ఢిల్లీని తాకిన విశాఖ ఉక్కు ఉద్యమం.. దద్దరిల్లిన జంతర్‌మంతర్
దిశ, ఏపీ బ్యూరో : విశాఖ ఉక్కు ఉద్యమం ఢిల్లీని తాకింది. ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ నినాదాలతో దేశ రాజధాని దద్ధరిల్లింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించ వద్దంటూ జంతర్ మంతర్ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు కార్మిక ఉద్యోగ సంఘాలు సోమవారం మహాధర్నా చేపట్టాయి. ఈ మహాధర్నాలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్‌కు గనులు […]
దిశ, ఏపీ బ్యూరో : విశాఖ ఉక్కు ఉద్యమం ఢిల్లీని తాకింది. ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ నినాదాలతో దేశ రాజధాని దద్ధరిల్లింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించ వద్దంటూ జంతర్ మంతర్ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు కార్మిక ఉద్యోగ సంఘాలు సోమవారం మహాధర్నా చేపట్టాయి. ఈ మహాధర్నాలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించాలని, అప్పులను ఈక్విటీలుగా మార్చాలని నినదించారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పోరాట సమితి కమిటీ నేత ఆదినారాయణ మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగాలతో విశాఖ ఉక్కు కేంద్ర కర్మాగారాన్ని సాధించినట్లు తెలిపారు. ఇప్పటివరకు కేంద్రం స్టీల్‌ప్లాంట్‌కు ఎలాంటి గనులు కానీ, డబ్బులు కానీ ఇవ్వకపోయినా సొంత లోన్‌లు తీసుకొని అప్పులు చెల్లించుకుంటున్నామన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్‌లో ఎంతోమంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని వారి పొట్టకొట్టొద్దని కేంద్రాన్ని కోరారు. విశాఖ ఉక్కు కోసం నిర్వాసితులు 22 వేల ఎకరాలు ఇచ్చారని, ఇప్పటికీ వారిలో 8 వేల మంది ఉపాధి లేక అవస్థలుపడుతున్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని లేకపోతే జాతీయ స్థాయిలో 1966లో 32 మంది ప్రాణ త్యాగాలతో ఏవిధంగా విశాఖ ఉక్కును సాధించుకున్నారో.. అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా సాధించుకుంటామని హెచ్చరించారు.
వైసీపీ ఎంపీల సంఘీభావం
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ధ్యేయంగా విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచింది. స్టీల్ ప్లాంట్ కార్మిక నేతల ధర్నాలో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డితోపాటు ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, ఎంవీవీ సత్యనారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్‌లు పాల్గొన్నారు. ‘సేఫ్ విశాఖ స్టీల్’ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.
విశాఖలోనూ కొనసాగుతున్న ఆందోళనలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న మహాధర్నాకు మద్దతుగా ప్రజా సంఘాలు నిరసనలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు సత్తిబాబు మాట్లాడుతూ అనేక పోరాటాలు, త్యాగాల ఫలితంగా స్టీల్ ప్లాంట్ సాధించుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేటికరణ చేస్తే వేలాది ఉపాధి అవకాశాలు పోతాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్లకు మేలు చేసేందుకు ఉన్న ప్రభుత్వ రంగం పరిశ్రమలను ఇన్సూరెన్స్, ఎల్‌ఐసి బ్యాంక్‌లు, రైల్వే మరియు రక్షణ రంగాన్ని సైతం ప్రేటికరణ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రాష్ట్రా రెల్లి హక్కుల పోరాట సమితి వ్వవస్థాపక అధ్యక్షులు యర్రంశెట్టి పాపారావు మాట్లాడుతూ ప్రభుత్వ పరిశ్రమలు వలన దళిత, గిరిజన ప్రజలకు ఉద్యోగాలు పోందుతున్నారు. ప్రభుత్వ పరిశ్రమలు లేకపొతే దళిత, గిరిజనలకు ఉపాధి అవకాశాలు ఉండవన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పాపారావు డిమాండ్ చేశారు.