2024 Review : రీల్స్ పిచ్చి..! వైరల్ మోజు!!

2024 Review : రీల్స్ పిచ్చి..! వైరల్ మోజు!!

Update: 2024-12-30 14:31 GMT

దిశ, ఫీచర్స్ : కొన్ని విషయాలు వినడానికి వింతగా అనిపిస్తాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అసలు ఇది నిజమా అనిపించేలా కొన్ని ఉంటే.. అదెలా సాధ్యమనే సందేహాన్ని కలిగించేవి ఇంకొన్ని ఉంటాయి. మరికొన్ని భయాందోళనలు కలిగించేవిగానూ ఉంటాయి. మొత్తానికి 2024లో ఇలాంటి వింతలు, విశేషాలు, వైరల్ సంఘటనలు అనేకం జరిగాయి. కొన్ని నెటిజన్లను ఆకట్టుకున్నాయి. మరికొన్ని ఈతరం వింత పోకడలు ప్రమాదకరమని హెచ్చరించాయి. ఆశ్చర్యాన్నో, ఆవేదనో, ఆందోళననో కలిగించినవి కొన్నయితే.. కడుపుబ్బా నవ్వించినవి మరికొన్ని.. ఇంకొన్ని ఏదో ఒక సందేశమిస్తూ ప్రజలను అప్రమత్తం చేశాయి. మొత్తానికి ఈ ఏడాదిలో అటువంటి ముఖ్యమైన వైరల్ సంఘటనలు, సమాచారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బిల్డింగ్‌పై నుంచి వేలాడిన యువతి..

2024లో అందరినీ ఆశ్చర్యంతోపాటు ఆందోళన కలిగించిన డేంజర్ స్టంట్లు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఇన్ స్టా రీల్ కోసం ఓ యువతి చేసిన భయంకరమైన స్టంట్ కూడా ఉంది. తన స్నేహితుడి చేయి పట్టుకొని భవనంపై నుంచి వేలాడూ ఆ యువతి చేసిన స్టంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కాగా ఈ ఘటన మహారాష్ట్ర, పుణెలోని జంబుల్ వాడి సమీపంలో గల స్వామి నారాయణ మందిర్ సమీపంలో జరిగింది. ఓ పాడుబడిన బిల్డింగ్‌పైకి ఓ యువతి, ఇద్దరు యువకులు ఎక్కారు. ఏదైనా వెరైటీ రీల్ చేయాలని భావించారు. బిల్డింగ్‌పై యువకుడు పడుకొని యువతి చేయి పట్టుకోగా.. ఆమె కిందకు వేలాడింది. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఈ భయంకరమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా చాలామంది యువత పోకడలు, రీల్స్ పిచ్చిపై ఆందోళన వ్యక్తం చేశారు.

వెరైటీ కోసం ప్రాణం మీదకు

ఔరంగా బాద్‌లో శ్వేత అనే ఓ యువతి ఇన్ స్టా రీల్ కోసం కొత్తగా ట్రై చేయాలనుకుంది. తనకు డ్రైవింగ్ రాకపోయినా కారు నడుపుతూ రీల్ చేస్తానని స్నేహితుడికి చెప్పింది. ఇంకేముంది డ్రైవింగ్ చేస్తున్నట్లు ఫోజులిచ్చి బ్రేక్ కు బదులు యాగ్జిలరేటర్ తొక్కడంతో కారు కొండపై నుంచి లోయలో పడి ప్రాణాలు కోల్పోయింది.

రైలు పట్టాలపై పడుకొని

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా, లహర్ పూర్ చెందిన ఓ కుటుంబం వెరైటీగా రీల్ చేయాలనుకుంది. లఖీంపూర్ ఖిరీ జిల్లలాలోని హర్గవ్ సమీపంలోని క్యోతి గ్రామంలో ఓ శుభ కార్యానికి వెళ్లిన మహ్మద్ అహ్మద్, నజ్రీన్, వారి రెండేళ్ల కుమారుడు సమీపంలోని రైలు పట్టాలపై రీల్స్ తీసుకునే పనిలో నిమగ్నమైపోయారు. వెనుకాల నుంచి లక్నో నుంచి మైలానికి వెళ్తున్న ప్యాసింజర్ రైలు వస్తున్నా వీరు పట్టించుకోనంత పరధ్యానంలో మునిగిపోవడంతో ఆ రైలు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది.

ఫొటో దిగుతూ లోయలోకి..

ఉత్తరా ఖండ్‌, హరిద్వార్‌లోని మానసా దేవీ హిల్స్ చూడ్డానికి ఓ యువతి తన కుటుంబంతో వెళ్లింది. అందరూ కలిసి ఫొటోలు దిగారు. అనంతరం తనను వీడియో, ఫొటోలు తీయాలని, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పింది. కొండ అంచువరకూ వెళ్లి ప్రమాదవశాత్తు 70 మీటర్ల లోతైన లోయలో పడి ప్రాణాలు కోల్పోయింది.

