్కడ పెద్ద లోపం. చాలా మందిలో ఇది సహజంగా జరిగే విషయమే అయినప్పటికీ కొందరు మరీ ఎక్కువగా తమను తాము విస్మరించుకుంటారు. పని, సంబంధాలు, సమస్యలు, శారీరక లోపాలు, సానుకూలతలు, ప్రతికూలతలు ఇలా ఏ విషయంలోనైనా తమ లోపాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. ఈ స్వభావం విమర్శలకు, ఓటమికి కారణం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆత్మ పరిశీలన చేసుకుంటూ.. అదే సందర్భంలో మిమ్మల్ని తీర్చిద్దుకుంటూ ఉండాలి. ఇక్కడ స్వీయ అంగీకారం ముఖ్యం.

మీ ఎదుగుదలకు సహాయపడుతుంది

మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి చక్కటి మార్గం లాంటిది స్వీయ అంగీకరం. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడంలో, మీలోని ప్లస్ అండ్ మైనస్‌లు గుర్తించి సరిచేసుకోవడంలో అది కీలకపాత్ర పోషిస్తుంది. ఎప్పుడైనా స్వీయ అంగీకార ఆలోచనను వదులుకుంటారో అప్పుడు మీలో వ్యతిరేక ఆలోచనలు మొదలయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. చేస్తున్న పని ఏదైనా కావచ్చు. మీరు ఏ రంగంలోనైనా నిష్ణాతులై ఉండవచ్చు. సెల్ఫ్ యాక్సెప్టెన్సీ లేనిదే అక్కడ ఎదగలేరు. మంచి గుర్తింపును పొందలేరు. సక్సెస్ అస్సలు సాధించలేరు అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

అనుమానాలు - ఆచరణ - సక్సెస్

స్వీయ అంగీకారం తమపై అనుమానాలకు దారితీస్తుందని కొందరు భావిస్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. లోపాలను అంగీకరించడం, మిస్టేక్స్ సరిచేసుకోవడం వాస్తవానికి మంచి విషయమని పేర్కొంటున్నారు. అయితే టాక్సిక్ పీపుల్ వీటివిని దుర్వినియోగం చేసే అవకాశం కూడా లేకపోలేదు. అలాంటి అరుదైన సందర్భాల్లో కొంత జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. అంతేకానీ సెల్ఫ్ యాక్సెప్టెన్సీనే తప్పు పట్టడమంటే.. ఓటమిని కోరి తెచ్చుకోవడమే అంటున్నారు సైకాలజిస్టులు. స్వీయ అంగీకారం అనేది ఒక విధంగా వాస్తవాలను గుర్తించడం. దీనిని ఆచరణలో పెడితే అనేక విషయాలపట్ల మీలో ఉన్న సందేహాలు, అనుమానాలు తొలగి పోతాయి. పైగా అది మిమ్మల్ని బెస్ట్ పర్సన్‌గా తీర్చిదిద్దుతుంది. సక్సెస్ వైపు నడిపిస్తుంది. అందుకే మీరు విద్యార్థి, ఉద్యోగి, వ్యాపారవేత్త, మోటివేటర్.. ఇలా వృత్తి, ప్రవృత్తి ఏదైనా కానివ్వండి సెల్ఫ్ యాక్సెప్టెన్సీ ద్వారా మాత్రమే గొప్ప వ్యక్తులుగా మారుతారు.

పారదర్శకతకు మారు పేరు

మీ లోపాన్ని మీరు, మీ శరీరాన్ని మీరు, మీ పనిని మీరు స్వీయ అంగీకార భావంతో స్వీకరించినప్పుడు అందులో పారదర్శకతకు అవకాశం ఎక్కువ అంటున్నారు నిపుణులు. అంతే తప్ప ఇక్కడ మిమ్మల్ని మీరు అవమానించుకోవడమో, పొరపాటును అంగీకరించుకోవడమో అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ యాక్సెప్టెన్సీ అనేది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చగలిగే ‘అంగీకార భావం’గా నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల మిమ్మల్ని మీరు అనేక అంశాల్లో నియంత్రించుకోగలుగుతారు. సమాజంలో మార్పులను అంగీకరిస్తూ.. మీరు కూడా మారుతూ సక్సెస్ వైపు పరుగెడతారు. అలాగే ఇతరులతో పోల్చుకోకుండా ఉండటం, మీ ఆరోగ్యంపై మీరు దృష్టి పెట్టడం, స్ఫూర్తి పొందడం వంటివి సెల్ఫ్ యాక్సెప్టెన్సీలో భాగంగా ఉన్నప్పుడు మీరు సక్సెస్ ఫుల్ వ్యక్తులుగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.


Similar News