జీవితకాలాన్ని పెంచుతున్న టౌరిన్ విటమిన్.. అధ్యయనంలో వెల్లడి
మానవ శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే టౌరిన్ విటమిన్ సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితానికి దోహదం చేస్తుందని ఒక అధ్యయనం వెల్లడించింది.
దిశ, ఫీచర్స్: మానవ శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే టౌరిన్ విటమిన్ సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితానికి దోహదం చేస్తుందని ఒక అధ్యయనం వెల్లడించింది. వృద్ధాప్యం సంభవించిన మనుషుల్లో ఇది తగ్గిపోవడాన్ని బేస్ చేసుకొని, అది ఏ విధమైన పాత్ర పోషిస్తుందో తెలుసుకోవడానికి కొలంబియా యూనివర్సిటీకి చెందిన నిపుణులు పరిశోధనలు నిర్వహించారు. జంతువుల్లోనూ, మనుషుల్లోనూ వృద్ధాప్యానికి ఈ టౌరిన్(Taurine) లోపమే ప్రధాన కారణమని గుర్తించారు. అయితే ఇది తగ్గకుండా చూసుకోవడం.. ఆహారం, సప్లిమెంట్స్ ద్వారా పునరుద్ధరించడం వల్ల వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా అడ్డుకోవచ్చని చెప్తున్నారు.
టౌరిన్ లోపం పునరుద్ధరణ ప్రభావాన్ని తెలుసుకోవడానికి నిపుణులు ఎలుకలు, కోతులపై పరిశోధనలు నిర్వహించారు. ఇందులో భాగంగా 14 నెలల వయస్సుగల మొత్తం 250 ఆడ, మగ ఎలుకలను స్టడీ చేశారు. టౌరిన్ ప్రభావాన్ని గుర్తించేందుకు ప్రతీరోజు సగం ఎలుకలకు టౌరిన్ విటమిన్ ద్రావణాన్ని తాగించారు. మిగతావాటికి టౌరిన్ అందకుండా చూశారు. అయితే టౌరిన్ ద్రావణం తీసుకున్న ఆడ ఎలుకలలో 12 శాతం, మగవారిలో 10 శాతం సగటు జీవితకాలం పెరిగినట్లు, అవి ఆరోగ్యంగా ఉంటున్నట్లు గుర్తించారు. అదే విధంగా కోతుల్లో కూడా టౌరిన్ సప్లిమెంట్లు ఆరోగ్యాన్ని, జీవిత కాలాన్ని పెంచినట్లు మరో పరిశోధనలో గమనించారు.
ఇక మానవుల్లో టౌరిన్ పనితీరును పరిశీలించేందుకు.. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సుగల 12 వేలమంది యూరోపియన్ పెద్దలను పరిశీలించారు. మొత్తానికి టౌరిన్ లెవల్స్ అధికంగా ఉన్నవారిలో టైప్ 2 డయాబెటిస్, ఒబేసిటీ, బ్లడ్ ప్రెషర్ సమస్యలు తక్కువగా ఉంటున్నాయని.. ఇతరులతో పోల్చితే ఆరోగ్యంగా, చురుకుగా ఉంటున్నారని గుర్తించినట్లు కొలంబియా యూనివర్సిటీకి చెందిన ప్రధాన పరిశోధకుడు విజయ్ యాదవ్ పేర్కొన్నాడు. టౌరిన్ మనిషిలో జీవిత కాలాన్ని పెంచే అమృతం లాంటిదని అతను అభివర్ణించాడు.