వెరైటీ కోసం ఉరి వేసుకుంటే..

వరంగల్ జిల్లా నర్సంపేటలో అజయ్ (23) అనే ఓ యువకుడు ఇన్ స్టాలో రీల్స్ చేస్తుంటాడు. ఎక్కవ వ్యూస్ రావాలంటే ఏదైనా కొత్తగా, వెరైటీగా చేయాలనే ఉద్దేశంతో మెడకు తాడు బిగించి ఉరివేసుకుంటున్నట్లు రీల్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే తనకు తాను ఈ సంఘటనను సెల్ ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకునే క్రమంలో ఒక్కసారిగా మెడకు ఉన్న తాడు బిగుసుకుపోయింది. ఇంకేముంది ప్రాణాలు కోల్పోయాడు.

నడిరోడ్డుపై పడుకుని..

ఓ వ్యక్తి నడిరోడ్డుపై శవంలా పడుకొని రీల్ చేయాలనుకున్నాడు. తను అలా చేస్తుంటే దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనేది అతని కోరిక. విషయం ఫ్రెండ్స్‌కు చెప్పేశాడు. యూపీలోని కస్ గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 23 ఏండ్ల ముఖేశ్ కుమార్ నడిరోడ్డపై ఎర్రటి చాప పరచుకొని, మెడలో దండ వేసుకొని, ఒంటిపై తెల్లటి గుడ్డ కప్పుకొని, ముక్కులో దూది పెట్టుకొని అచ్చం శవంలా పడుకున్నాడు. అతని స్నేహితులు వీడియో తీయడం ప్రారంభించారు. వీడియో తీయడం అయిపోయాక అతని స్నేహితులు అందరూ తెగ నవ్వుతుంటే ముఖేష్ ఒక్కసారిగా పైకి లేచి కూర్చున్నాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కాగా అతను ఇన్ స్టా రీల్ కోసం ఇదంతా చేశాడని తెలిసి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి వారిని అదుపు చేయాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఇలా.. ఒకటో రెండో కాదు, భయంకరమైన, జుగుప్పా కరమైన స్టంట్లతో రీల్స్ చేస్తున్న అనేక వీడియోలో 2024లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. మొత్తానికి రీల్స్ పిచ్చి జీవితాలను నాశనం చేస్తుందనే ఆందోళనలు అధికంగా వ్యక్తం అయ్యాయి.

రోజూ మ్యాగీ చేసి పెడుతోందని..

ఏవో సీరియస్ ఇష్యూస్ వల్ల ఇక కలిసి ఉండటం సాధ్యం కాదనే నిర్ణయానికి వస్తే గానీ దాదాపు ఎవరూ డివోర్స్ కోరుకోరు. కానీ కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అలా కాదు. చాలా విచిత్రమైన కారణాలతో తన భార్య నుంచి విడాకులు కోరాడు. ఏంటంటే.. ఆమె సరిగ్గా వంట చేయడం లేదని, రోజూ బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ మ్యాగీనే చేసి పెడుతోందని, అది తినలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే తనకు డివోర్స్ కావాలని కోర్టులో కేస్ ఫైల్ చేశాడు. ఫైనల్లీ వారిద్దరూ విడాకులు తీసేసుకున్నారు.

పరీక్షలకు ప్రిపేర్ అయిండని..

పెళ్లయ్యాక తన పార్ట్‌నర్ కాంపిటీషన్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరై ఉద్యోగం సంపాదిస్తానంటే.. ఎవరు మాత్రం కాదంటారు. పైగా సంతోషిస్తారు. భోపాల్‌కు చెందిన ఓ మహిళ మాత్రం అందుకు భిన్నమని నిరూపించింది. తన భర్త పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడం తనకు నచ్చలేదం లేదని, చదువు బిజీలో పడి తనను పట్టించుకోవడం లేదని కోర్టులో విడాకుల కేసు దాఖలు చేసింది.. కాగా 2024లో భోపాల్ లీగల్ సర్వీస్ అథారిటీ కౌన్సెలింగ్ సమయంలో ఈ కేసు గురించి చర్చకు రాగా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయి ప్రపంచాన్ని విస్తు గొలిపింది ఈ సంఘటన.

లడ్డూ తినాలని టార్చర్!

