70 ఏళ్ల తర్వాత తిరిగి ఒకటైన ప్రేమికుల జంట! ఆ ఎక్స్‌ప్రెషన్ హైలెట్
ఈ జంటను చూసి, సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. Korean war veteran has finally reunited with his first love.
దిశ, వెబ్‌డెస్క్ః ఒక్కసారి పుట్టిందంటే ఎప్పటికీ విడవనిది 'ప్రేమ' అంటుంటారు. ఈ డైలాగ్ కాస్త సినిమాటిక్‌గా ఉన్నా నిజ జీవితంలో చాలా మంది అలాంటి ప్రేమను అనుభవిస్తూనే ఉంటారు. ఇటీవల ఒక కొరియన్ యుద్ధ వీరుడు 70 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన మొదటి ప్రేమను తిరిగి కలవడం వార్తల్లో నిలిచింది. డువాన్ మన్, పెగ్గీ యమగుచి జపాన్‌లో 70 ఏళ్ల క్రితం ప్రేమలో పడ్డారు. ప్రేమికులిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ, యుద్దం తర్వాత డువాన్‌ను అమెరికాకు తిరిగి పంపించేయడంతో కాస్త దూరం ఏర్పడింది. అంతకుమించి, వీరిద్దరి ప్రేమను వ్యతిరేకించిన డువాన్ తల్లిదండ్రులు పెగ్గి రాసే ప్రేమ లేఖల్ని కాల్చేయడం, డువాన్ వివాహం కోసం దాచుకున్న డబ్బుల్ని ఖర్చు చేయడం వంటి పనుల వల్ల ఈ ప్రేమికులకు జీవితకాల ఎడబాటు తప్పలేదు.
మార్గం లేక ఇద్దరూ వేరే వ్యక్తులను పెళ్లి చేసుకొని, కొత్త జీవితాలు, పిల్లలు, కుటుంబంతో బిజీ అయ్యారు. అయితే, డువాన్ మాత్రం పెగ్గీ ప్రేమను మనసులో, ఆమె ఫోటోను పర్సులోనే ఉంచుకున్నాడు. ఎప్పటికైనా పెగ్గీని కలుసుకొని, తాను జపాన్ తిరిగి ఎందుకు రాలేకపోయాడో వివరించాలని అనుకున్నాడు. అదే ఆశతో దశాబ్దాలు గడిపాడు. చివరికి, తన పిల్లల సహాయంతో పెగ్గీని కలుసుకున్నాడు. పెగ్గీ తన కొడుక్కి డువాన్ అని పేరు పెట్టిందని తెలిసి, పరవశంతో చలించిపోయాడు. మలిదశలో ఇద్దరి తొలి పరిచయం కన్నుల పండుగలా జరుపుకున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంటే, నెటిజనులు ఈ జంటను చూసి, సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. మీరూ చూడండి..