లడ్డూ కావాలా నాయనా.. ఈ యాడ్ ఎంత ఫేమస్ అయిపోయిందో తెలుసు కదా.. లడ్డు అంటే అందరికీ ఇష్టమే కాబట్టి ఆ యాడ్ అంత ఫేమస్ అయుంటుంది. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మీరట్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి మాత్రం అసలు లడ్డూ అంటేనే భయపడే పరిస్థితికి చేరుకున్నాడట. పైగా రోజూ భార్య తనను లడ్డూ తినాలని టార్చర్ పెడుతోందని, అందుకే తనకు విడాకులు కావాలని కేస్ ఫైల్ చేశాడు. 2024లో దీనికి సంబంధించిన తీర్పు వెల్లడైంది. సదరు వ్యక్తి వాదన విని కోర్టులో లాయర్లు, జడ్జి అందరూ ఆశ్చర్యపోయారు. చివరికి విడాకులు మంజూరయ్యాయి. అయితే తన భార్య ఎవరో ఒక తాంత్రికుడిని నమ్మి ఇలా చేస్తోందని, అతని మాటలు విని తనకు రోజూ నాలుగు లడ్డూలు తప్ప వేరే పదార్థాలేవి తిననివ్వడం లేదని ఆ విడాకులు కోరిన వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఈ న్యూస్ ప్రజలు ఆశ్చర్యానికి గురిచేసింది.

స్నానం చేస్తలేడని డివోర్స్..

ఇది మరో వింత.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఆగ్రాకు చెందిన ఓ మహిళ పెళ్లైన 40 రోజులకే డివోర్స్ కోసం కోర్టు మెట్లెక్కింది. పాపం ఎంత టార్చర్ అనుభవిస్తే ఇలా చేసిందో అనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఆమె పేర్కొన్న కారణం ఏంటంటే.. తన భర్త రోజూ స్నానం చేయడం లేదట. నెలకొసారే చేస్తాడట, అయితే వారానికి ఒకసారి గంగాజలం మాత్రం తలపై చల్లుకుంటాడని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ అధికారులకు ముందు ఆమె వాపోయింది. శుభ్రత పాటించనందున అతని వద్ద చెడు వాసన వస్తోందని, అందుకే డివోర్స్ కావాలని కోరింది. కాగా ఈ విషయాన్ని ఆమె భర్త కూడా అంగీకరించాడు. 2024లో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కొందరికి ఎంటర్టైన్మెంట్ ఇస్తే.. మరి కొందరు ఈ జనాలేంట్రా బాబూ ఇలా తయారయ్యారు అనుకునేలా చేసింది.

ప్రేమ ఎక్కువైందని..

ఏ స్త్రీ అయినా భర్త తనతో ప్రేమగా ఉండాలని కోరుకుంటుంది. యూపీలోని సంభల్ జిల్లాకు చెందిన ఓ మహిళకు మాత్రం అబ్బే నాకస్సలు నచ్చదు అనేసింది. పైగా తన భర్త తనను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని షరియత్ కోర్టును ఆశ్రయించగా.. ఇది విన్నవారంతా ఆశ్చర్యపోయారు. కాగా ఆమె వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఎక్కువ ప్రేమించడమనే కారణంతో డివోర్స్ ఇవ్వడం మంజూరు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పిందట. 2024లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన ఈ న్యూస్ చూసి ‘నవ్వాలో, ఏడవాలో, సమాజం ఇలా తగలడినందుకు బాధపడాలో.. తెలీడం లేదు’ అంటూ నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. భార్యను భర్త ప్రేమించడం కూడా తప్పెలా అవుతుంది చెప్మా అంటూ కొందరు ప్రశ్నల వర్షం కురిపించారు. మరికొందరు పిచ్చి పది రకాలంటే ఏమో అనుకున్నం గానీ ఇట్లనే ఉంటదేమోనని కామెంట్లు చేశారు.

అనంత్ అంబానీ పెళ్లి

వైరల్ కంటెంట్‌కి కాదేదీ అనర్హమన్నట్లు.. ఏదో ఒక అట్రాక్షన్, ఆసక్తి రేకెత్తించే గుణం ఉంటే చాలు. అలాంటి వార్తలు, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. 2024లో అలాంటివి చాలానే జరగగా వాటిలో సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీల పెళ్లిళ్లు కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి కూడా అలాంటిదే.. రాధికా మర్చంట్‌తో అతని పెళ్లి ఫిక్స్ అయ్యాక జామ్ నగర్ నుంచి జెనోవా వరకు 134 రోజులుపాటు జరిగిన పెళ్లి వేడుకల వరకు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్‌, వారి పెళ్లి ముచ్చట్లు, వీడియోలు, దినచర్యలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మోత మోగించాయి. అంతేకాదు 2024లో న్యూ యార్క్ టైమ్స్ పేర్కొన్న మోస్ట్ స్టైలిష్ పీపుల్ జాబితాలో ఈ జంట కూడా చోటు దక్కించుంకుంది. అంతలా వైరల్ అయింది మరి. 

Tags:    

Similar News